జీప్యాట్ - 2015 | GPat - 2015 | Sakshi
Sakshi News home page

జీప్యాట్ - 2015

Published Thu, Nov 20 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

GPat - 2015

ఫార్మసీలో పీజీ చేయడానికి అవకాశం కల్పిస్తున్న పరీక్ష.. గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్). దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎం.ఫార్మసీ)లో ప్రవేశానికి జీప్యాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి. 2015 సంవత్సరానికి జీప్యాట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంబంధిత వివరాలు..
 
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్
(ఏఐసీటీఈ) జీప్యాట్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. గతేడాది నుంచి జీప్యాట్‌ను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తున్నారు. ఈ స్కోర్ ఆధారంగా ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న అన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంఫార్మసీ కోర్సులో అడ్మిషన్ పొందొచ్చు.
 
పరీక్ష విధానం:
జీప్యాట్‌ను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందు లో మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. వీటికి మూడు గంట (180 నిమిషాలు)ల్లో సమాధానాలను గుర్తించాలి. సిలబస్ బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ప్రశ్నలు అప్లికేషన్ పద్ధతిలో ఉంటాయి. మల్టిపుల్ చాయిస్, అసెర్షన్-రీజన్, స్టేట్‌మెంట్ బేస్డ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు కేటాయించిన మార్కులు నాలుగు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పుకు ఒక మార్కు కోత విధిస్తారు.
 
సిలబస్:
ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలసిస్, ఫార్మకాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మోకోగ్నసీ, బయోకెమిస్ట్రీ, క్లినికల్ ఫార్మసీ, ఫిజికల్ ఫార్మసీ, బయోఫార్మాస్యూటిక్స్ తదితర అంశాలను సిలబస్‌లో చేర్చారు. ఇందులో ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ వంటివి కీలక చాప్టర్లు. వీటిలో ఫార్మాస్యూటిక్స్‌కు ఎక్కవగా వెయిటేజీ లభిస్తుంది.
 
స్కాలర్‌షిప్:
జీప్యాట్ స్కోర్ ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. ఈ స్కోర్ ఆధారంగా అన్ని సెంట్రల్, స్టేట్ యూనివర్సిటీలలో ప్రవేశం పొందొచ్చు. నిర్దేశించిన విధంగా ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశం పొందితే నెలకు రూ. 8 వేల స్కాలర్‌షిప్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్కోర్ ఆధారంగా సీసీఎంబీ, సీడీఆర్‌ఐ వంటి పరిశోధన సంస్థల నుంచి ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ చేయవచ్చు. ఉస్మానియా, జేఎన్‌టీయూ వంటి యూనివర్సిటీల నుంచి పార్ట్ టైం/ఫుల్ టైం పీహెచ్‌డీ కోర్సుల్లో కూడా చేరొచ్చు.
 
 ఇతర ప్రయోజనాలు:
 జీప్యాట్ ప్రిపరేషన్ ఫార్మసీ నేపథ్యంగా నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు- పీజీఈసెట్, మణిపాల్‌సెట్, బిట్స్-పీజీ, ఫార్మ్‌పీజీ (భారతీయ విద్యాపీఠ్), ప్రభుత్వ రంగంలో ఫార్మాసిస్ట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల నియామకం కోసం నిర్వహించే పరీక్షలు. బెనారస్ హిందూ యూనివర్సిటీ, బిట్స్ పిలానీ, పంజాబ్ యూనివర్సిటీ, బాంబే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా జీప్యాట్ స్కోర్‌తో ప్రవేశం పొందొచ్చు.
 
నోటిఫికేషన్ సమాచారం
 అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ (ఇంటర్మీడియెట్/10+2 తర్వాత నాలుగేళ్ల కోర్సు). చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే.
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 12, 2015
 ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 23-24, 2015
 ఫలితాల విడుదల: మార్చి 27, 2015.
 వెబ్‌సైట్: www.aicte-gpat.in
 
జీప్యాట్‌లో డిగ్రీ స్థాయిలో సిలబస్ ఉంటుంది. కాబట్టి జీప్యాట్ ప్రిపరేషన్  ఫార్మసీ నేపథ్యంగా ఇతర ప్రవేశ/పోటీ పరీక్షలకు సులువుగా సన్నద్ధమవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫార్మా కంపెనీల్లో నియామకాల సందర్భంలోనూ జీప్యాట్ స్కోరు సాధించినవారికి ప్రాధాన్యత లభిస్తోంది.  ఈ పరీక్షలో మంచి స్కోరు సొంతం చేసుకోవాలంటే అభ్యర్థులు ప్రధానంగా ఐదు సబ్జెక్టులపై పట్టు సాధించాలి. అవి.. ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మకోగ్నసీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్ట్రీ. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలోని ఆర్గానిక్ కెమిస్ట్రీపై ప్రత్యేక దృష్టి సారించాలి. అలాగే జ్యురిస్‌ప్రుడెన్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. తక్కువ సమయంలో సిలబస్ పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలి. రివిజన్‌కు తగిన సమయం కేటాయించాలి. ఏదైనా అంశాన్ని అభ్యసించిన తర్వాత అందులోని ప్రశ్నలతోపాటు గత జీప్యాట్/ గేట్ -ఫార్మసీ ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పడుతుంది.
 - ఎ. విజయేంద్ర చారి, మాస్టర్స్ ఫార్మసీ అకాడమీ, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement