
‘ఎగ్జిట్ పోల్’ అంటే?...
విశ్వాస తీర్మానం: రాజ్యాంగంలో, పార్లమెంటరీ నియమ నిబంధనల్లో ఎక్కడా దీని గురించి ప్రస్తావించలేదు. కొన్ని కారణాల వల్ల అధికార పార్టీ మెజారిటీ కోల్పోతే.. మెజారిటీని నిరూపించుకో వాల్సిందిగా ప్రధానమంత్రిని రాష్ట్రపతి కోరతారు. అప్పుడు మంత్రిమండలిపై విశ్వాసం ప్రకటించాల్సిందిగా ప్రధాని సభను కోరతారు. మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది విశ్వాసం ప్రకటిస్తే ప్రభుత్వం నిలబడుతుంది.
మొదటిసారి లోక్‌సభలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధాని చౌదరి చరణ్‌సింగ్. అయితే తీర్మానం ఓటింగ్‌కి రాకముందే ఆయన రాజీనామా చేశారు. 16వ లోక్‌సభ వరకు విశ్వాస తీర్మానాలను 12 సార్లు ప్రవేశపెట్టారు. అందులో మూడు మాత్రమే నెగ్గాయి. విశ్వాస తీర్మానం ద్వారా అధికారం కోల్పోయిన మొదటి ప్రధాని వి.పి.సింగ్ (1990) కాగా, రెండో ప్రధాని దేవెగౌడ (1997), మూడో ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి.
అభిశంసన తీర్మానం: ఈ తీర్మానాన్ని ఉభయ సభల్లో ఎందులోనైనా ప్రవేశపెట్టవచ్చు. దీన్ని కేవలం ఒక మంత్రి లేదా మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టవచ్చు. నిర్దిష్ట అంశంపై ప్రభుత్వాన్ని విమర్శించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. మంత్రులపై తీవ్ర అభియోగాలు వచ్చినçప్పుడు, బాధ్యతల పట్ల ఉదాసీనంగా వ్యవహరించినప్పుడు వారిని హెచ్చరించేందుకు ఈ తీర్మానాన్ని ఉపయోగిస్తారు. దీనికి సంబంధించి ప్రత్యేక నియమావళి లేదు.
పాయింట్ ఆఫ్ ఆర్డర్: ఇది ఒక అసాధారణ పద్ధతి. స్పీకర్ దీన్ని అనుమతించిన పక్షంలో అప్పటి వరకు జరుగుతున్న సభా కార్యక్రమాలన్నింటినీ పక్కనపెట్టి సంబంధిత అంశాన్ని చర్చిస్తారు.
ఇంకా పేర్కొన ని తీర్మానం: సభాధ్యక్షుడి అనుమతి పొందిన తీర్మాన ప్రవేశానికి ఒక నిర్దిష్ట సమయం కేటాయించకుంటే.. దాన్ని ‘ఇంకా పేర్కొనని తీర్మానం’ అంటారు.
రూల్ 377 కింద ప్రస్తావన (లేదా) ప్రత్యేక ప్రస్తావన: ఏవైనా అంశాలను మిగిలిన ప్రక్రియల ద్వారా సభలో ప్రస్తావించేందుకు వీలు కానప్పుడు వాటిని రూల్ 377 కింద సభ దృష్టికి తీసుకురావచ్చు. రాజ్యసభలో ఈ విధానాన్ని స్పెషల్ మెన్షన్ అంటారు. దీని కోసం సభ సెక్రటరీ జనరల్‌ను లిఖితపూర్వకంగా అభ్యర్థించాలి.
లేమ్ డక్ సెషన్: లోక్‌సభకు ఎన్నికలు జరిగిన తర్వాత, రద్దయిన లోక్‌సభలో సభ్యులుగా ఉండి.. ప్రస్తుత లోక్‌సభకు ఎన్నికకాని సభ్యులు, కొత్తగా ఎన్నికైన సభ్యులతో కలిపి చిట్టచివర ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. దీన్నే లేమ్ డక్ సెషన్ అంటారు. ఇది భారతదేశంలో అమల్లో లేదు.
ఫిలిబస్టరింగ్: శాసనసభ కార్యక్రమాలు జరగకుండా, అలాగే ఒక బిల్లు ఆమోదం పొందకుండా చేసేందుకు సభ్యులు ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలిక ఉపన్యాసం, ఇతరత్రా చర్యలకు దిగి నిర్ణీత గడువు ముగిసేలా చేస్తుంటారు. దీన్నే ఫిలిబస్టరింగ్ అంటారు.
గెర్రిమాండరిం : ఒక అభ్యర్థి తన విజయావకాశాలను మెరుగుపర్చుకునేలా నియోజకవర్గ సరిహద్దులను మార్చే పద్ధతిని గెర్రిమాండరింగ్ అంటారు.
గ్యాలప్ పోల్ : అమెరికాకు చెందిన హెన్రీ గ్యాలప్ అనే ఎన్నికల విశ్లేషకుడు ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. అందువల్ల దీన్ని గ్యాలప్‌పోల్ అంటారు. ఇది ఎన్నికలకుæ ముందు నిర్వహించే సర్వే లాంటిది. ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసే అంశాలను, రాబోయే ఎన్నికల ఫలితాలను గ్యాలప్‌పోల్ ద్వారా అంచనా వేయొచ్చు.
ఎగ్జిట్‌పోల్: ఎన్నికల సమయంలో ఓటు వేసినవారి అభిప్రాయాన్ని తెలుసుకునే పద్ధతిని ఎగ్జిట్‌పోల్ అంటారు. తద్వారా ఎన్నికల ఫలితాలను అంచనా వేయొచ్చు.
ఫ్లోర్ క్రాసింగ్: ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అధికార పక్షంలోకి మారడాన్ని ఫ్లోర్ క్రాసింగ్ అంటారు.
కార్పెట్ క్రాసింగ్: అధికార పక్షానికి చెందిన సభ్యులు ప్రతిపక్ష పార్టీలోకి మారడాన్ని కార్పెట్ క్రాసింగ్ అంటారు.
ప్రతిపాదనలు: సభ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొచ్చేందుకు ఎంచుకునే ప్రక్రియనే ప్రతిపాదన అంటారు. సభ అభిప్రాయం కోరడం దీని ముఖ్య ఉద్దేశం.భారతదేశంలో మూడు రకాల ప్రతిపాదనలున్నాయి.
నిర్దిష్ట ప్రతిపాదనలు: ఇదొక నిర్దిష్ట, స్వచ్ఛంద ప్రతిపాదన. సభ నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా దీన్ని ప్రతిపాదిస్తారు. ఇందులో మరొక ప్రతిపాదన ఉండదు.
ఉదా: వాయిదా, అవిశ్వాస తీర్మానాలు.
ప్రత్యామ్నాయ ప్రతిపాదన: మార్పు చెందిన విధానాలు, పరిస్థితులకు సంబంధించి అసలు ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా చేసే ప్రతిపాదన. ఇది ఆమోదం పొందితే దీన్ని అసలు ప్రతిపాదనగానే పరిగణిస్తారు.
సహాయ ప్రతిపాదన: ఇంతకు ముందు ప్రవేశపెట్టిన ప్రతిపాదన స్థితిగతులను విచారించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. అసలు ప్రతిపాదనతోపాటు సహాయ ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతుంది. కానీ, ఓటింగ్ మాత్రం సహాయక ప్రతిపాదనపైనే ఉంటుంది. దీన్ని మూడు ఉప ప్రతిపాదనలుగా విభజించవచ్చు.
ఆనుషంగిక ప్రతిపాదన: వివిధ రకాల సభా వ్యవహారాలను కొనసాగించేందుకు దీన్ని ఉపయోగిస్తారు.
ఉదా: బిల్లులను నిర్దేశిత కమిటీ లేదా సంయుక్త కమిటీ పరిశీలనకు పంపడం.
