వేగం, కచ్చితత్వం..గెలుపు గమ్యానికి మార్గాలు! | Bachelor of Pharmacy .Banking | Sakshi
Sakshi News home page

వేగం, కచ్చితత్వం..గెలుపు గమ్యానికి మార్గాలు!

Published Thu, Apr 17 2014 4:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM

వేగం, కచ్చితత్వం..గెలుపు గమ్యానికి మార్గాలు!

వేగం, కచ్చితత్వం..గెలుపు గమ్యానికి మార్గాలు!

‘బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ.. బ్యాంకింగ్.. రెండూ పూర్తిగా భిన్న నేపథ్యాలు.. అదే సమయంలో రెండింటిలోనూ కెరీర్ పరంగా మంచి అవకాశాలు.. కానీ బ్యాంకు జాబ్‌తో సుస్థిర కెరీర్ సొంతం చేసుకోవచ్చు.. అందుకే  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్ (ఐబీపీఎస్) నిర్వహించే ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ-3 పోస్టును లక్ష్యంగా నిర్దేశించుకుని విజయం సాధించాను’ అంటున్నారు.. హేమలత. ఇటీవల విడుదల చేసిన ఐబీపీఎస్ ఫలితాల్లో చోటు సంపాదించి కెనరా బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎంపికైన హేమలత సక్సెస్ స్టోరీ..
 
 బీఫార్మసీ.. బ్యాంకు రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్.. ఈ రెండూ పూర్తిగా భిన్నం. బీఫార్మసీ సిలబస్ ఐబీపీఎస్ పరీక్షకు ఏ మాత్రం ఉపయోగపడదు. అయినప్పటికీ.. లక్ష్యాన్ని సాధించాలనే తపనతో పకడ్బందీ ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాను. ప్రధానంగా రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాను. రోజుకు పది గంటల చొప్పున ప్రిపరేషన్‌కు కేటాయించాను. ఆయా సబ్జెక్టుల్లో అవగాహన స్థాయి ఆధారంగా ప్రతి సబ్జెక్ట్‌కు సమయాన్ని విభజించుకుని ప్రిపరేషన్ సాగించాను.
 
 వేగం.. కచ్చితత్వం:
 ఐబీపీఎస్ పరీక్షలో విజయానికి ప్రధాన సాధనాలు.. వేగం, కచ్చితత్వం. నిర్దిష్ట సమయంలో ఆయా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా టైం మేనేజ్‌మెంట్ పాటించాలి. అదే సమయంలో సమాధానాల్లో కచ్చితత్వానికి ప్రాధాన్యం ఉండాలి. ఈ రెండూ కూడా ప్రాక్టీస్‌తోనే సాధ్యమవుతాయి. అందుకే సిలబస్‌లోని అంశాలపై పట్టు సాధిస్తూనే.. ఎప్పటికప్పుడు చదివిన అంశాలకు సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేసేందుకు ప్రత్యేక సమయం కేటాయించాను. ఐబీపీఎస్ పీఓ రాత పరీక్ష  ప్రిపరేషన్ క్రమంలో సాక్షి భవిత, విద్యలో ప్రచురితమైన గెడైన్స్ ఆర్టికల్స్ అదనపు ప్రయోజనం చేకూర్చాయి. జనరల్ అవేర్‌నెస్‌తోపాటు, ఆయా సబ్జెక్ట్‌లు, సెక్షన్ల వారీగా నిరంతరం అందించిన గెడైన్స్ ఆర్టికల్స్‌ను క్రమం తప్పకుండా అనుసరించాను. ముఖ్యంగా జనరల్ అవేర్‌నెస్, డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు సంబంధించి భవితలో అందించిన జనరల్ ఎస్సేలు ఎంతో ఉపయోగపడ్డాయి.
 
 ప్రాక్టీస్ టెస్ట్‌లు.. మాక్ టెస్ట్‌లు:
 ఐబీపీఎస్ పరీక్షలో విజయ సాధనకు మరో రెండు కీలకమైన అంశాలు. అవి వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయడం, ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లకు హాజరవడం. ఈ రెండింటి ఫలితాలను విశ్లేషించుకోవడం వల్ల బలాలు, బలహీనతలు తెలుస్తాయి. తద్వారా ఇంకా దృష్టి సారించాల్సిన అంశాలపైన స్పష్టత వస్తుంది. దాంతో అందుబాటులో ఉన్న సమయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో అవగతమవుతుంది.
 
 ఇంటర్వ్యూ ఇలా:
 నలుగురు సభ్యుల బోర్డు జనవరి 5న 15 నిమిషాలపాటు ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో ప్రధానంగా కుటుంబం, అకడెమిక్ నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. అంతేకాకుండా నిత్యజీవితంలో బ్యాంకింగ్ రంగం పాత్ర, ఆధార్ కార్డులను బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేయడం వల్ల ఉపయోగాలపై కూడా ప్రశ్నలు అడిగారు.
 
 బెరుకు లేకుండా.. బేసిక్స్‌పై పట్టుతో:
 బ్యాంకు పరీక్షల ఔత్సాహికులు.. ముందుగా పరీక్ష అంటే బెరుకుదనం పోగొట్టుకోవాలి. పరీక్షలో నిర్దేశిత సెక్షన్లలో అడిగే ప్రశ్నలన్నీ పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి ఆ స్థాయి సిలబస్‌పై పరిపూర్ణత సాధించాలి. అయితే ప్రశ్నలు అడిగే విధానంలో క్లిష్టత క్రమేణా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగిస్తే సత్ఫలితాలు ఆశించొచ్చు. కంప్యూటర్ అవేర్‌నెస్ కోసం కిరణ్ ప్రకాశన్ పుస్తకాలు సరిపోతాయి. జనరల్ అవేర్‌నెస్ కోసం ఇంగ్లిష్, తెలుగు న్యూస్ పేపర్లను కచ్చితంగా చదవాలి. ఇక పరీక్షలో ప్రతి సెక్షన్‌ను 20 నిమిషాల్లో పూర్తి చేసే విధంగా సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మరో విషయం.. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాస్తేనే ఫలితం ఉంటుందనే ఆలోచన వదిలేయాలి. కచ్చితమైన సమాధానాలతో 60 నుంచి 70 శాతం ప్రశ్నలు పూర్తి చేసినా.. ఇంటర్వ్యూ కాల్ ఆశించొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement