ఆహార భద్రతే అసలు సమస్య | food safety comes first Original issue | Sakshi
Sakshi News home page

ఆహార భద్రతే అసలు సమస్య

Published Thu, Sep 4 2014 4:54 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

ఆహార భద్రతే అసలు సమస్య - Sakshi

ఆహార భద్రతే అసలు సమస్య

 సింగపూర్‌లో 1996లో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రిత్వ స్థాయి సమావేశంలో వాణిజ్య సదుపాయం (కస్టమ్స్ అంశం), వాణిజ్యం-పెట్టుబడి, వాణిజ్యం-పోటీ, ప్రభుత్వ సేకరణలో పారదర్శకత అనే నాలుగు అంశాల అధ్యయనంపైకార్యాచరణ బృందాలను ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రిత్వ స్థాయి సమావేశంలో ఐరోపా సమాఖ్య (ఈయూ), జపాన్, కొరియాలు ఈ అంశాలపై చర్చకు పట్టుబట్టినా, అభివృద్ధి చెందుతున్న దేశాలు దీన్ని వ్యతిరేకించాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఏకతాటిపైకి రానందువల్ల తీర్మానాలు అమలు కాలేదు. ఈ అంశాల్లో వాణిజ్య సదుపాయం (ట్రేడ్ ఫెసిలిటేషన్) అంశానికి సంబంధించి మాత్రం కొంత పురోగతి కనిపించింది.
 
 ఆంక్షలే అడ్డంకులు:
 2013 డిసెంబర్ 3-7ల మధ్య బాలి వేదికగా జరిగిన మంత్రిత్వ స్థాయి సదస్సులో వాణిజ్య సదుపాయ ఒప్పందం (టీఎఫ్‌ఏ) తెరపైకి వచ్చింది. ఈ టీఎఫ్‌ఏపై 2014 జూలై 31 నాటికి సభ్యదేశాల ప్రతినిధులు సంతకాలు చేయాల్సి ఉంది. అయితే ఆహార ధాన్యాల నిల్వలు, ఆహార భద్రత అంశాలపై ఆంక్షలతో మన దేశం అభ్యంతరం వ్యక్తం చేయడంతో టీఎఫ్‌ఏ అంశం ప్రశ్నార్థకంగా మారిం ది. ఈ అంశంపై చైనా, క్యూబాలు భారత్‌కు మద్దతు పలికాయి. మొత్తానికి భారత్ తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య చీలిక వచ్చింది.
 
 వాణిజ్య సదుపాయాల ఒప్పందం-ఆవశ్యకత:
 వస్తు, సేవల ప్రవాహంలో అనుత్పాదక పరిపాలనా సంబంధిత వ్యయాల్లో భాగమైన లావాదే వీల వ్యయం తగ్గింపును వాణిజ్య సదుపాయం అంటారు. పెరుగుతున్న రవాణా వ్యయాలు, డాక్యుమెంటేషన్ అవసరాలు, క్లియరెన్స్‌ల మంజూరులో జాప్యం, కస్టమ్స్ సుంకాలను విదేశీ వాణిజ్య వృద్ధిని నిర్ణయించే కారకాలుగా పేర్కొనవచ్చు. వస్తు, సేవలను తక్కువ వ్యయంతో సకాలంలో బదలాయిస్తే వివిధ దేశాల సామర్థ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆయా దేశాల పాత్రను అంచనా వేయొచ్చు. వస్తు, సేవల ప్రవాహం ఎగుమతుల పోటీతత్వాన్ని అధికం చేస్తుంది. తద్వారా సాంకేతిక పరిజ్ఞానం (దిగుమతుల ద్వారా), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెరుగుదల సాధ్యమవుతుంది.
 
  వాణిజ్య వ్యయాల అంశాల్లో పెరిగిన అవగాహన వాణిజ్య సదుపాయాల నియమావళి ఆవశ్యకతను స్పష్టం చేస్తుంది. వాణిజ్య లావాదేవీల అంశాన్ని చేర్చడం ద్వారా ట్రేడ్ ఫెసిలిటేషన్ పరిధి పెరిగింది. ఈ క్రమంలో స్వదేశీ విధానాలు, సంస్థాగత నిర్మాణత ప్రధాన పాత్ర పోషిస్తాయి. పారదర్శకత, అవినీతి రహిత ప్రభుత్వ నియంత్రణ ఏజెన్సీలు, ఉత్తమ ప్రామాణికాలు, అంతర్జాతీయ నియమావళి అంశాలు వాణిజ్య లావాదేవీలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి. విపణిలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) పాత్ర పెరిగింది. దీంతో వాణిజ్య సదుపాయంలో కూడా సాంకేతిక మౌలిక వసతులు (టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్ట్రక్చర్) భాగమయ్యాయి. వాణిజ్య సదుపాయాల ఒప్పందాల కారణంగా వాణిజ్య విస్తరణ జరిగి ఆర్థికాభివృద్ధికి దారితీస్తుంది.
 
 ఒప్పందం-ప్రయోజనాలు:
 వాణిజ్య సదుపాయాల ఒప్పందంతో వాణిజ్య సంబంధిత లావాదేవీల వ్యయం తగ్గుతుంది. ఆసియా, పసిఫిక్ ఆర్థిక సహకారం(అపెక్) నివేదిక ప్రకా రం పారిశ్రామిక దేశాలలో వాణిజ్య వ్యయంలో 1శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2 శాతం మేర తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. వస్తు ఎగుమతులలో వృద్ధి 3.3శాతంగా అపెక్ నివేదిక అంచనా వేసిందిఫ్రాంకోయిస్, వెన్ టాంజెరిన్ అభిప్రాయం ప్రకారం వాణిజ్య సంబంధిత వ్యయాలలో 1.5 శాతం తగ్గుదల కనిపిస్తే 78 బిలియన్ డాలర్ల విలువైన సంక్షేమ ఫలాలను అందుకోవచ్చు.
 
 ఒప్పందంపై భారత్ వైఖరి:

 భారీ సంస్కరణల అజెండాతో రూపొందించిన వాణిజ్య సదుపాయాల ఒప్పందంపై భారత్ సంతకం చేయడానికి నిరాకరించింది. బిల్లులో ఆహారధాన్యాల నిల్వలు, ఆహార భద్రత అంశాలపై ఆంక్షలు ఉన్నాయంటూ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారత్ విజ్ఞతతో వ్యవహరిస్తోందనడానికి పలుకారణాలున్నాయి. ఆహార భద్రత సాధించే క్రమంలో శాశ్వత పరిష్కారానికి తమ దేశం కట్టుబడి ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ఇదే క్రమంలో భారత్‌లో ఆహార రాయితీకి సంబంధించి ప్రపంచ వాణిజ్య సంస్థ ఎలాంటి చర్యలు చేపడుతుందో స్పష్టం చేయలేదని పేర్కొంది. ఈ కారణంగానే వాణిజ్య సదుపాయ ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరిస్తున్నట్లు వివరణ ఇచ్చింది. భారత్ వాదనకు జీ-33 దేశాల కూటమి సమర్ధించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార ధాన్యాల సేకరణ, ఫుడ్ ఎయిడ్ కార్యక్రమాలకు ఎలాంటి అవరోధం లేకుండా రాయితీ పరిమితిని సవరించాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొంది.
 
 పాత సూచీలు వద్దు:
 ప్రపంచ వాణిజ్య సంస్థ నియమావళి ప్రకారం ఆహార రాయితీ పరిమితి.. మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి విలువలో 10 శాతంగా ఉండాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం ఆహార ధాన్యాల ఉత్పత్తి విలువ 1986-1988ల సూచీ ఆధారంగా లెక్కిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా భారత్‌తోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు అధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పేదరిక తీవ్రత అధికంగా ఉన్న ఈ దేశాలలో ఫుడ్ ఎయిడ్ (ఆహార ఆధారిత)కార్యక్రమాల అమలుకు ఈ నిబంధన పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది. కాబట్టి ఆహార రాయితీలను గణించడానికిఆధార సంవత్సరం (1986-1988)ను మార్చాల్సిన ఆవశ్యకత ఉందని భారత్ డిమాండ్ చేస్తుంది. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువలో ఒడిదొడుకులను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పును చేపట్టాలని గట్టిగా వాదిస్తోంది.
 
 భారత్‌లో ఆహార భద్రత-రాయితీల ఆవశ్యకత:
  భారత్‌లో గత నాలుగేళ్లుగా ఆహారభద్రత, ఆర్థిక సంక్షోభం ప్రధాన చర్చనీయాంశాలుగా నిలిచాయి. దేశంలో పేదరిక సమస్య తీవ్రమైంది. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ప్రతి ముగ్గురు శిశువుల్లో ఒకరు భారత్‌లో ఉన్నారు. సరైన బరువు లేకుండా జన్మించిన ఐదేళ్లలోపు శిశువులు 43.5 శాతం. ఇటీవలి ప్రపంచ ఆకలి సూచీ (ఎౌఛ్చ ఏఠజ్ఛట ఐఛ్ఛ్ఠీ)లో మన దేశం 63వ స్థానంలో నిలిచింది. రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య ఎక్కువ. ప్రసూతి మరణాలు ప్రతి లక్ష జనాభాకు 200గా ఉన్నట్లు భారత ఆర్థిక సర్వే పేర్కొంది. పేదరిక నిర్మూలన లక్ష్యాల నివేదిక (పావర్టీ డెవలప్‌మెంట్ గోల్స్ రిపోర్ట్)-2011 ప్రకారం 1990లో భారత్‌లో 51శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువ ఉన్నారు. దీన్ని 2015 నాటికి 22 శాతానికి తగ్గించాలనేది లక్ష్యం.
 
  ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం భారత్‌లో ఐదేళ్లు పూర్తి కాకుండానే ఏటా 21 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. సబ్ సహారా ఆఫ్రికా దేశాలలో పౌష్టికాహార లోపంతో ఇబ్బందిపడుతున్న పిల్లల సంఖ్య కన్నా ఇది రెట్టింపు. ఇటీవల పేదరిక అంచనాలపై ఏర్పాటైన రంగరాజన్ కమిటీ అభిప్రాయంలో భారత్‌లో ప్రతి పది మందిలో ముగ్గురు పేదలు. పట్టణ ప్రాంతాలతో పోల్చిచూస్తే గ్రామీణ ప్రాంతాలలో పేదరిక రేఖ దిగువ ఉన్న జనాభా నిష్పత్తి ఎక్కువ. పౌష్టికాహార లోపాన్ని అధిగమిస్తూ పేదరిక నిర్మూలన ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆహారభద్రత బిల్లు ద్వారా 82 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా.
 
 భారత్‌లో జనాభా పెరుగుదల కారణంగా ఆహార ధాన్యాలకు డిమాండ్ పెరిగింది. ఆహార భద్రత సాధించే క్రమంలో వ్యవసాయ ఉత్పత్తి వృద్ధి రేటు పెంచాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యం కావాలంటే సాగు రంగానికి రాయితీలు కల్పించాలి. పలు రంగాల ఉత్పత్తి వృద్ధిలో సమతుల్యత సాధించడానికి రాయితీలు ప్రధాన సాధనాలు. దేశంలో సంస్కరణలకు ముందు, తర్వాత సాగు రంగానికి రాయితీల పెరుగుదల కారణంగా ఉత్పత్తి-ఉత్పాదకతలో పురోగతి కనిపించింది. అయితే ఆహార ధాన్యాల సప్లయ్, డిమాండ్‌లో రాబోయే రోజుల్లో అసమతౌల్యం ఏర్పడే ప్రమాదం ఉంది. దీనికితోడు ఆహార రాయితీల విషయంలో డబ్ల్యూటీఓ నిబంధనలు మన వ్యవసాయ రంగాన్ని మరింత నీరు గారుస్తున్నాయి. ఇదే జరిగితే ఆహార భద్రత సాధించడం పెను సవాల్‌గా మారుతుంది.
 
 ప్రాధాన్య రంగాలు -రాయితీలు:
 స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత భారత్ ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధానమైనది ఆహారసమస్య. ఇటీవల కాలంలో ఆహార ధాన్యాల లభ్యత పెరిగినప్పటికీ నాలుగో వంతు జనాభాకు కొనుగోలు శక్తి లేదు. దీంతోపాటు వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలోని ఒడిదుడుకులు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెంపునకు సంబంధించి ప్రభుత్వం అందించే రాయితీలు (ఎరువులు, విద్యుత్, నీటిపారుదల), ప్రజాపంపిణీ వ్యవస్థ అందిస్త్తున్న ఆహార ధాన్యాల రాయితీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1991-1992లో ఆహార రాయితీ రూ. 2,850 కోట్లు కాగా, 2011-2012లో రూ. 72,823 కోట్లకు పెరిగింది. 1991-1992 నుంచి 2011- 2012 మధ్యలో ఆహార రాయితీ సుమారు 25 రెట్లు పెరిగింది. వ్యవసాయ స్థూల దేశీయోత్పత్తిలో ఆహార రాయితీ వాటా 1.8 నుంచి 5.8 శాతానికి పెరిగింది. 2014-2015 బడ్జెట్‌లో ఎరువుల రాయితీ విలువ రూ.72,970.30 కోట్లు, ఆహార రాయితీ విలువ రూ. 1,15,000 కోట్లుగా కేంద్రం ప్రతిపాదించింది. దీంతోపాటు వ్యవసాయోత్పత్తుల ధరల మద్దతు పథకం కింద రూ.200.01 కోట్లను ఇతర రాయితీల రూపంలో బడ్జెట్‌లో కేటాయించింది.
 
 చొరవే శ్రీరామరక్ష:
 టీఎఫ్‌ఏ అమలుకు 2017 వరకు గడువు ఉన్నప్పటికీ, రాయితీల విషయంలో రాజీధోరణి ఏ మాత్రం శ్రేయోదాయకం కాదు. నిజానికి అమెరికా, ఐరోపా దేశాల రైతులకు అందుతున్న రాయితీలతో పోల్చితే మన రైతులకు అందుతున్నవి చాలా తక్కువ. ఇదిలా ఉంటే అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) గతేడాది విడుదల చేసిన ప్రపంచ ఆకలి సూచీలో మనదేశం 63వ స్థానంలో ఉంది. ఈ పరిస్థితులలో ఆహారభద్రత సాధించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి టీఎఫ్‌ఏపై ముందుకెళ్లడం సరికాదు. అలాని చరిత్రాత్మక ఒప్పందాన్ని విస్మరించడం సరైనదీ కాదు. ఒప్పందం అమలుపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలిగించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు చొరవ చూపాలి. రానున్న కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత్ భాగస్వామ్యాన్ని సంపన్నదేశాలు ఇప్పటికే గుర్తించాయి. కాబట్టి మన దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే రీతిలో మనల్ని కాదని ఒప్పందాన్ని అమలు చేసే అవకాశం లేదు. వీటి దృష్ట్యా వాణిజ్య సదుపాయ ఒప్పందంపై ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారత్ తన వైఖరిని సుస్పష్టం చేస్తూ సరైన దిశగా అడుగులు వేయాల్సి ఉంది.
 
 బాలి సదస్సులో భారత్ వాణి
 డబ్ల్యూటీఓ ఒప్పందానికి వ్యతిరేకం కాదని, అంతర్జాతీయంగా ఒక కొత్త శకానికి నాంది పలికే దిశగా రూపొందినవాణిజ్య సదుపాయ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని బాలి సమావేశంలో భారత్ పేర్కొంది. దీని ద్వారా ప్రపంచ ఆర్థికవ్యవస్థ సంపద పెరుగుదలతోపాటు 2.1 కోట్ల నూతన ఉద్యోగాల సృష్టికి నాంది పలకడం హర్షణీయమని తెలిపింది. కానీ ఆహార భద్రత, ఆహార రాయితీల పరిమితుల గురించి తమ ఆందోళన అని ఘంటాపథంగా తేల్చిచెప్పింది. దీనిపై అమెరికాతోపాటు అనేక అభివృద్ధి చెందిన దేశాలు అసంతృప్తి వ్యకం చేశాయి. అయినప్పటికీ చిన్న, సన్న కారు రైతులు, దారిద్య్రరేఖ దిగువ నివసించే ప్రజల సంక్షేమం దృష్ట్యా భారత్ తన వాదనను సమర్థించింది.
 
 ఆహార భద్రత, రాయితీ అంశాలపై భారత్‌కు చైనా, క్యూబాలు మద్దతు పలికాయి.భారత్‌లో వ్యవసాయ రాయితీలు 12 బిలియన్ డాలర్లు కాగా అమెరికాలో 120 బిలియన్ డాలర్లు. ఆహార భద్రతలో భాగంగా ఆహార ధాన్యాల నిల్వల కార్యక్రమానికి పరిష్కారం సూచించడంతోపాటు సంస్థాగత యంత్రాంగం ఏర్పాటును భారత్ సమర్థిస్తోంది.  2014, డిసెంబర్ 31 నాటికి శాశ్వత పరిష్కారంలో భాగంగా సంస్థాగత యం త్రాంగానికి స్పష్టమైన విధానాలను రూపొందించాలని కోరుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement