అత్యంత నివాసయోగ్య నగరం? | Champions of Change | Sakshi
Sakshi News home page

అత్యంత నివాసయోగ్య నగరం?

Published Thu, Aug 24 2017 4:49 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

అత్యంత నివాసయోగ్య నగరం?

అత్యంత నివాసయోగ్య నగరం?

‘చాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌’లోచ ప్రధాని ప్రసంగం
నీతి ఆయోగ్‌ నేతృత్వంలో ఆగస్టు 17న ‘చాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రభుత్వ చర్యలు, కార్యక్రమాలతోనే నవ భారత నిర్మాణం జరగదని, ప్రతి భారతీయుడూ మార్పు కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో 200 మంది యువ స్టార్టప్‌ వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు. సాఫ్ట్‌ పవర్, ఇంక్రెడిబుల్‌ ఇండియా 2.0, విద్య– నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం–పౌష్టికాహారం, డిజిటల్‌ ఇండియా, 2022 నాటికి నవ భారత నిర్మాణం తదితర ఇతివృత్తాలతో ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

డిజిటల్‌ పోలీస్‌ పోర్టల్‌ సేవలు ప్రారంభం
డిజిటల్‌ పోలీస్‌ పోర్టల్‌(డీపీపీ)ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆగస్టు 21న ప్రారంభించారు. నేరాలు, నేరస్థులపై నిఘా నెట్‌వర్క్‌ వ్యవస్థలు (సీసీటీఎన్‌ఎస్‌) అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని రూపొందించారు. నేరాలు, నేరస్థుల వివరాలతో జాతీయ సమాచార నిధి ఏర్పాటే సీసీటీఎన్‌ఎస్‌ లక్ష్యం. ఈ పోర్టల్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల నమోదు, వివరాల ధ్రువీకరణ, అభ్యర్థనలు తదితర సేవలు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు 11 శోధన సదుపాయాలను, 46 నివేదికలను రాష్ట్ర పోలీస్‌ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు, పరిశోధన సంస్థలు పొందొచ్చు. సీసీటీఎన్‌ఎస్‌ సమాచార నిధిలో ఇప్పటివరకు ఏడు కోట్ల నేరాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు.      

బిహార్‌ వరదల్లో 98 మంది మృతి
బిహార్‌లో వరదల వల్ల ఆగస్టు 18 నాటికి 98 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 జిల్లాలకు చెందిన 93 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2.13 లక్షల మంది 504 సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. జాతీయ రహదారులతోపాటు 124 రోడ్లు ధ్వంసమయ్యాయి. 70 మంది ఆర్మీ సిబ్బంది, 114 ఎన్‌డీఆర్‌ఎఫ్, 92 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బోట్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు.

ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో 22 మంది మృతి
ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా ఖత్‌లి వద్ద ఆగస్టు 19న పట్టాలు తప్పడంతో 22 మంది మరణించారు. 156 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.  

అమెరికా నుంచి భారత్‌కు
తొలిసారిగా ముడి చమురు దిగుమతి
ప్రపంచంలో మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారు అయిన భారత్‌ తొలిసారిగా అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. మొదటి దఫా రవాణా ఆగస్టు 8–14 మధ్య మొదలైంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) కొనుగోలు చేసిన ఈ చమురు సెప్టెంబర్‌లో భారత్‌కు చేరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ జూన్‌లో అమెరికాలో పర్యటించినప్పుడు ఇరు దేశాలు ఇంధన రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించడంతో చమురు కొనుగోలు మొదలైంది.

 ఇందులో భాగంగా ఐఓసీ అమెరికా నుంచి 1.6 మిలియన్‌ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. దీంతో అగ్ర రాజ్యం నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో ఇప్పుడు భారత్‌ కూడా చేరింది. దక్షిణ కొరియా, జపాన్, చైనా, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, తైవాన్‌ ఇప్పటికే అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్‌).. ముడి చమురు ఉత్పత్తిలో కోత విధించడంతో ధరలు పెరిగాయి. దీంతో మధ్య ప్రాచ్య దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఇతర ప్రాంతాల నుంచి చమురు కొనుగోలును ప్రారంభించాయి.

కరెంట్‌ అఫైర్స్‌
అత్యంత నివాసయోగ్య నగరంగా మెల్‌బోర్న్‌
ప్రపంచంలో అత్యంత నివాసయోగ్య నగరంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ ఎంపికైంది. ఆస్ట్రియా రాజధాని వియన్నా, కెనడాలోని వాంకోవర్, టొరంటో, కల్గరీ.. వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మొత్తం 140 నగరాల్లో స్థిరత్వం, ఆరోగ్య సేవలు, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక వసతులు తదితర 30 అంశాల ఆధారంగా సర్వే చేశారు. ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలను ఆగస్టు 17న న్యూయార్క్‌లో విడుదల చేశారు.

‘బాల మేధావి’ రాహుల్‌ దోశి
బ్రిటన్‌లోని టీవీ చానల్‌ 4 నిర్వహించిన చైల్డ్‌ జీనియస్‌ క్విజ్‌ పోటీల్లో భారత సంతతికి చెందిన రాహుల్‌ దోశి విజేతగా నిలిచాడు. ఆగస్టు 19న నిర్వహించిన ఈ పోటీలో రాహుల్‌ 162 ఐక్యూ (ఇంటలిజెంట్‌ కోయిషెంట్‌) స్కోర్‌ సాధించాడు. ఇది అల్బర్ట్‌ ఐన్‌స్టీన్, స్టీఫెన్‌ హాకింగ్‌ ఐక్యూల కన్నా ఎక్కువ.

అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు
అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త వార్షిక సైనిక విన్యాసాలు ఆగస్టు 21న ప్రారంభమయ్యాయి. తమ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఉత్తర కొరియా అభ్యంతరాల మధ్యే ఈ విన్యాసాలు జరగడం గమనార్హం. వేలాది మంది సైనికులు ఈ ఉల్చి–ఫ్రీడం గార్డియన్‌ సంయుక్త సైనిక కసరత్తు నిర్వహించారు. దక్షిణ కొరియాలో రెండు వారాల పాటు సాగే ఈ విన్యాసాల్లో క్షేత్ర స్థాయిలో కాల్పులు, యుద్ధ ట్యాంకుల విన్యాసాలు వంటివేవీ లేకుండా కంప్యూటర్ల ఆధారంగా సాధన జరుగుతుంది. వీటిలో సుమారు 17,500 మంది అమెరికా సైనికులు, 50 వేల మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొంటారు. కాగా ఇవి రక్షణాత్మక విన్యాసాలేనని, ద్వీపకల్పంలో ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేవి కాదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జేఇన్‌ పేర్కొన్నారు.

అమెరికాలో 99 ఏళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం
అమెరికాలో ఆగస్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఒరెగాన్‌(పశ్చిమ తీరం)లోని లింకన్‌ బీచ్‌లో మొదలైన ఈ గ్రహణం 14 రాష్ట్రాల ద్వారా సాగింది. దీని వల్ల 70 కిలోమీటర్ల వెడల్పు ప్రాంతం చీకటిమయమైంది. అగ్రరాజ్యంలో దాదాపు 99 ఏళ్ల తర్వాత సంభవించిన ఈ సంపూర్ణ సూర్యగ్రహణం సుమారు 90 నిమిషాల పాటు కొనసాగింది.     
   
స్పెయిన్‌ ఉగ్రదాడిలో 13 మంది మృతి
స్పెయిన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బార్సిలోనాలోని లాస్‌ రాంబ్లాస్‌లో ఆగస్టు 17న ఓ వ్యాను పర్యాటకులపైకి దూసుకుపోవడంతో 13 మంది మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాదుల దాడి అని పోలీసులు ధ్రువీకరించారు.

రోదసీలోకి చేరిన తొలి సూపర్‌ కంప్యూటర్‌
మొట్టమొదటి సూపర్‌ కంప్యూటర్‌ (స్పేస్‌ బర్నో కంప్యూటర్‌) ఆగస్టు 16న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరింది. ఈ ప్రయోగాన్ని ఆగస్టు 7న ఫ్లోరిడాలోని కేప్‌కెనవారాల్‌లో నిర్వహించారు. స్పేస్‌ ఎక్స్‌ సంస్థకు చెందిన 2,900 కిలోల మానవ రహిత రవాణా వ్యోమ నౌక డ్రాగన్‌ ఈ సూపర్‌ కంప్యూటర్‌ను మోసుకెళ్లింది. ఇప్పటికే రోదసీలో ఉన్న వ్యోమగాములకు ఈ నౌక ఆహారం, ప్రత్యేక దుస్తులను కూడా తీసుకెళ్లినట్లు నాసా పేర్కొంది. సూపర్‌ కంప్యూటర్‌ను హ్యూలెట్‌ ఎయాకార్డ్‌ సంస్థ రూపొందించింది. ఇది స్పేస్‌ ఎక్స్‌కు సంబంధించి 12వ అంతరిక్ష ప్రయోగం. ఈ సూపర్‌ కంప్యూటర్‌ అంతరిక్షంలోని ప్రతికూల వాతావరణంలో పనిచేయగలదా లేదా అనే అంశాన్ని పరిశోధకులు పరీక్షించనున్నారు.

నౌకాదళంలోకి ఉభయచర యుద్ధనౌక
నేల పైన, సముద్రంలోనూ పోరాడగల ఉభయచర యుద్ధనౌక ఆగస్టు 21న భారత నౌకాదళంలో చేరింది. ఈ అధునాతన ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ యుటిలిటీ (ఎల్‌సీయూ) ద్వారా యుద్ధ ట్యాంకులను, ఇతర భారీ ఆయుధ వ్యవస్థలను, సైనిక బలగాలను యుద్ధ రంగానికి రవాణా చేయొచ్చు. దీన్ని కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ యుద్ధ నౌక అండమాన్‌ దీవుల్లో విధులు నిర్వర్తిస్తుంది. ఈ శ్రేణికి చెందిన మరో ఆరు నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి వచ్చే రెండేళ్లలో నౌకాదశంలో చేరనున్నాయి.

ఉమెన్‌ హెల్ప్‌ లైన్‌ 181 ప్రారంభం
తెలంగాణలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 24 గంటల హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 181ను ఆగస్టు 19న ప్రారంభించారు. వేధింపులు, దాడులకు గురైన మహిళలు హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి సాయం కోరవచ్చు. ఫోన్‌ చేసిన మహిళలకు సఖీ కేంద్రాలు, అంబులెన్స్, ఆసుపత్రులు, పోలీస్‌ స్టేషన్ల ద్వారా సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆపదలో ఉన్నవారికి తాత్కాలిక వసతి కూడా కల్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement