కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-15 | Communication Satellite gsat -15 | Sakshi
Sakshi News home page

కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-15

Published Wed, Nov 25 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM

కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-15

కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-15

భారత కమ్యూనికేషన్ ఉపగ్రహాల జాబితాలోకి మరో అత్యాధునిక ఉపగ్రహం చేరింది. ఇస్రో రూపొందించిన జీశాట్-15ను నవంబరు 11న ఏరియేన్ రాకెట్ కక్ష్యలోకి విజయవంతంగా  ప్రయోగించింది. ఉపగ్రహ ఆధారిత విమానయానానికి ఉద్దేశించిన గగన్ పేలోడ్‌ను కూడా ఇస్రో గగనతలంలోకి పంపించింది.
 
 ఏరియేన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఏరియేన్ 5వీఏ-227 రాకెట్ ద్వారా ఈ ఏడాది నవంబరు 11న అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఫ్రెంచ్ గయానాలో కౌరు ద్వీపంలోని రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఏరియేన్ రాకెట్ ప్రయోగం జరిగింది. 11 గంటల 30 నిమిషాల కౌంట్‌డౌన్ తర్వాత నవంబరు 11వ తేదీ తెల్లవారుజామున 3:04 గం.లకు ఏరియేన్ రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అయింది. ఇది జరిగిన 43 నిమిషాల, 24 సెకండ్ల తర్వాత ఏరియేన్-5 రాకెట్ చివరి దశ నుంచి జీశాట్-15 వేరుపడి 250 కిలోమీటర్ల పెరీజీ, 35,819 కిలోమీటర్ల అపోజీ ఉన్న భూ అనువర్తిత మార్పిడి కక్ష్యలోకి చేరింది. రాకెట్ నుంచి వేరుపడగానే కర్ణాటకలో హసన్‌లోని ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ జీశాట్-15ను నియంత్రణలోకి తీసుకుంది. దీన్ని ఇన్‌శాట్-3ఏ, ఇన్‌శాట్-4బీ ఉపగ్రహాలు ఉన్న భూస్థిర కక్ష్యలోకి తర్వాత రోజుల్లో శాటిలైట్ ప్రొపల్షన్ సిస్టంను ఉపయోగించి చేరుస్తారు.
 
 జీఎస్‌ఎల్‌వీ మార్క్-ఐఐఐ
 జీశాట్-15 బరువు 3164 కిలోలు. ఈ స్థాయి బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహాలను జీఎస్‌ఎల్‌వీ మార్క్-ఐ, మార్క్-ఐఐ ప్రయోగించలేవు. ఈ ఉపగ్రహ నౌకల పేలోడ్ సామర్థ్యం తక్కువ. అందుకే ఈ ఉపగ్రహాలను ఏరియేన్ వంటి విదేశీ రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. అయితే భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించే వీలున్న సరికొత్త జీఎస్‌ఎల్‌వీ మార్క్-ఐఐఐ అనే నౌకను ఇస్రో అభివృద్ధి చేస్తోంది. 4500- 5000 కిలోల బరువున్న ఉపగ్రహాలను సైతం ఇది ప్రయోగించగలదు. జీఎస్‌ఎల్‌వీ మార్క్-ఐఐఐకు సంబంధించిన ఒక పరీక్ష ప్రయోగాన్ని ఇస్రో 2014, డిసెంబరు 18న విజయవంతంగా నిర్వహించింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్-ఐఐఐను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే భారీ ఉపగ్రహాల కోసం విదేశీ రాకెట్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా విదేశీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను జీఎస్‌ఎల్‌వీ మార్క్-ఐఐఐ ద్వారా ప్రయోగించేందుకు వీలవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని వేల కోట్ల టర్నోవరును ఉపగ్రహాల లాంచింగ్ మార్కెట్ నమోదు చేసుకుంటుంది. ఇప్పటికే ఇస్రో పీఎస్‌ఎల్‌వీ ద్వారా విజయవంతంగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది.
 
 ట్రాన్స్‌పాండర్స్
 కమ్యూనికేషన్ ఉపగ్రహాలలోని ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలను ట్రాన్స్‌పాండర్లు అని పిలుస్తారు. ఇందులో ఒక రిసీవర్, మాడ్యులేటర్, ట్రాన్స్‌మిటర్ ఉంటాయి. మొబైల్, ల్యాండ్‌లైన్, బ్రాడ్ బ్యాండ్ కమ్యూనికేషన్ రేడియో, టీవీ కార్యక్రమాల బ్రాడ్ క్యాస్టింగ్, డీటీహెచ్ సేవలు, వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్ సేవల ప్రసారాలకు ట్రాన్స్‌పాండర్లు కీలకం. నేల నుంచి అప్‌లింక్ ద్వారా సమాచారాన్ని తీసుకొని, మళ్లీ నేలపై ఉన్న రిసీవర్‌లకు డౌన్‌లింక్‌ను ట్రాన్స్‌పాండర్లు నిర్వహిస్తాయి. ఒక అప్‌లింక్ పౌనఃపున్యం, ఒక డౌన్ లింక్ పౌనఃపున్యంను కలిపి బ్యాండ్ విడ్త్ అంటారు. పౌర అవసరాలకు సంబంధించి బ్యాండ్ విడ్త్‌ను వివిధ దేశాలకు టెలీకమ్యూనికేషన్స్ యూనియన్(జెనీవా, స్విట్జర్లాండ్) కేటాయించింది. సాధారణంగా ట్రాన్స్‌పాండర్లు ఎస్-బ్యాండ్, సీ-బ్యాండ్, కేయూ- బ్యాండ్, కేఏ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లుగా ఉంటాయి. ఎస్-బ్యాండ్, సీ-బ్యాండ్ అల్ప బ్యాండ్ విడ్త్‌లో సేవలను అందించగా కేయూ-బ్యాండ్, కేఏ-బ్యాండ్ అధిక బ్యాండ్ విడ్త్‌లో సేవలను అందిస్తాయి.
 
 జీశాట్-15
 జీశాట్-15లో మొత్తం 24 కమ్యూనికేషన్ ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. ఇవన్నీ కేయూ-బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు. డెరైక్ట్ టు హోం(డీటీహెచ్) టెలివిజన్ సేవలు, టెలీ కమ్యూనికేషన్స్ వీశాట్(వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్) సేవలను మరింత విస్తరించడంలో జీశాట్-15 ఉపయోగపడుతుంది. ఇందులో ఒక కేయూ-బ్యాండ్ బీకన్ ఉంది. నేలపై ఉన్న యాంటెన్నాలు ఉపగ్రహం వైపు నిర్దిష్టంగా చూడడానికి ఈ బీకన్ ఉపయోగపడుతుంది. జీశాట్-15 ఉపగ్రహంలో గగన్ (ఎఅఎఊ   ఎ్క అజీఛ్ఛీఛీ ఎౌ్ఛ అఠజఝ్ఛ్ట్ఛఛీ ూ్చఠిజీజ్చ్టజీౌ) పేలోడ్‌ను కూడా ప్రయోగించారు. దీనికి ముందు జీశాట్-8, జీశాట్-10లో రెండు సార్లు గగన్ పేలోడ్‌ను ఇస్రో ప్రయోగించింది. జీశాట్-15 జీవితకాలం 12 ఏళ్లు.
 
 గగన్
 ఉపగ్రహ ఆధారిత విమానయానం కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), అంతరిక్ష విభాగం సంయుక్తంగా గగన్‌ను నిర్మించాయి. గత కొన్నేళ్లుగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ భారత్‌ను ఉపగ్రహ ఆధారిత విమానయాన వ్యవస్థ అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తోంది. గ్రౌండ్ ఆధారిత నావిగేషన్ కంటే ఉపగ్రహ ఆధారిత విమానయానం ద్వారా ఇంధన వ్యయం తగ్గుతుంది. టేక్ ఆఫ్, ల్యాండింగ్ ప్రమాదాలను అరికట్టవచ్చు. ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ సమర్థవంతంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే తొలి గగన్ పేలోడ్‌ను జీశాట్-8లో, ఆ తర్వాత జీశాట్-10లో ఇస్రో ప్రయోగించింది. ఇప్పుడు మూడో సారి జీశాట్-15లో ప్రయోగించింది. గగన్‌లో ప్రత్యేక శాటిలైట్ బేస్డ్ ఆగ్‌మెంటేషన్ సిస్టం(ఎస్‌బీఏఎస్) వ్యవస్థ ఉంటుంది. ఇది ఎల్1, ఎల్5 బ్యాండ్‌తో పనిచేస్తుంది. గగన్ సేవలను కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజు ఈ ఏడాది జూలై 13న ప్రారంభించారు. భారత్, ఆగ్నేయాసియా, ఆఫ్రికా వరకు గగన్ సేవలు విస్తరించి ఉన్నాయి.
 
 భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించే వీలున్న సరికొత్త జీఎస్‌ఎల్‌వీ మార్క్-ఐఐఐ అనే నౌకను ఇస్రో అభివృద్ధి చేస్తోంది. 4500- 5000 కిలోల బరువున్న ఉపగ్రహాలను సైతం ఇది ప్రయోగించగలదు.
 
 డెరైక్ట్ టు హోం(డీటీహెచ్) టెలివిజన్ సేవలు, టెలీ కమ్యూనికేషన్స్ వీశాట్(వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్) సేవలను మరింత విస్తరించడంలో జీశాట్-15 ఉపయోగపడుతుంది.
 
 జీఎస్‌ఎల్‌వీ మార్క్-ఐఐఐను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే భారీ ఉపగ్రహాల కోసం విదేశీ రాకెట్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
 
 ఉపగ్రహ ఆధారిత విమానయానం కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), అంతరిక్ష విభాగం సంయుక్తంగా గగన్‌ను నిర్మించాయి.
 
 భారత్, ఆగ్నేయాసియా, ఆఫ్రికా వరకు గగన్ సేవలు విస్తరించి ఉన్నాయి.
 
 ఇస్రో ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలు
 వాహక నౌక    ఉపగ్రహం    ప్రయోగ తేదీ
 డెల్టా    ఇన్‌శాట్-1ఏ    ఏప్రిల్ 10, 1982
 పామ్-డి షటిల్    ఇన్‌శాట్-1బీ    ఆగస్టు 30, 1983
 ఏరియేన్-3    ఇన్‌శాట్-1సీ    జూలై 21, 1988
 డెల్టా 4925    ఇన్‌శాట్-1డీ    జూన్ 12, 1990
 ఏరియేన్-4    ఇన్‌శాట్-2ఏ    జూలై 10, 1992
 ఏరియేన్-4    ఇన్‌శాట్-2బీ    జూలై 23, 1993
 ఏరియేన్-4    ఇన్‌శాట్-2సీ    డిసెంబర్ 07, 1995
 ఏరియేన్-4    ఇన్‌శాట్-2డీ    జూన్ 04, 1997
 ఏరియేన్-44 ఎల్‌హెచ్10    ఇన్‌శాట్-2డీటీ    జనవరి 01, 1998
 ఏరియేన్-42పీ    ఇన్‌శాట్-2ఈ    ఏప్రిల్ 03, 1999
 ఏరియేన్5-జీ    ఇన్‌శాట్-3బీ    మార్చి 22, 2000
 జీఎస్‌ఎల్‌వీ-డీ1    జీశాట్-1    ఏప్రిల్ 18, 2001
 ఏరియేన్5-వీ147    ఇన్‌శాట్-3సీ    జనవరి 24, 2002
 పీఎస్‌ఎల్‌వీ-సీ4    కల్పన-1    సెప్టెంబర్ 12, 2002
 ఏరియేన్5-వీ160    ఇన్‌శాట్-3ఏ    ఏప్రిల్ 10, 2003
 జీఎస్‌ఎల్‌వీ-డీ2    జీశాట్-2    మే 08, 2003
 ఏరియేన్5-వీ162    ఇన్‌శాట్-3ఈ    సెప్టెంబర్ 28, 2003
 జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ఓ1    ఎడ్యుశాట్    సెప్టెంబర్ 20, 2004
 ఏరియేన్5-వీ169    ఇన్‌శాట్-4ఏ    డిసెంబర్ 22, 2005
 ఏరియేన్-5    ఇన్‌శాట్-4బీ    మార్చి 12, 2007
 జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ఓ4    ఇన్‌శాట్-4సీఆర్    సెప్టెంబర్ 02, 2007
 ఏరియేన్-5వీఏ 202    జీశాట్-8    మే 21, 2011
 పీఎస్‌ఎల్‌వీ-సీ17    జీశాట్-12    జూలై 15, 2011
 ఏరియేన్-5వీఏ-209    జీశాట్-10    సెప్టెంబర్ 29, 2012
 ఏరియేన్-5వీఏ-214    ఇన్‌శాట్-3డి    జూలై 26, 2013
 ఏరియేన్-5వీఏ-215    జీశాట్-7    ఆగస్టు 30, 2013
 జీఎస్‌ఎల్‌వీ-డీ5    జీశాట్-14    జనవరి 05, 2014
 ఏరియేన్-5వీఏ 221    జీశాట్-16    డిసెంబర్ 07, 2014
 జీఎస్‌ఎల్‌వీ-డీ6    జీశాట్-6    ఆగస్టు 27, 2015
 ఏరియేన్-5వీఏ 227    జీశాట్-15    నవంబర్ 11, 2015

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement