ఊహలకు జీవం పోసే.. యానిమేటర్ | Animator courses offered using Advanced technology | Sakshi
Sakshi News home page

ఊహలకు జీవం పోసే.. యానిమేటర్

Published Wed, Jun 25 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

ఊహలకు జీవం పోసే.. యానిమేటర్

ఊహలకు జీవం పోసే.. యానిమేటర్

ఛోటా భీమ్, హనుమాన్, రామాయణ, మహాభారత్, డోరేమాన్, ష్రెక్ లాంటి యానిమేషన్ చిత్రాలు ప్రేక్షకులకు కనువిందు కలిగిస్తాయి. సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. కేవలం ఊహాలోకానికే పరిమితమైన ఈ పాత్రలు కళ్లముందు కదలాడుతాయి. ఆడుతాయి, పాడుతాయి, శత్రువులతో పోరాడుతాయి, లెక్కలేనన్ని సాహసాల్లో పాల్గొంటాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి. చూపరులకు విజ్ఞానం, వినోదం పంచుతాయి. కాల్పనిక పాత్రలు దృశ్యరూపంలోకి మారి, ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నాయి? యానిమేటర్ల కృషితోనే ఇదంతా సాధ్యమవుతోంది. బొమ్మను గీసి, ప్రాణం పోసి, కనుల ముంగిట సజీవంగా కదలాడేలా చేసే అపర బ్రహ్మలు యానిమేటర్లు.
 
 అప్‌కమింగ్ కెరీర్
 ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యానిమేషన్ రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. వినూత్నమైన ఊహాశక్తి, సృజనాత్మకత, కనువిందైన రంగురంగుల బొమ్మలు గీసే నేర్పు ఉంటే చాలు.. యానిమేషన్ రంగంలో అద్భుతాలు సృష్టించొచ్చు. తగిన అనుభవం సంపాదిస్తే దేశ విదేశాల్లో రూ.లక్షల్లో వేతనాలు అందుకోవచ్చు. ప్రజ్ఞావంతులైన యానిమేటర్లకు విదేశాలు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. ఉన్నత హోదాలను కట్టబెడుతున్నాయి. హాలీవుడ్‌లో భారతీయ యానిమేటర్లు సత్తా చూపుతున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ఎన్నో చిత్రాలు భారత యానిమేటర్ల చేతుల్లోనే రూపుదిద్దుకోవడం విశేషం.
 
 యానిమేషన్ నిపుణులకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. దీంతో మన దేశంలోని టెక్నాలజీ, ఆర్ట్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్‌లో ఎన్నో స్పెషలైజేషన్లను ఆఫర్ చేస్తున్నాయి. యానిమేషన్ రంగం ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుంది. 90 నిమిషాల నిడివిగల చిత్రాన్ని రూపొందించేందుకు కొన్నిసార్లు వారాలు, నెలలు, సంవత్సరాలపాటు కూడా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. యానిమేటర్లకు సహనం, ఓర్పు చాలా అవసరం. సాధారణంగా యానిమేటర్లకు చిత్రలేఖనంలో మంచి పట్టు ఉండాలి. అయితే 3డీ యానిమేషన్ ఆర్ట్‌తో పెయింటింగ్‌లో పట్టులేకున్నా అద్భుతమైన యానిమేషన్ చిత్రాలను రూపొందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
 
 అవకాశాలు పుష్కలం
 యానిమేటర్ ఒక కళాకారుడు. తన ఊహాశక్తితో పాత్రలను సృష్టించి, అవి పరస్పరం సంభాషించుకొనేలా చేస్తాడు. యానిమేటర్లకు ప్రస్తుతం ఎన్నో రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ఫిలిం, టెలివిజన్, వీడియో గేమ్స్, ఇంటర్‌నెట్ వంటి వాటిలో యానిమేషన్ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. యానిమేషన్, గే మింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ శరవేగంగా విస్తరిస్తోంది.
 
 అర్హతలు
 స్కెచ్చింగ్‌పై మంచి పట్టు, యానిమేషన్‌పై నిజమైన ఆసక్తి ఉంటే ఈ రంగంలోకి ప్రవేశించాలి. మొదట యానిమేషన్ కోర్సులో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తిచేయాలి. వీటికి కనీస అర్హత ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్(పీజీ) చేసి అర్హతలు పెంచుకుంటే అవకాశాలు మెరుగవుతాయి. ఐడీసీ-ముంబయిలో యానిమేషన్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేయడానికి ఆర్కిటెక్చర్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, ఫైనార్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు.
 
 కావాల్సిన స్కిల్స్
-     విభిన్నమైన ఊహాశక్తి ఉండాలి.
-     రంగుల మేళవింపు, బొమ్మల పరిమాణంపై మంచి అవగాహన అవసరం.
-     ఎలాంటి ఒత్తిళ్లనైనా తట్టుకొని పనిచేసే సామర్థ్యం ఉండాలి. ఇతరులతో కలిసి పనిచేసే నేర్పు తప్పనిసరి.
-     మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. యానిమేషన్ రంగంలో ప్రోగ్రామర్స్, ఇలస్ట్రేటర్స్, డిజైనర్లు, స్టోరీ బోర్డు ఆర్టిస్టులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది.
 
 యానిమేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
-     బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-నోయిడా...  వెబ్‌సైట్: https://www.bitmesra.ac.in/
-     ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్(ఐడీసీ), ఐఐటీ-ముంబయి...    వెబ్‌సైట్: http://www.idc.iitb.ac.in/  మాయా అకాడమీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సినిమాటిక్స్...
 వెబ్‌సైట్: ww.maacindia.com
 -    టూంజ్ అకాడమీ-తిరువనంతపురం... వెబ్‌సైట్: http://toonzacademy.com/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement