క్యాట్.. మలిదశలో రాణించాలంటే
ఐఐఎంలలో ప్రవేశానికి వీలు కల్పించే క్యాట్ ఫలితాలు విడుదలయ్యాయి.. దీంతో నిర్దేశిత అర్హత సాధించిన అభ్యర్థులు ప్రవేశ ప్రక్రియలో కీలకమైన రెండో దశకు సన్నాహకాలు ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది.. ఈ క్రమంలో వివిధ ఐఐఎంలు అనుసరిస్తున్న ప్రవేశ విధానాలపై విశ్లేషణ..
అన్ని ఐఐఎంలు క్యాట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తాయి. వీరికి తర్వాతి దశలో రిటెన్ ఎబిలిటీ టెస్ట్ (డబ్ల్యూఏటీ), గ్రూప్ డిస్కషన్ (జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ (పీఐ)లు నిర్వహించి అడ్మిషన్‌ను ఖరారు చేస్తున్నాయి. ఆయా దశలకు ఇచ్చే వెయిటేజీ ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి వేర్వేరుగా ఉంటుంది.
ముందుగా:
క్యాట్ కటాఫ్ ఆధారంగా, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల కంటే ముందుగా క్యాట్ పర్సంటైల్‌తోపాటు, ఫ్రొఫైల్ పేరిట పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ కోర్సు వరకు అకడమిక్ రికార్డ్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, జండర్ డైవర్సిటీ, అకడమిక్ డైవర్సిటీ అంశాలకు నిర్దిష్ట శాతాల్లో గరిష్టంగా వంద శాతం వెయిటేజీకి గణిస్తున్నాయి. ఈ శాతాలు ఒక్కో ఐఐఎంకు ఒక్కో విధంగా ఉంటాయి. అకడమిక్ డైవర్సిటీ విధానం మేరకు.. అభ్యర్థులను టెక్నికల్, నాన్-టెక్నికల్‌గా వర్గీకరించి ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నాయి. అదే విధంగా మహిళల సంఖ్య పెంచేందుకు కూడా జండర్ డైవర్సిటీ పేరుతో ఒకటి నుంచి రెండు శాతం వెయిటేజీ కేటాయిస్తున్నాయి. సాధారణంగా ఐఐఎంలన్నీ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కు 5-10 శాతం వెయిటేజీ కల్పిస్తున్నాయి. పదో తరగతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు 10-15 శాతం వెయిటేజీ, ప్రొఫెషనల్ కోర్సుకు 5 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి.
ఒక్కో ఐఐఎం ఇలా:
ఐఐఎం అహ్మదాబాద్ అకడమిక్ రిటెన్ టెస్ట్ (ఏడబ్ల్యూటీ), పర్సనల్ ఇంటర్వ్యూ అనే రెండు దశలాధారంగా ప్రవేశం కల్పిస్తుంది.ఐఐఎం రాంచీ, రాయ్‌పూర్, కాశీపూర్, రోహ్‌తక్, ఉదయ్‌పూర్, త్రిచి.. కామన్ అడ్మిషన్ ప్రాసెస్ విధానంలో ఉమ్మడిగా ప్రవేశాలను చేపడుతున్నాయి. ఇవి కూడా డబ్ల్యూఏటీ, పీఐ అనే దశలను నిర్వహిస్తున్నాయి.
ఐఐఎం-బెంగళూరు, కోల్‌కతా, ఇండోర్ డబ్ల్యూఏటీ, పీఐ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
ఐఐఎం-కోజికోడ్, డబ్ల్యూఏటీ/జీడీ, పీఐ ఆధారంగా ప్రవేశం కల్పిస్తుంది.
ఐఐఎం-లక్నో మాత్రమే డబ్ల్యూఏటీ, జీడీ, పీఐ అనే మూడు అంచెల విధానాన్ని అనుసరిస్తుంది.
ఐఐఎం-షిల్లాంగ్, కేవలం పీఐ ఆధారంగా మాత్రమే ప్రవేశం కల్పిస్తుంది.
రిటెన్ ఎబిలిటీ టెస్ట్:
దాదాపు అన్ని ఐఐఎంలు జీడీ స్థానంలో ఈ విభాగాన్ని నిర్వహిస్తున్నాయి. ఇది 10 నుంచి 45 నిమిషాలపాటు ఉంటుంది. సామాజిక, సమకాలీన అంశాలపై అవగాహననే కాకుండా అభ్యర్థుల టైమ్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాన్ని కూడా ఈ విభాగం పరీక్షిస్తుంది. కాబట్టి ఇచ్చిన అంశాన్ని ప్రభావవంతంగా క్రమ పద్ధతిలో రాయడానికి ప్రయత్నించాలి. ఇందులో అడిగే అవకాశం ఉన్న అంశాలు: రోల్ ఆఫ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా, శానిటేషన్ ఇన్ ఇండియా,ప్రమోటింగ్ హాకీ ఇన్ ఇండియా తదితరాలు.
గ్రూప్ డిస్కషన్:
భావ ప్రసార నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యం, బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సమయస్ఫూర్తి వంటి అంశాలను ఈ విభాగంలో పరిశీలిస్తారు. భవిష్యత్తులో ఓ సంస్థ నిర్వహణకు కావల్సిన సామర్థ్యాలు అభ్యర్థిలో ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని అంచనా వేస్తారు. ఇందుకోసం అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేసి ఏదైనా ఒక అంశం ఇచ్చి.. దానిపై చర్చించమని కోరుతారు. ఇక్కడ గమనించాల్సిన అంశం.. బృంద చర్చలో అభ్యర్థులు చివరకు అందరికీ ఆమోదయోగ్యమైన ముగింపును ఇవ్వాలి. ఇందులో అడిగే అంశాలు సమకాలీనంతోపాటు ఆఫ్‌బీట్‌కు కూడా చెంది ఉంటాయి. ఉదాహరణకు- ఈజ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ రియల్లీ నెససరీ టూ సక్సీడ్ ఇన్ బిజినెస్? ఆర్ ఉమెన్ ఇన్ పోజిషన్స్ ఆఫ్ పవర్ మోర్ అగ్రెసివ్ దెన్ మెన్ ఇన్ ది సేమ్ పోజిషన్స్?
పర్సనల్ ఇంటర్వ్యూ:
అన్ని ఐఐఎంలలో కామన్‌గా ఉన్న విభాగమిది. ఇందులో కేవలం వ్యక్తిగత అంశాలు మాత్రమే కాకుండా కెరీర్, లక్ష్యం, అభిరుచులు, మీ బలాలు, బలహీనతలు, సమకాలీన విషయాలపై కూడా ప్రశ్నలు అడగొచ్చు. కాబట్టి స్పష్టమైన అభిప్రాయాలను ఏర్పరుచుకొని, ఇంటర్వ్యూకు సిద్ధపడాలి. పత్రికల్లోని సంపాదకీయాలను చదవడం, వివిధ అంశాలపై సొంత అభిప్రాయాలను ఏర్పరుచుకోవడం చేయాలి.