
రామాయణం (ఉపవాచకం)
అరణ్యకాండం: దండకారణ్యంలోకి ప్రవేశించిన సీతారామలక్ష్మణులు తొలుత మునుల దర్శనం చేసుకున్నారు. తర్వాత రామలక్ష్మణులు విరాధుని భుజాలు నరికి గోతి లో పూడ్చిపెట్టారు. అతని సూచన మేరకు శరభంగం మహర్షిని దర్శించుకున్నారు. శరభంగుడు తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి సమర్పించి సుతీక్ష్ణ మహర్షిని దర్శించుకోవాలని చెబుతాడు. సుతీక్ష్ణుడు కూడా తన తపఃఫలాన్ని రామునికి ధారపోశాడు. మునుల ఆశ్రమాలు దర్శిస్తూ సీతారామలక్ష్మణులు పదేళ్లు గడిపారు. చివరకు అగస్త్య మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అగస్త్యుడు రామునికి అక్షయ తూణీరాలను, అమోఘమైన ఖడ్గాన్ని, దివ్య ధనస్సును ప్రదానం చేసి, పంచవటి అనే ప్రదేశంలో నివసించాలని సూచించాడు. గోదావరి తీరంలోని పంచవటిలో జన సంచారం తక్కువ. కానీ, ఫలాలు, జలాలకు కొదవలేదు. అక్కడే శ్రీరామాదులకు జటాయువు పరిచయమయ్యాడు. అతడు దశరథుని మిత్రుడు. జటాయువుకి రాముడు.. సీత రక్షణ బాధ్యతలు అప్పగిస్తాడు. లక్ష్మణుడు నిర్మించిన అందమైన పర్ణశాలలో ఉండసాగారు. రాముడు ఒకరోజు పురాణ కథా ప్రసంగం చేస్తున్నప్పుడు శూర్పణక అతని అందానికి మురిసిపోయి తనను పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. సీత అడ్డంకిగా ఉందనే అక్కసుతో ఆమెను మింగేయాలని ప్రయత్నిస్తుంది. దీంతో లక్ష్మణుడు శూర్పణక ముక్కు, చెవులు కోసి తరిమేస్తాడు. ఫలితంగా శూర్పణక సోదరులు ఖరదూషణులు 14000 మంది రాక్షసులతో కలిసి వచ్చి రాముణ్ని చంపబోయి వారే హతమవుతారు.
అకంపనుడు అనే గూఢచారి ఈ సమాచారాన్ని రావణునికి అందజేస్తాడు. సీతను అపహరిస్తే రాముడు ఆ బాధతో చనిపోతాడని, అందువల్ల సీతాపహరణం చేయాలని సూచిస్తాడు. ఈ సలహాను ఆచరణలో పెట్టాలనుకున్న రావణుడు ఈ మేరకు తనకు సాయం చేయాలని మారీచుణ్ని అడుగుతాడు. అంతకుముందే(విశ్వామిత్రుని సిద్ధాశ్రమంలో) శ్రీరాముని బాణం రుచిచూసిన మారీచుడు రావణుని ఆలోచన మంచిదికాదని వారిస్తాడు. కానీ, శూర్పణక మొరపెట్టుకోవడంతో రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి సిద్ధపడతాడు. తనకు సహకరించకపోతే చంపేస్తానని మారీచుణ్ని హెచ్చరిస్తాడు. రావణుని చేతిలో చావడం కన్నా పుణ్యాత్ముడైన రాముని చేతిలో చావడమే మేలని మారీచుడు రావణునికి సహకరించడానికి అంగీకరిస్తాడు. మారీచుడు బంగారు లేడిగా మారి పంచవటి పరిసరాల్లో తిరుగుతూ సీత దృష్టిని ఆకర్షిస్తాడు. లేడి మాయలో పడ్డ సీత తనకు అది కావాలని కోరుతుంది. అది రాక్షస మాయ అని రాముడు నచ్చజెప్పచూసినా వినలేదు. సీత రక్షణ బాధ్యతను లక్ష్మణునికి అప్పగించి బంగారు లేడిని వెంటాడతాడు. చివరికి అది లేడి కాదని, రాక్షస మాయ అని గ్రహించి బాణం వదులుతాడు. అది తాకి చనిపోయే ముందు మారీచుడు శ్రీరాముని గొంతుతో ‘అయ్యో సీతా! అయ్యో లక్ష్మణా!’ అని అరుస్తూ ప్రాణాలు వదులుతాడు. అది నిజంగా రాముని గొంతేనని భ్రమపడ్డ సీత..
రాముణ్ని కాపాడటానికి లక్ష్మణున్ని వెళ్లమంటుంది. అది అన్నయ్య గొంతుకాదంటూ నచ్చజెప్పాలని చూసినా నిష్టూరాలడుతుంది. ఆ మాటలు భరించలేక లక్ష్మణుడు రాముణ్ని వెతకడానికి వెళతాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న రావణుడు సీతను అపహరించుకుపోతాడు. అడ్డుకోబోయిన జటాయువు రెక్కలు, కాళ్లు నరికేస్తాడు. సీతాదేవి రావణున్ని దూషిస్తూ ఒక పర్వత శిఖరంపై కొంతమంది వానరులు కనిపిస్తే తన ఆభరణాలను మూటగట్టి వాళ్లకు లభించేట్లు వదులుతుంది. రావణుడు సీతను అశోకవనంలో ఉంచి రాక్షస స్త్రీలను కాపలాగా పెడతాడు. సీతకు 12 నెలల గడువు విధిస్తాడు. తనను వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మణుణ్ని చూసి రాముడు ఆశ్చర్యపోతాడు. ఇద్దరూ పర్ణశాలకు చేరి జరిగిన మోసాన్ని గ్రహిస్తారు. జరిగిన సంగతిని చెప్పి జటాయువు ప్రాణాలు విడుస్తాడు. రామ లక్ష్మణులు అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అలవిమాలి న దుఃఖంతో రాముడు తమ్మునితో కలిసి సీతను వెతుకుతుంటాడు. ఎదురైన కబంధుని రెండు భుజాలను రామలక్ష్మణులు నరికేస్తారు. శాపం తీరిన తర్వాత కబంధుడు వాలీసుగ్రీవుల కథ చెప్పి సుగ్రీవుని స్నేహం చేస్తే మేలు జరుగుతుందని చెబుతాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణలో భాగంగా పంపాసరోవర ప్రాంతానికి చేరుకుంటారు. శబరి ఆతిథ్యాన్ని స్వీకరించి రుష్యుముక పర్వతం వైపు వెళ్తూ పంపా సరోవరాన్ని దర్శిస్తారు.
అరణ్యకాండం–ఉదాహరణ ప్రశ్నలు
1.రావణుడు సీతాపహరణ చేయడానికి దారితీసిన పరిస్థితులేవి?
2.రాక్షస మాయలో పడ్డ సీత చివరకు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడాన్ని విశ్లేషించండి/వివరించండి.
3.భయం, అనుమానం, భ్రమ ఎంతటి వాళ్లనైనా ఆపదల్లోకి నెట్టేస్తాయని సీతాపహరణ ఘట్టం ఆధారంగా వివరించండి.
మాదిరి ప్రశ్నపత్రం
(పేపర్ 1)
పార్ట్–ఎ (30 మార్కులు)
సూచనలు
1.మొదటి 15 నిమిషాలు పశ్నపత్రం చదివి అర్థం చేసుకోండి.
2.తర్వాత 2 గంటలు పార్ట్–ఎ ప్రశ్నలకు జవాబులు రాయండి.
3.చివరి 30 నిమిషాలు పార్ట్–బి పూర్తిచేసి, ప్రధాన సమాధాన పత్రానికి జతచేయండి.
ఐ.స్వీయ రచన–సృజనాత్మకత
స్వీయ రచన (30 మార్కులు)
అ)కింది ప్రశ్నలకు ఐదారు వాక్యాల్లో జవాబులు రాయండి. 4ణ3=12
1.‘కొత్త బాట’ రచయిత్రి పల్లెలో గమనించిన ముఖ్య మార్పులేవి?
2.‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి కవిత్వంలోని ప్రత్యేకతలేవి?