హైజాకింగ్ వ్యతిరేక బిల్లుకు లోక్‌సభ ఆమోదం | Anti Hijacking Bill passed in Lok Sabha | Sakshi
Sakshi News home page

హైజాకింగ్ వ్యతిరేక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Published Wed, May 11 2016 11:34 PM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM

హైజాకింగ్ వ్యతిరేక బిల్లుకు లోక్‌సభ ఆమోదం - Sakshi

హైజాకింగ్ వ్యతిరేక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

రాష్ట్రీయం
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని మృతి
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు (95) అనారోగ్యంతో మే 9న హైదరాబాద్‌లో మరణించారు. కరీంనగర్‌కు చెందిన ఆయన సిరిసిల్ల నుంచి ఐదుసార్లు, మెట్టపల్లి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు.
 
వ్యవసాయ శాఖ సమాచార వ్యవస్థ హరితప్రియకు ఐరాస అవార్డు
ఏపీ వ్యవసాయ శాఖ అనంతపురంలో ప్రారంభించిన సంక్షిప్త సమాచార వ్యవస్థ (ఎస్‌ఎంఎస్) హరితప్రియకు
2016కు ఐక్యరాజ్యసమితి అవార్డు లభించింది. ఐరాసకి చెందిన వరల్డ్ సమ్మిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ (డబ్ల్యూఎస్‌ఐఎస్) ఈ అవార్డును అందిస్తోంది.

 స్వచ్ఛభారత్ ఆధ్యాత్మిక నగరాల్లో తిరుపతి
వచ్చే ఏడాది మార్చిలోగా స్వచ్ఛభారత్ లక్ష్యాలను పూర్తిచేయాల్సిన ఆధ్యాత్మిక నగరాల జాబితాలో తిరుపతికి చోటు దక్కింది. కేంద్రం ఈ జాబితా కింద అలహాబాద్, హరిద్వార్‌లతోపాటు మొత్తం 50 నగరాలను ఎంపిక చేసింది.

సైన్స్ అండ్ టెక్నాలజీ
సూర్యుడు, భూమికి మధ్యలో బుధ గ్రహం

సూర్యుడి చుట్టూ అత్యంత వేగంగా తిరిగే బుధ గ్రహం మే 9న భూమికి, సూర్యుడికి మధ్య అడ్డువచ్చింది. సాయంత్రం 4.42 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు ఈ సంఘటన చోటు చేసుకుంది. బుధ గ్రహం సూర్యుడికి దగ్గరగా పరిభ్రమిస్తున్నప్పుడు, అది సూర్యుడిపై ఓ చిన్న నల్లని చుక్కలా కన్పించింది.

 చైనాలో అతి పొడవైన కీటకం  
ప్రపంచంలోనే అతి పొడవైన కీటకాన్ని దక్షిణ చైనాలో కనుగొన్నట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ మే 5న పేర్కొంది. కర్రలపై ఉండే 62.4 సెంటీ మీటర్ల పొడవు గల ఈ కీటకాన్ని రెండేళ్ల కిందట దక్షిణ చైనాలోని గువాంగ్జీ ప్రావిన్స్‌లో కనుగొన్నారు. మలేసియాకు చెందిన 56.7 సెం.మీ పొడవైన కీటకం ఇప్పటివరకు అత్యంత పొడవైందిగా గుర్తింపు పొందింది.

వార్తల్లో వ్యక్తులు
 మహేంద్రదేవ్‌కు మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డు

ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ ఉపకులపతి సూర్యదేవర మహేంద్రదేవ్‌కు 2016కి  మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డు లభించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు.

 స్విట్జర్లాండ్‌లో యష్‌చోప్రా కాంస్య విగ్రహం
బాలీవుడ్ డెరైక్టర్, నిర్మాత యష్‌చోప్రా కాంస్య విగ్రహాన్ని స్విట్జర్లాండ్‌లో ఏర్పాటు చేశారు. యష్‌చోప్రా       సతీమణి పమేలా, కోడలు రాణీముఖర్జీ మే 4న ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

జాతీయం
 హైజాకింగ్ వ్యతిరేక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

హైజాకింగ్ వ్యతిరేక బిల్లు     -2014ను లోక్‌సభ మూజువాణి ఓటుతో మే 9న ఆమోదించింది. ఈ బిల్లులో విమానాల హైజాకింగ్ నిర్వచనాన్ని విస్తృతపరిచారు. ఇందులో భాగంగా విమానశ్రయ సిబ్బంది చనిపోయినా హైజాకర్లకు మరణశిక్ష విధించనున్నారు. ఇప్పటివరకు విమాన సిబ్బంది, ప్రయాణికులు, భద్రతా సిబ్బంది, బందీలు తదితరులు మరణి స్తేనే హైజాకర్లకు ఉరిశిక్ష విధించేవారు.

 భారత నౌకాదళం కొత్త చీఫ్‌గా సునీల్ లంబా
భారత నౌకాదళం కొత్త చీఫ్‌గా వైస్ అడ్మిరల్ సునీల్ లంబా నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ మే 5న ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ నావికాదళ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నౌకాదళ అధిపతిగా ఉన్న ఆర్కే ధోవన్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు.

అంతర్జాతీయం
  బ్రిటన్‌లో తొలి ముస్లిం మేయర్‌గా సాదిక్ ఖాన్

బ్రిటన్ రాజధాని లండన్ మేయర్‌గా సాదిక్ ఖాన్ మే 7న ప్రమాణస్వీకారం చేశారు. దీంతో బ్రిటన్‌లో మేయర్ పదవి చేపట్టిన తొలి ముస్లింగా రికార్డులకెక్కారు. పాకిస్తాన్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్ లేబర్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసి కన్సర్వేటివ్ పార్టీ అభ్యర్థి జాక్ గోల్డ్‌స్మిత్‌పై 57 శాతం ఓట్లతో విజయం సాధించారు.

డిమెన్షియాపై నివారణకు స్మార్ట్ గేమ్
మనుషుల్లో తీవ్ర మతిమరుపునకు కారణమయ్యే డిమెన్షియాను తొలిదశలోనే నిర్ధారించేందుకు ఉపయోగపడే స్మార్ట్‌ఫోన్ గేమ్‌ను లండన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దీనికి ‘ సీ హీరో క్వెస్ట్’ అని పేరుపెట్టారు. ఇది ఆయా ప్రాంతాల్లో సంచరించే మనుషులకు సంబంధించిన సమాచారాన్ని పెద్దఎత్తున సేకరిస్తుంది.

ఆర్థికం
 వృద్ధిరేటు 7.5 శాతంగా ఐఎంఎఫ్ అంచనా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 7.5 శాతంగా ఉండనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ మే 3న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. బలహీన ఎగుమతులు, రుణ వృద్ధిరేటు తక్కువగా ఉన్నప్పటికీ పటిష్ట వినియోగ డిమాండ్ భారత వృద్ధికి తోడ్పడుతుందని       తెలిపింది.

ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు,
ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement