లోక్సభలో 'నీర్జా'కు నీరాజనాలు
న్యూఢిల్లీ: విమానాల హైజాకింగ్ వ్యతిరేక బిల్లు 2014 (యాంటీ హైజాకింగ్ లా)కు లోక్ సభలో సోమవారం ఆమోద ముద్ర పడింది. సవరించిన ఈ బిల్లు ప్రకారం విమానాల హైజాకింగ్‌కు పాల్పడిన వారికి ఇకముందు మరణదండన విధిస్తారు. బిల్లుపై చర్చ సందర్బంగా హైజాకర్లు కాల్చి చంపిన నీర్జా భానోత్ కు సభ్యులు నీరాజనాలు పలికారు.
ఈ బిల్లు పైగా చర్చ సందర్భంగా 1986 లో హైజాక్ విమానంలో మరణించిన పాన్ ఏఎం ఎయిర్ హోస్టెస్ నీర్జా భానోత్ సాహసాన్ని సభ్యులు కొనియాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ప్రయాణికులు సురక్షితంకోసం ఆమె తన జీవితాన్ని పణంగా పెట్టారని ప్రశంసించారు. ఆమె ఒక సాహసోపేత మహిళ అనీ, ఆమె తెగువపై బాలీవుడ్ లో ఇటీవల చిత్రం కూడా విడుదలైందని టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ గుర్తు చేశారు. టీఆర్ఎస్ ఎంపీ బీఎన్ గౌడ్ బిల్లును సమర్ధిస్తూ మాట్లాడుతూ.. బాధితులకు నష్టపరిహారం అందించేలా పటిష్టయైన వ్యవస్థను రూపొందించాలన్నారు. అమెరికాకు చెందిన పాన్ ఏఎం కంపెనీ ఇప్పటికీ భారత సిబ్బందికి నష్టపరిహారం చెల్లించలేదన్నారు.
నీర్జా భానోత్ , సీనియర్ అటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న ముంబై -న్యూ యార్క్ పాన్ ఏఎం విమానాన్ని కరాచీలో ఉగ్రవాదులు హైజాక్ చేశారు. సెప్టెంబర్ 5, 1986 లో ప్రయాణీకులను కాపాడే క్రమంలో ఉగ్రమూకల తూటాలకు నిర్జా బలి అయ్యారు. ఆమె ధైర్యసాహసాలకుగాను భారతదేశం అత్యున్నత శాంతి సేనా పురస్కారం అశోక్ చక్ర ప్రకటించింది. కాగా ఇంతకుముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్యసభ ఇటీవల ఆమోద ముద్ర వేసినసంగతి తెలిసిందే.