జియోఇన్ఫర్మాటిక్స్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి
ఎంబీఏ (బయోటెక్నాలజీ) కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
- చంద్రా, కరీంనగర్.
బయోటెక్నాలజీ రంగంలో..ఔషధాలకు సంబంధించి రీసెర్చ్, అనుబంధ కార్యక్రమాలు విస్తృతమవుతున్నాయి. దీంతో ఇటీవల కాలంలో బయోటెక్ పరిశ్రమల వ్యాపార కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి. తదనుగుణంగా సంబంధిత వ్యవహారాలను పర్యవేక్షించడానికి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, మార్కెటింగ్ మేనేజర్ల అవసరం పెరుగుతోంది. దీన్ని గుర్తించిన కొన్ని విద్యా సంస్థలు ఈ విభాగంలో ఎంబీఏ (బయోటెక్నాలజీ)/తత్సమాన కోర్సులను అందిస్తున్నాయి. వివరాలు..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్-హైదరాబాద్
వెబ్‌సైట్: www.ipeindia.org
అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
బయోటెక్నాలజీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.amity.edu
యూనివర్సిటీ ఆఫ్ పుణే
వెబ్‌సైట్: http://www.pumba.in
బీటెక్ (ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్) బ్రాంచ్‌తో ఎటువంటి అవకాశాలు ఉంటాయి?
- కిరణ్, నిజామాబాద్.
ఇంటిగ్రేటెడ్ డిజైన్, ప్లానింగ్, ఆపరేటివ్ సిస్టమ్స్ ద్వారా ఉత్పత్తిని పెంచడమే ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉద్దేశం. ఈ కోర్సులో మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్, మెటల్ కటింగ్, క్యాస్టింగ్, వెల్డింగ్, మెటల్ ఫార్మింగ్ వంటి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ తదితర సబ్జెక్టులు ఉంటాయి. కాంపొనెంట్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అంశాల్లో కూడా శిక్షణ పొందుతారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమల్లో ఉపాధి లభిస్తుంది. దీంతోపాటు కమ్యూనికేషన్స్, ట్రాన్స్‌పోర్టేషన్, బ్యాంకింగ్, ఫార్మాస్యూటికల్, ట్రావెల్, సెమికండక్టర్, స్పోర్ట్స్, హెల్త్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగాల్లో కూడా అవకాశాలను అందుకోవచ్చు. నియామకాల్లో ప్రొడక్షన్ విభాగానికి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ కంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ విద్యార్థులే ముందంజంలో ఉంటారు. ప్రారంభంలో ఏడాదికి మూడు నుంచి నాలుగు లక్షల వరకు వేతనం లభిస్తుంది. ఎల్ అండ్ టీ, బీహెచ్‌ఈఎల్, డీఆర్‌డీఓ, ఇస్రో, హెచ్‌ఏఎల్, ఏడీఏ, ఐటీసీ, క్వెస్ట్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి.
రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
- రవి, ఆదిలాబాద్.
దేశంలో 70 శాతం మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలు అభివృద్ధి సాధించినప్పుడే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ఇన్‌స్టిట్యూ ట్‌లు రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సులో విద్యా, ఉపాధి, ఆరోగ్యం, అవస్థాపన సౌకర్యాలు, సామాజిక సేవ వంటి అంశాలను గ్రామీణాభివృద్ధి దృష్టిలో ఉంచుకుని బోధిస్తారు. ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ఎన్‌జీవోలు, వివిధ ప్రభుత్వ సంస్థలు, సహకార సంఘాలు, బ్యాంకుల్లో అవకాశాలు ఉంటాయి.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్
మేనేజ్‌మెంట్ - ఐఆర్‌ఎం క్యాంపస్ (జైపూర్)
వివరాలకు: www.iirm.ac.in
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్
- ఆనంద్ (గుజరాత్)
వివరాలకు: www.irma.ac.in
జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రూరల్ మేనేజ్‌మెంట్ - భువనేశ్వర్.
వివరాలకు: w3.ximb.ac.in
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
(ఇగ్నో)-న్యూఢిల్లీ, దూర విద్యా విధానంలో
ఎంఏ (రూరల్ డెవలప్‌మెంట్) కోర్సును
అందిస్తుంది. అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్.
వివరాలకు: www.ignou.ac.in
జియో ఇన్ఫర్మాటిక్స్ కోర్సును ఏయే ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి?
- గోపి, కనగల్.
జియో సైన్స్, ఇన్ఫర్మేటిక్స్ రెండింటిలోని అంశాల సమ్మిళితమే జియోఇన్ఫర్మాటిక్స్ కోర్సు. జియోఇన్ఫర్మాటిక్స్ ప్రొఫెషనల్స్‌కు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, హైదరాబాద్), నార్త్-ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎన్‌ఈఎస్‌ఏసీ- షిల్లాంగ్), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో-బెంగళూరు), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లోని సంస్థలు, పరిశోధన సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. వీటితోపాటు విద్యా సంస్థలు, వ్యాపార సంస్థల్లోనూ కెరీర్ ప్రారంభింవచ్చు. ప్రైవేట్ రంగంలో నేషనల్ సర్వే-మ్యాపింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, ఖనిజ అన్వేషణ, అత్యవసర సేవలు, ప్రజారోగ్యం, క్రైమ్ మ్యాపింగ్, రవాణా-మౌలిక సదుపాయాలు, ట్రావెల్-టూరిజం, మార్కెట్ విశ్లేషణ, ఈ-కామర్స్ కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ సంస్థలు (గూగుల్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఎనర్జీ, మాగ్నాసాఫ్ట్ టెక్నాలజీ సర్వీసెస్ తదితర) జియో ఇన్ఫర్మాటిక్స్ అభ్యర్థులను నియమించుకుంటున్నాయి.
ఈ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
టెరీ యూనివర్సిటీ - ఢిల్లీ
వివరాలకు: www.teriuniversity.ac.in
సీడాక్ - పుణె
వివరాలకు: www.cdac.in
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్- బ్రాంబే
వివరాలకు: www.cuj.ac.in