పీపీఓ.. కొలువుకు మార్గం | Experience the way real-time | Sakshi
Sakshi News home page

పీపీఓ.. కొలువుకు మార్గం

Published Thu, Aug 18 2016 4:05 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

పీపీఓ.. కొలువుకు మార్గం

పీపీఓ.. కొలువుకు మార్గం

కోర్సు మధ్యలోనే క్షేత్ర నైపుణ్యం..రియల్ టైం ఎక్స్‌పీరియన్స్‌కు మార్గం..  ఇంటర్న్‌షిప్ సమయంలో ప్రతిభ చూపితే కొలువు ఖాయం..  వీటన్నిటికీ మార్గంగా నిలుస్తున్నాయి ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్(పీపీవో). ముఖ్యంగా మేనేజ్‌మెంట్ విద్యార్థులు పీపీవోల ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. కలల కెరీర్‌ను, కళ్లు చెదిరే  ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. త్వరలో ఐఐఎంలు, ఇతర బి-స్కూల్స్‌లో పీపీఓ డ్రైవ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కథనం..
 
 విద్యార్థులు క్షేత్ర స్థాయి నైపుణ్యాలను అందుకునేందుకు మార్గం.. ఇంటర్న్‌షిప్స్. ఐఐఎంలు, ఇతర బీస్కూల్స్ స్థాయిలో.. ఇంటర్న్‌షిప్స్‌నే ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ (పీపీవో)గా పేర్కొంటారు. ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్‌ను సొంతం చేసుకొని ఇంటర్న్‌గా కంపెనీలో అడుగుపెట్టి ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తే.. ఫైనల్ ప్లేస్‌మెంట్‌లోనూ అవకాశం అందుకోవచ్చు. పీపీఓలు పొందిన విద్యార్థులకు కంపెనీలు స్టైపెండ్ పేరుతో ఆర్థిక ప్రోత్సాహం సైతం అందిస్తాయి. క్షేత్ర నైపుణ్యాలు.. ఆర్థిక చేయూత.. వీలుంటే కొలువు..
 
 ఇలా అన్ని రకాలుగా బీస్కూల్స్ విద్యార్థులకు మేలు చేసేవే పీపీఓలు. నాలుగైదేళ్ల క్రితం వరకు ఐఐఎంలకే పరిమితమైన ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్లు.. ఇటీవలి కాలంలో ఇతర  బి-స్కూల్స్‌కు సైతం విస్తరిస్తున్నాయి. 2016-18 విద్యా సంవత్సరానికి సంబంధించి.. ఆయా సంస్థలు ప్రీ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు.. దాదాపు అన్ని ఐఐఎంలలో, ఇతర బీస్కూల్స్‌లో  సంబంధిత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి. ఇటు క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్రతినిధులు సైతం విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. పీపీఓలు ఎంత ఎక్కువగా లభిస్తే.. బీస్కూల్‌కు గుర్తింపు అంత ఎక్కువ అనే భావనతో ఇన్‌స్టిట్యూట్‌లు అడుగులు వేస్తున్నాయి.
 
 పీపీఓలు ఇద్దరికీ ఉపయుక్తం

 ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ ఇటు కంపెనీలు.. అటు విద్యార్థులకు ఉపయుక్తంగా మారుతున్నాయి. విద్యార్థుల కోణంలో.. నిర్ణీత వ్యవధిలో కంపెనీలో పని చేసే అవకాశం లభిస్తుంది. కోర్సు చదువుతున్నప్పుడే క్షేత్ర నైపుణ్యాలు లభిస్తాయి. సీనియర్ల సలహాలు, సూచనలు అందుకోవచ్చు. కంపెనీల కోణంలో.. ప్రతిభావంతులను, సృజనాత్మకత, నిర్వహణ నైపుణ్యాలున్న మానవ వనరులను ఒడిసిపట్టుకునే అవకాశం ఉంటుంది.
 
 పీపీఓ ప్రక్రియ ఇలా
 ప్రస్తుతం ఐఐఎంలు, ఇతర బి-స్కూల్స్‌లో అమలవుతున్న ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ ప్రక్రియకు నిర్దిష్ట విధానం అమలవుతోంది. పీపీవో పేరుతో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేయాలనుకునే కంపెనీలు సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఇన్‌స్టిట్యూట్‌లలో అడుగుపెడతాయి. రెండేళ్ల మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న అభ్యర్థుల కోసం ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ డ్రైవ్స్ నిర్వహిస్తాయి. ఔత్సాహిక అభ్యర్థులు ఈ ఎంపిక ప్రక్రియకు హాజరవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో కంపెనీలు ఫైనల్ ప్లేస్‌మెంట్ మాదిరిగానే వ్యవహరిస్తాయి. గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. వీటిలో విజయం సాధించిన అభ్యర్థులకు పీపీఓలను ఖరారు చేస్తాయి. ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ ఎంపిక ప్రక్రియ మూడు నుంచి ఐదు రోజుల వ్యవధిలో ముగుస్తోంది. గతేడాది ఐఐఎం కోజికోడ్‌లో కేవలం మూడు రోజుల్లోనే మూడు వందలకు పైగా విద్యార్థులకు పీపీఓలు ఖరారవడం విశేషం. తాజా టాలెంట్ కోసం కంపెనీలు ఉవ్విళ్లూరుతున్నాయని చెప్పడానికి ఇదో నిదర్శనం.
 
 ఆరు నుంచి 8 వారాల వ్యవధి
 ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ అందుకున్న అభ్యర్థులు తమ కోర్సు మొదటి సంవత్సరం తర్వాత తమకు ఆఫర్ ఇచ్చిన కంపెనీలో నిర్ణీత వ్యవధిలో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. దీన్నే సమ్మర్ ఇంటర్న్‌షిప్‌గానూ పేర్కొంటున్నారు. కనిష్టంగా ఆరు వారాలు.. గరిష్టంగా ఎనిమిది వారాల వ్యవధిలో పీపీఓల ద్వారా లభించే ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులు సదరు సంస్థలో రియల్ టైం వర్క్ ఎన్విరాన్‌మెంట్‌లో సంస్థ సిబ్బందితో కలిసి పని చేయాలి. అభ్యర్థులకు నిర్దిష్టంగా ఒక టాస్క్‌ను కేటాయించడమో లేదా అప్పటికే ఒక టాస్క్‌కు సంబంధించి విధులు నిర్వహిస్తున్న టీంలో సభ్యుడిగా నియమించడమో జరుగుతుంది.
 
 ఫైనల్ ప్లేస్‌మెంట్ ఖరారు
 ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ పొందిన విద్యార్థులు తమ డొమైన్ ఏరియా, లేదా ప్రత్యేక టాస్క్ నిర్వహణలో ప్రతిభ చూపితే కోర్సు పూర్తయ్యాక కొలువును సైతం అందుకోవచ్చు. ఐఐఎంలలో గత మూడు, నాలుగేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. ఫైనల్ ప్లేస్‌మెంట్  ఆఫర్స్ సొంతం చేసుకున్న వారిలో పీపీఓ అభ్యర్థుల సంఖ్య యాభై శాతం వరకూ ఉంది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించి తమ సంస్థలో భవిష్యత్తులో కొనసాగే ఆసక్తి ఉందో? లేదో? కూడా అడుగుతున్నాయి. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉంటేనే కొలువు ఆఫర్‌కు ఆమోదం తెలపొచ్చు. పీపీఓ డ్రైవ్స్ నిర్వహించే కంపెనీల విషయంలో అన్ని రంగాల కంపెనీలు పోటీ పడుతున్నాయి. మేనేజ్‌మెంట్ విద్యార్థులు కీలకంగా భావించే కన్సల్టింగ్ నుంచి టెక్నాలజీ సంస్థల వరకు పీపీఓ డ్రైవ్స్‌లో పాల్గొంటున్నాయి. కంపెనీల పరంగా చూస్తే కన్సల్టింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్ సంస్థలు ముందంజలో నిలుస్తున్నాయి.
 
 ఆర్థిక చేయూత
 గతేడాది జాతీయ స్థాయిలో అన్ని ఐఐఎంలు, ఇతర ప్రముఖ బీస్కూల్స్‌లో ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ వెల్లువెత్తాయి. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే యాభై శాతం మేరకు ఇవి పెరగడమే కాకుండా.. సమ్మర్ ఇంటర్న్ సమయంలో ఇచ్చే స్టైపెండ్ కూడా 30 నుంచి 40 శాతం పెరిగింది. గతేడాది కొత్తగా ఏర్పాటైన ఐఐఎం- విశాఖపట్నంలో సైతం 99 శాతం మంది విద్యార్థులకు పీపీఓలు లభించాయి. ఆ విద్యార్థులంతా గత వేసవి సెలవుల్లో ఇంటర్న్ పూర్తి చేసుకున్నారు. త్వరలో జరగనున్న ఫైనల్ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌కు సిద్ధమవుతున్నారు. ఆరు నుంచి 8 వారాల వ్యవధిలో ఉండే సమ్మర్ ఇంటర్న్ సమయంలో సగటున రూ.50 వేల స్టైపెండ్ అందిస్తున్నాయి. గతేడాది ఐఐఎం-
 కోల్‌కతాలో 2015-17 బ్యాచ్‌కు సంబంధించి.. మొదటి సంవత్సర విద్యార్థుల(2015-16)కు నిర్వహించిన ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్‌లో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంస్థ గరిష్టంగా 3 లక్షల స్టైపెండ్ ఆఫర్ చేయడం విశేషం.
 
 పీపీఓలు... ముఖ్య సమాచారం
  సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశం.
  కనిష్టంగా ఆరు వారాలు.. గరిష్టంగా 8 నుంచి 12 వారాల వ్యవధిలో ఇంటర్న్‌షిప్స్.
  ఇంటర్న్‌షిప్ సమయంలో స్టైపెండ్
  గతేడాది జాతీయ స్థాయిలో కనిష్టంగా రూ. 50 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు స్టైపెండ్
  ఐఐఎంల నుంచి ఇతర ప్రముఖ బీస్కూల్స్ వైపు కూడా దృష్టి సారిస్తున్న సంస్థలు.
  ఆగస్టు నుంచి నవంబర్ మధ్య కాలంలో పీపీఓ డ్రైవ్స్.
 
 ఫైనల్ ప్లేస్‌మెంట్స్ మాదిరిగానే
 సమ్మర్ ఇంటర్న్స్‌ను ఎంపిక చేసేందుకు నిర్వహించే ప్రీ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌లో కంపెనీలు ఫైనల్ ప్లేస్‌మెంట్ ప్రక్రియనే అనుసరిస్తాయి.  పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించడం, ప్రీ ప్లేస్‌మెంట్ టాక్స్ పేరుతో కంపెనీల ప్రతినిధులతో అభ్యర్థులు నేరుగా సంప్రదించే అవకాశం సైతం కల్పిస్తాయి. విద్యార్థులు సదరు సంస్థ గురించి, వాటి కార్యకలాపాల గురించి, తమకు ఇంటర్న్‌షిప్ సమయంలో ఇచ్చే జాబ్ ప్రొఫైల్ గురించి అడగొచ్చు. నాకు లెనోవో సంస్థలో సమ్మర్ ఇంటర్న్ అవకాశం లభించింది. అప్పటికే ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసిన అనుభవం ఉండటంతో ఇంటర్న్‌షిప్‌లో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. ఇంటర్న్‌షిప్ సమయంలో సంస్థ ప్రతినిధులు ప్రధానంగా అభ్యర్థుల్లోని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, స్పందించే తీరుపై దృష్టి పెడతాయి. టీం లీడర్ నుంచి ఎప్పటికప్పుడు అభ్యర్థి పనితీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాయి. ఇవన్నీ సంతృప్తి కరంగా ఉంటే ఫైనల్ ప్లేస్‌మెంట్ ఖాయం.ఈ ఫైనల్ ప్లేస్‌మెంట్ ఆఫర్ విషయంలో నిర్ణయం విద్యార్థిదే. ఇంటర్న్‌షిప్ చేసిన సంస్థ ఫైనల్ ప్లేస్‌మెంట్‌నే ఆమోదించాలనే నిబంధన లేదు.
 టి.శ్రీనివాస్ కార్తీక్, ఐఐఎం-బీ (2015-17 బ్యాచ్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement