ఉన్నత విద్య, ఉద్యోగం..
ఇంజనీరింగ్ కోర్సులో అత్యంత నిర్ణయాత్మక దశ.. నాలుగో సంవత్సరం పూర్తవ్వడానికి నాలుగు నెలలే సమయం మాత్రమ మిగిలి ఉంది.. ఈ దశలో వేసే అడుగులే భావి కెరీర్‌కు బాటలు వేస్తాయి.. ఉన్నత విద్య, ఉద్యోగం.. ఇలా ఎటు వైపు పయనించాలన్నా.. ఈ ఏడాదిలోనే అందుకు తగ్గ సన్నాహాలు ప్రారంభించాలి.. కాలేజీలో ఉన్నప్పుడే కెరీర్ విషయంలో ఓ స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉండే అవకాశాలపై విశ్లేషణ..బీటెక్ కోర్సును పూర్తి చేయబోతున్న విద్యార్థుల ముందు విద్య, ఉద్యోగపరంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వీటిలో సరిపడ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. ఇందుకోసం అందుబాటులోని అవకాశాలు..
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్
బీటెక్‌లో చేరే ముందు క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఏ కాలేజీ? ఏ కోర్సు? మంచిదో తెలుసుకొని మరీ చేరుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవితంలో త్వరగా స్థిరపడడానికి ఇంతకు మించిన మార్గం మరొకటి లేదని చెప్పొచ్చు. కాకపోతే నైపుణ్యాలే ప్రధానంగా నిర్వహించే ఇటువంటి క్యాంపస్ డ్రైవ్‌లలో విజయం సాధించడానికి కావల్సిన సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. ఈ దిశగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకోవడం మంచిది. ఇందుకోసం క్యాంపస్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ వంటి వాటికి హాజరుకావడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం అనేక సంస్థలు వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా నియామకాలకు ప్రకటనలిస్తున్నాయి. క్యాంపస్ సెలక్షన్‌లో ఎంపిక కాని అభ్యర్థులు వీటికి హాజరు కావాలి.
ప్రభుత్వ ఉద్యోగాలు
బీటెక్ తర్వాత మరో అవకాశం ప్రభుత్వ ఉద్యోగాలు. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు డిగ్రీ అర్హతగా నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించవచ్చు. ఈ క్రమంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరు కావడం ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి సర్వీసులకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఎస్‌ఎస్‌సీ నిర్వహించే కంబైన్‌డ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు చేపట్టే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు సిద్ధం కావచ్చు. అంతేకాకుండా పోలీస్ విభాగంలో ఎస్‌ఐ పోస్టులకు కూడా ప్రిపరేషన్ సాగించవచ్చు. కాకపోతే ముందుగా ఎంపిక విధానం, పరీక్ష సిలబస్ వంటి అంశాలపై అవగాహన పెంచుకుని ముందుకు సాగితే మంచిది. కేవలం ఇంజనీరింగ్ అభ్యర్థులకు నిర్వహించే పరీక్షలు ఉంటాయి. అవి.. యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని ఈ పరీక్ష ద్వారా రైల్వేస్, సెంట్రల్ వాటర్ బోర్డు, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్, మిలిటరీ ఇంజనీరింగ్, బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ వంటి గ్రూప్- ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో జెన్‌కో, ట్రాన్స్‌కో, వివిధ విభాగాల్లోని ఏఈ, ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఆయా సంస్థలు పరీక్షలు నిర్వహిస్తుంటాయి. వాటిలో విజయం సాధించడం ద్వారా కూడా ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడొచ్చు.
రక్షణ దళాలు
దేశభక్తి, భిన్నంగా ఆలోచించే వారికి రక్షణ దళాలు చక్కగా సరిపోతాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ఫోర్‌సలలో టెక్నికల్ స్టాఫ్‌గా చేరవచ్చు. యూపీఎస్సీ నిర్వహించే కంబైండ్ డిఫెన్‌స సర్వీసెస్ ద్వారా కమిషన్డ్ ఆఫీసర్లుగా కెరీర్ ప్రారంభించవచ్చు. ఇందులో విజయం సాధించడం ద్వారా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో కెరీర్ ఆరంభమవుతుంది. ఏ సర్వీస్‌లో చేరినప్పటికీ కెరీర్ ఆరంభంలోనే అన్ని అలవెన్సులూ కలుపుకొని నెలకు రూ. 45,000కు పైగా వేతనం లభిస్తుంది.
సొంతంగా పరిశ్రమ
స్వయం ఉపాధి దిశగా ఆలోచన ఉండే సొంతంగా పరిశ్రమ స్థాపించడం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగవచ్చు. కాకపోతే ఇందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఓర్పు, సహనం ఎంతో అవసరం. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు స్వల్ప ఖర్చుతోనే పరిశ్రమలను ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్‌కు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో.. మీ దగ్గరి మంచి ఐడియా ఉంటే పెట్టుబడి పెట్టడానికి ఎన్నో ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ముందుకు వస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇందుకు సంబంధించి కోర్సులను కూడా నిర్వహిస్తున్నాయి. వాటిలో చేర డం ద్వారా తగిన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు.
జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్
ఇంజనీరింగ్ విద్యార్థులకు చక్కని అవకాశం జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్. ఏదైనా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ పూర్తి చేసిన వారు ఈ పరీక్ష రాయొచ్చు. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌నకు ఎంపికైన అభ్యర్థులకు సీఎస్‌ఐఆర్ పరిశోధనశాలలతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధన చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో రెండేళ్లపాటు నెలకు రూ. 16 వేల ఫెలోషిప్ లభిస్తుంది. ప్రతి ఏడాది కాంటిన్‌జెన్సీ గ్రాంట్‌గా రూ. 20 వేలు చెల్లిస్తారు. ఇందులో అర్హత సాధించడం ద్వారా దేశంలోని యూనివర్సిటీలలో/ తత్సమాన ఇన్‌స్టిట్యూట్‌లలో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు.
చివరగా
ఉన్నత విద్య, ఉద్యోగం.. ఈ రెండు లక్ష్యాలు సొంతం చేసుకోలేని విద్యార్థులు నిరుత్సాహానికి గురికాకుండా పకడ్బందీగా వ్యవహరించాలి. నిరంతరం పరిశ్రమ అవసరాలను, మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ముందుకు సాగాలి. తమకు సంబంధించిన విభాగంలో నూతన ఆవిష్కరణలపై అవగాహన ఏర్పరచుకోవాలి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమనుతాము తీర్చిదిద్దుకోవాలి. ఏదో ఒక సంస్థలో ఎలాంటి ఆర్థిక లబ్ధి ఆశించకుండా ఇంటర్న్‌షిప్స్ చేసేందుకు యత్నించాలి. కోర్సు పూర్తయిన రోజు నుంచి ప్రతి రోజు కీలకమే. కాబట్టి.. క్యాంపస్ సెలక్షన్స్, ఉన్నత విద్య అందని విద్యార్థులు పైన పేర్కొన్న విధంగా వ్యవహరిస్తూ తమ రెజ్యూమేలో ఏ నిర్ణీత సమయం కూడా ఖాళీ లేకుండా చూసుకోవాలి.
ఉన్నత విద్యావకాశాలు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనం ముందుండాలంటే ఉన్నత చదువులు తప్పనిసరి. బీటెక్ తర్వాత ఉన్నత విద్య దిశగా దృష్టిసారించడానికి అందుబాటులో ఉన్న మార్గాలను పరిశీలిస్తే.. ఎంటెక్/ఎంఈ: బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ చేయడానికి ఎంటెక్/ఎంఈ కోర్సులు అవకాశం కల్పిస్తున్నాయి. ఇందుకు రెండు మార్గాలున్నాయి. అవి.. గేట్, పీజీఈసెట్. ఉన్నత విద్య దిశగా ఆలోచనలు ఉంటే ‘గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్’ దిశగా దృష్టి సారించడం మేలు. పలు ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు గేట్ స్కోర్ ప్రాతిపదికగా ఎంట్రీ స్థాయి నియామకాలను చేపడుతున్నాయి. ముఖ్యంగా ప్లేస్‌మెంట్స్ తక్కువగా ఉంటే కాలేజీల విద్యార్థులు ఈ అంశాన్ని నిశితంగా గమనించాలి. అంతేకాకుండా ఐఐటీ, నిట్, ఐఐఎస్‌సీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు మిగతా టాప్ కాలేజీలు కూడా ఎంటెక్/ఎంఈ కోర్సులో ప్రవేశానికి గేట్ స్కోర్‌కు ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాయి. అంతేకాకుండా ఇందులో అర్హత సాధించిన వారికి నెలకు రూ.12,400 స్టైఫండ్ లభిస్తుంది. పీజీఈసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) రాష్ట్రస్థాయి కాలేజీల్లో పీజీ చేయడానికి దోహదపడుతుంది. మీ ఆసక్తి ఉన్న రంగాల్లో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ చేసే స్పెషలైజ్డ్ కోర్సులను కూడా ఎంచుకోవచ్చు.
ఎంబీఏ: బీటెక్ తర్వాత చేయదగ్గ మరో కోర్సు ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్). నాయకత్వ లక్షణాలు, నిర్వహణ సామర్థ్యాలు ఉన్న వారికి ఈ కోర్సు సరిగ్గా సరిపోతుంది. ఎంటెక్ చదవడం ద్వారా చీఫ్ ఇంజనీర్ స్థాయికి చేరుకోవచ్చు. కానీ ఎంబీఏ డిగ్రీ ఉంటే ఒక కంపెనీ/సంస్థ కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించే సీఈఓ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) హోదాను పొందొచ్చు. కాబట్టి ఈ దిశగా ఆలోచనలు ఉంటే ఎంబీఏ కోర్సులో చేరడం మంచిది. ఇందుకు అవకాశం కల్పిస్తున్న పరీక్షలు.. క్యాట్, మ్యాట్, సీమ్యాట్, ఐసెట్. వీటిలో క్యాట్ పరీక్షలో మంచి పర్సంటైల్ సాధిస్తే ఐఐఎంలలో ప్రవేశాన్ని ఖరారు చేసుకోవచ్చు. మిగతా పరీక్షల ద్వారా జాతీయ సంస్థల్లో అడ్మిషన్ పొందొచ్చు. ఐసెట్ రాష్ట్రస్థాయి పరీక్ష. దీని ద్వారా రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ/కాలేజీల్లో ఎంబీఏ కోర్సులో చేరొచ్చు. అంతేకాకుండా ఆసక్తి ఉంటే రిస్క్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్‌కు సంబంధించి పలు కోర్సులను చేయవచ్చు. వీటి ద్వారా చక్కని అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.
ఎంఎస్: పరిశోధనల పట్ల మక్కువ, కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఉన్న వారు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎంఎస్ చేయవచ్చు. ఇందుకోసం జీఆర్‌ఈ, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీమ్యాట్ వంటి పరీక్షలకు ప్రిపేర్ కావాలి. ఇందులో మెరుగైన స్కోర్ సాధిస్తే అక్కడి యూనివర్సిటీలు అందించే స్కాలర్‌షిప్స్, టీచింగ్ అసిస్టెన్‌స వంటి ఆర్థిక చేయూతను పొందే అవకాశం ఉంటుంది. ఈ దిశగా సన్నాహాలను కనీసం ఆరు నెలల ముందు మొదలు పెట్టాలి. ఈ క్రమంలో ఏ దేశంలో చదవాలనుకుంటున్నారు? ఆ దేశంలోని మంచి యూనివర్సిటీలు?వాటికి అవసరమైన అర్హతలు? ఆర్థికపరమైన అంశాలు? ఆయా యూనివర్సిటీల్లో లభించే స్కాలర్‌షిప్‌లు? వంటి అంశాల్లో స్పష్టమైన అవగాహనతో ఉండాలి. ఈ సందర్భంలో విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. జీఆర్‌ఈ స్కోర్ ఆధారంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలు మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నాయి. ఇటీవల వెలుగు చూస్తున్న ఫేక్ యూనివర్సిటీల నేపథ్యంలో.. వర్సిటీ, కోర్సు ఎంపికలో జాగ్రత్తగా ఉండడం మంచిది. గుర్తింపు సంస్థలు నిర్దేశించిన వర్సిటీలనే ఎంచుకోవడం ప్రయోజనకరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాములను కూడా నిర్వహిస్తున్నాయి. ఉదాహరణకు: ఎంఎస్ + పీహెచ్‌డీ. ఇటువంటి కోర్సులను ఎంచుకోవడం ద్వారా కెరీర్‌లో త్వరగా స్థిరపడొచ్చు.