అధిక్రమణ ప్రతిపాదన: ఏదైనా ఒక విషయాన్ని అక్కడితో వదిలివేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. సంబంధిత అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు దీన్ని ప్రతిపాదిస్తారు.
స్పాయిల్ సిస్టం: ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను కూడా మార్చుకునే పద్ధతి. ఇది అమెరికాలో పాక్షికంగా అమల్లో ఉంది. అమెరికా నూతన అధ్యక్షుడు తన అధికార నివాసమైన వైట్‌హౌస్‌లో పని చేసే ఉద్యోగులను తన విచక్షణ మేరకు నియమించుకోవచ్చు. సాధారణంగా గత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులను తొలగిస్తారు.
తీర్మానాలు: సభ దృష్టిని ్రçపజాసంబంధ వ్యవహారాలవైపు మళ్లించేందుకు ఉన్న అనేక విధానాల్లో ఇదొకటి. నిజానికి ఇది ఒక నిర్ధారిత ప్రతిపాదన. కానీ, తీర్మానం ఒక అభిప్రాయం లేదా సూచన రూపంలో ఉంటుంది. వీటిని వ్యక్తిగత, ప్రభుత్వ, రాజ్యాంగ తీర్మానాలుగా వర్గీకరించవచ్చు.
హంగ్ పార్లమెంట్: లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాని పరిస్థితిని హంగ్ పార్లమెంట్ అంటారు. ఇప్పటి వరకు 7 హంగ్ పార్లమెంట్‌లు ఏర్పడ్డాయి. (1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009)
ఆపద్ధర్మ ప్రభుత్వం: అధికారంలో ఉన్న ప్రభుత్వం వైదొలిగినప్పుడు.. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడే వరకు పాలనా బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా ఆ ప్రభుత్వమే అధికారంలో కొనసాగాల్సిందిగా రాష్ట్రపతి లేదా గవర్నర్ కోరతారు. దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి ఏర్పాటు లేదు. అయితే ఈ సమయంలో ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు.
ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు: పార్లమెంట్‌లో వివిధ అంశాలపై చక్కగా మాట్లాడినవారికి, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నియోజకవర్గ ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన వారికి, గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రదర్శించిన సభ్యులకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందిస్తారు.
1993 నుంచి ఏటా ఒక పార్లమెంట్ సభ్యుడికి ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు. దీన్ని ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఈ పురస్కారాల కమిటీకి చైర్మన్‌గా స్పీకర్ వ్యవహరిస్తారు.
మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును 1993లో ఇంద్రజిత్ గుప్తాకు ఇచ్చారు.
యూత్ పార్లమెంట్: ప్రజాస్వామ్య పద్ధతులు, పార్లమెంట్ విధానాలను కొత్త తరాలకు తెలియజేసేం దుకు ఈ కార్యక్రమాన్ని నాలుగో అఖిల భారత విప్ సమావేశ సూచన మేరకు ప్రారంభించారు.
సంకీర్ణ ప్రభుత్వం: రెండు లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు కలిసి కేంద్ర లేదా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. భారతదేశంలో మొదటిసారి కేరళలో 1967లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది.
విప్: అంటే ఆదేశం లేదా అధిపతి అని అర్థం. దీని గురించి రాజ్యాంగం, పార్లమెంటరీ నియమ నిబంధనల్లో ఎక్కడా పేర్కొనలేదు. రాజకీయ పార్టీలు తమ శాసనసభ్యులను నియంత్రించేందుకు, అలాగే సభలో పార్టీ సభా నాయకుడికి సహాయపడేందుకు వీరిని నియమిస్తాయి.
పార్టీ విప్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత పార్టీకి చెందిన శాసన సభ్యులు ప్రవర్తించాలి. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో దీని గురించి ప్రస్తావించారు.
పార్టీ విప్‌నకు వ్యతిరేకంగా ఓటు వేసినవారు తమ శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
బి. కృష్ణారెడ్డి,
డైరెక్టర్, క్లాస్–వన్ స్టడీ సర్కిల్