BTech course
-
మహింద్రా ఎకోల్ సెంట్రల్ కాలేజీ అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్ : మహింద్రా ఎకోల్ సెంట్రల్(ఎంఈసీ) కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ 2018-19 విద్యా సంవత్సరానికి గాను తమ హైదరాబాద్ క్యాంపస్‌కు సంబంధించి నాలుగేళ్ల బీటెక్ ప్రొగ్రామ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించింది. నాలుగు స్పెషలైజేషన్లలో మొత్తం 240 సీట్లను అందుబాటులో ఉంచింది. ఒక్కో స్పెషలైజేషన్‌కు 60 సీట్లు కేటాయించింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీర్ స్పెషలైజేషన్లను ఎంఈసీ ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో ఏదైనా చట్టబద్దమైన బోర్డు నుంచి 10+2 పూర్తి చేసిన వారు, ఐబీ లేదా ఇతర ఆమోదం పొందిన బోర్డుల్లో సమానమైన గ్రేడ్లతో అర్హత సాధించిన విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంఈసీ పేర్కొంది. జేఈఈ మెయిన్ 2018(2,20,000 వరకు ర్యాంకు పొందిన వారు లేదా జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌లో అర్హత సాధించవారు) లేదా చెల్లుబాటు అయ్యే SAT స్కోర్స్(మేథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి ఉండే సబ్జెట్లలో కనీసం 1800 మార్కులు పొందడం) బట్టి ఈ అడ్మిషన్లను ఆమోదిస్తున్నట్టు కాలేజీ తెలిపింది. ప్రస్తుతం అప్లికేషన్ పోర్టల్‌లో కాలేజీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. 2017 జూలై 7 వరకు అప్లికేషన్లను ఫైల్ చేసేందుకు గడువు ఇచ్చింది. మే 7వ తేదీ కంటే ముందు దరఖాస్తు చేసుకున్న వారికి మే 31 లేదా జూన్ 1న తొలి రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. -
‘విజ్ఞాన్’ వీశాట్ ఫలితాలు విడుదల
మే 10 నుంచి కౌన్సెలింగ్ గుంటూరు ఎడ్యుకేషన్: బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గుంటూరు జిల్లా వడ్ల మూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన వీశాట్–2017(విజ్ఞాన్ స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్) ఫలితాలను ఆ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గురువారం విడుదల చేశారు. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన 42 వేల మందికి పైగా విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీల కంటే ముందుగా ప్రవేశ పరీక్ష నిర్వహించడంతో పాటు వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామ న్నారు. మే 10 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి, జూన్ మొదటివారంలో తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. తొలి పది ర్యాంకర్లు వీరే... విజ్ఞాన్ వర్సిటీ వీసీ బి.రామ్మూర్తి మాట్లాడుతూ.. వీశాట్‌లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన బట్టు శ్రీచరణ్ మొదటి ర్యాంకు సాధించినట్లు చెప్పారు. కొవ్వూరుకు చెందిన పెదవేగి శశినందన్ రెండో ర్యాంకు, తణుకు చెందిన గరిమెళ్ల మోహన్రఘు మూడో ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లా గంటికి చెందిన కంచర్ల బాలాజీ శ్రీ హర్ష నాలుగో ర్యాంక్, మేడపాడుకు చెందిన ఎలుబండి వీరేంద్ర సాయి ఐదో ర్యాంకు, గుంటూరు జిల్లాకు చెందిన గోరంట్ల జయంత్ హర్ష ఆరో ర్యాంకు, పెనుమంత్రకు చెందిన కొక్కిరాల జ్వాలాఈశ్వర్ప్రసాద్ 7వ ర్యాంకు, నల్లజెర్లకు చెందిన గండ్రకోటి గంగాధర రామకృష్ణ 8వ ర్యాంకు, భీమవరానికి చెందిన ఎ.హర్షిత్ 9వ ర్యాంకు, వేలివెన్నుకు చెందిన జి.శ్రీనివాస్ 10వ ర్యాంకు సాధించారని తెలిపారు. ప్రతిభకు ప్రోత్సాహం... డీన్ రవికుమార్ మాట్లాడుతూ.. వీశాట్తో పాటు ఇంటర్ మార్కులు, ఐఐటీ జేఈఈ, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా కూడా విజ్ఞాన్స్ వర్సిటీలోని బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఐటీ సర్వీసెస్ డీన్ ప్రొఫెసర్ కె.వి.కృష్ణకిషోర్ మాట్లాడుతూ.. ప్రతిభావంతులకు ఫీజు రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. వీశాట్ ఫలితాల కోసం vifna nuniverrity.org వెబ్‌సైట్‌తో పాటు టోల్‌ఫ్రీ నం.1800 425 2529ను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో విజ్ఞాన్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఇంజినీరింగ్ అండ్ మేనేజిమెంట్ డీన్ డాక్టర్ వి.మధుసూదన రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్య, ఉద్యోగం..
ఇంజనీరింగ్ కోర్సులో అత్యంత నిర్ణయాత్మక దశ.. నాలుగో సంవత్సరం పూర్తవ్వడానికి నాలుగు నెలలే సమయం మాత్రమ మిగిలి ఉంది.. ఈ దశలో వేసే అడుగులే భావి కెరీర్‌కు బాటలు వేస్తాయి.. ఉన్నత విద్య, ఉద్యోగం.. ఇలా ఎటు వైపు పయనించాలన్నా.. ఈ ఏడాదిలోనే అందుకు తగ్గ సన్నాహాలు ప్రారంభించాలి.. కాలేజీలో ఉన్నప్పుడే కెరీర్ విషయంలో ఓ స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉండే అవకాశాలపై విశ్లేషణ..బీటెక్ కోర్సును పూర్తి చేయబోతున్న విద్యార్థుల ముందు విద్య, ఉద్యోగపరంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వీటిలో సరిపడ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. ఇందుకోసం అందుబాటులోని అవకాశాలు.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ బీటెక్‌లో చేరే ముందు క్యాంపస్ ప్లేస్మెంట్ ఏ కాలేజీ? ఏ కోర్సు? మంచిదో తెలుసుకొని మరీ చేరుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవితంలో త్వరగా స్థిరపడడానికి ఇంతకు మించిన మార్గం మరొకటి లేదని చెప్పొచ్చు. కాకపోతే నైపుణ్యాలే ప్రధానంగా నిర్వహించే ఇటువంటి క్యాంపస్ డ్రైవ్‌లలో విజయం సాధించడానికి కావల్సిన సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. ఈ దిశగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకోవడం మంచిది. ఇందుకోసం క్యాంపస్ రిక్రూట్మెంట్ టెస్ట్ వంటి వాటికి హాజరుకావడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం అనేక సంస్థలు వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా నియామకాలకు ప్రకటనలిస్తున్నాయి. క్యాంపస్ సెలక్షన్లో ఎంపిక కాని అభ్యర్థులు వీటికి హాజరు కావాలి. ప్రభుత్వ ఉద్యోగాలు బీటెక్ తర్వాత మరో అవకాశం ప్రభుత్వ ఉద్యోగాలు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు డిగ్రీ అర్హతగా నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించవచ్చు. ఈ క్రమంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరు కావడం ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసులకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఎస్ఎస్సీ నిర్వహించే కంబైన్డ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు చేపట్టే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు సిద్ధం కావచ్చు. అంతేకాకుండా పోలీస్ విభాగంలో ఎస్ఐ పోస్టులకు కూడా ప్రిపరేషన్ సాగించవచ్చు. కాకపోతే ముందుగా ఎంపిక విధానం, పరీక్ష సిలబస్ వంటి అంశాలపై అవగాహన పెంచుకుని ముందుకు సాగితే మంచిది. కేవలం ఇంజనీరింగ్ అభ్యర్థులకు నిర్వహించే పరీక్షలు ఉంటాయి. అవి.. యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని ఈ పరీక్ష ద్వారా రైల్వేస్, సెంట్రల్ వాటర్ బోర్డు, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్, మిలిటరీ ఇంజనీరింగ్, బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ వంటి గ్రూప్- ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో జెన్కో, ట్రాన్స్‌కో, వివిధ విభాగాల్లోని ఏఈ, ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఆయా సంస్థలు పరీక్షలు నిర్వహిస్తుంటాయి. వాటిలో విజయం సాధించడం ద్వారా కూడా ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడొచ్చు. రక్షణ దళాలు దేశభక్తి, భిన్నంగా ఆలోచించే వారికి రక్షణ దళాలు చక్కగా సరిపోతాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఆర్మీ/ నేవీ/ ఎయిర్ఫోర్సలలో టెక్నికల్ స్టాఫ్‌గా చేరవచ్చు. యూపీఎస్సీ నిర్వహించే కంబైండ్ డిఫెన్స సర్వీసెస్ ద్వారా కమిషన్డ్ ఆఫీసర్లుగా కెరీర్ ప్రారంభించవచ్చు. ఇందులో విజయం సాధించడం ద్వారా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో కెరీర్ ఆరంభమవుతుంది. ఏ సర్వీస్‌లో చేరినప్పటికీ కెరీర్ ఆరంభంలోనే అన్ని అలవెన్సులూ కలుపుకొని నెలకు రూ. 45,000కు పైగా వేతనం లభిస్తుంది. సొంతంగా పరిశ్రమ స్వయం ఉపాధి దిశగా ఆలోచన ఉండే సొంతంగా పరిశ్రమ స్థాపించడం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగవచ్చు. కాకపోతే ఇందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఓర్పు, సహనం ఎంతో అవసరం. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు స్వల్ప ఖర్చుతోనే పరిశ్రమలను ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఎంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్‌కు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో.. మీ దగ్గరి మంచి ఐడియా ఉంటే పెట్టుబడి పెట్టడానికి ఎన్నో ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ముందుకు వస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇందుకు సంబంధించి కోర్సులను కూడా నిర్వహిస్తున్నాయి. వాటిలో చేర డం ద్వారా తగిన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ ఇంజనీరింగ్ విద్యార్థులకు చక్కని అవకాశం జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్. ఏదైనా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ పూర్తి చేసిన వారు ఈ పరీక్ష రాయొచ్చు. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌నకు ఎంపికైన అభ్యర్థులకు సీఎస్ఐఆర్ పరిశోధనశాలలతోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో పరిశోధన చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో రెండేళ్లపాటు నెలకు రూ. 16 వేల ఫెలోషిప్ లభిస్తుంది. ప్రతి ఏడాది కాంటిన్జెన్సీ గ్రాంట్‌గా రూ. 20 వేలు చెల్లిస్తారు. ఇందులో అర్హత సాధించడం ద్వారా దేశంలోని యూనివర్సిటీలలో/ తత్సమాన ఇన్స్టిట్యూట్లలో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. చివరగా ఉన్నత విద్య, ఉద్యోగం.. ఈ రెండు లక్ష్యాలు సొంతం చేసుకోలేని విద్యార్థులు నిరుత్సాహానికి గురికాకుండా పకడ్బందీగా వ్యవహరించాలి. నిరంతరం పరిశ్రమ అవసరాలను, మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ముందుకు సాగాలి. తమకు సంబంధించిన విభాగంలో నూతన ఆవిష్కరణలపై అవగాహన ఏర్పరచుకోవాలి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమనుతాము తీర్చిదిద్దుకోవాలి. ఏదో ఒక సంస్థలో ఎలాంటి ఆర్థిక లబ్ధి ఆశించకుండా ఇంటర్న్షిప్స్ చేసేందుకు యత్నించాలి. కోర్సు పూర్తయిన రోజు నుంచి ప్రతి రోజు కీలకమే. కాబట్టి.. క్యాంపస్ సెలక్షన్స్, ఉన్నత విద్య అందని విద్యార్థులు పైన పేర్కొన్న విధంగా వ్యవహరిస్తూ తమ రెజ్యూమేలో ఏ నిర్ణీత సమయం కూడా ఖాళీ లేకుండా చూసుకోవాలి. ఉన్నత విద్యావకాశాలు ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనం ముందుండాలంటే ఉన్నత చదువులు తప్పనిసరి. బీటెక్ తర్వాత ఉన్నత విద్య దిశగా దృష్టిసారించడానికి అందుబాటులో ఉన్న మార్గాలను పరిశీలిస్తే.. ఎంటెక్/ఎంఈ: బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ చేయడానికి ఎంటెక్/ఎంఈ కోర్సులు అవకాశం కల్పిస్తున్నాయి. ఇందుకు రెండు మార్గాలున్నాయి. అవి.. గేట్, పీజీఈసెట్. ఉన్నత విద్య దిశగా ఆలోచనలు ఉంటే ‘గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్’ దిశగా దృష్టి సారించడం మేలు. పలు ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లు గేట్ స్కోర్ ప్రాతిపదికగా ఎంట్రీ స్థాయి నియామకాలను చేపడుతున్నాయి. ముఖ్యంగా ప్లేస్‌మెంట్స్ తక్కువగా ఉంటే కాలేజీల విద్యార్థులు ఈ అంశాన్ని నిశితంగా గమనించాలి. అంతేకాకుండా ఐఐటీ, నిట్, ఐఐఎస్సీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు మిగతా టాప్ కాలేజీలు కూడా ఎంటెక్/ఎంఈ కోర్సులో ప్రవేశానికి గేట్ స్కోర్‌కు ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాయి. అంతేకాకుండా ఇందులో అర్హత సాధించిన వారికి నెలకు రూ.12,400 స్టైఫండ్ లభిస్తుంది. పీజీఈసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) రాష్ట్రస్థాయి కాలేజీల్లో పీజీ చేయడానికి దోహదపడుతుంది. మీ ఆసక్తి ఉన్న రంగాల్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఆఫర్ చేసే స్పెషలైజ్డ్ కోర్సులను కూడా ఎంచుకోవచ్చు. ఎంబీఏ: బీటెక్ తర్వాత చేయదగ్గ మరో కోర్సు ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్). నాయకత్వ లక్షణాలు, నిర్వహణ సామర్థ్యాలు ఉన్న వారికి ఈ కోర్సు సరిగ్గా సరిపోతుంది. ఎంటెక్ చదవడం ద్వారా చీఫ్ ఇంజనీర్ స్థాయికి చేరుకోవచ్చు. కానీ ఎంబీఏ డిగ్రీ ఉంటే ఒక కంపెనీ/సంస్థ కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించే సీఈఓ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) హోదాను పొందొచ్చు. కాబట్టి ఈ దిశగా ఆలోచనలు ఉంటే ఎంబీఏ కోర్సులో చేరడం మంచిది. ఇందుకు అవకాశం కల్పిస్తున్న పరీక్షలు.. క్యాట్, మ్యాట్, సీమ్యాట్, ఐసెట్. వీటిలో క్యాట్ పరీక్షలో మంచి పర్సంటైల్ సాధిస్తే ఐఐఎంలలో ప్రవేశాన్ని ఖరారు చేసుకోవచ్చు. మిగతా పరీక్షల ద్వారా జాతీయ సంస్థల్లో అడ్మిషన్ పొందొచ్చు. ఐసెట్ రాష్ట్రస్థాయి పరీక్ష. దీని ద్వారా రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ/కాలేజీల్లో ఎంబీఏ కోర్సులో చేరొచ్చు. అంతేకాకుండా ఆసక్తి ఉంటే రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్‌కు సంబంధించి పలు కోర్సులను చేయవచ్చు. వీటి ద్వారా చక్కని అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఎంఎస్: పరిశోధనల పట్ల మక్కువ, కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఉన్న వారు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎంఎస్ చేయవచ్చు. ఇందుకోసం జీఆర్ఈ, టోఫెల్, ఐఈఎల్టీఎస్, జీమ్యాట్ వంటి పరీక్షలకు ప్రిపేర్ కావాలి. ఇందులో మెరుగైన స్కోర్ సాధిస్తే అక్కడి యూనివర్సిటీలు అందించే స్కాలర్షిప్స్, టీచింగ్ అసిస్టెన్స వంటి ఆర్థిక చేయూతను పొందే అవకాశం ఉంటుంది. ఈ దిశగా సన్నాహాలను కనీసం ఆరు నెలల ముందు మొదలు పెట్టాలి. ఈ క్రమంలో ఏ దేశంలో చదవాలనుకుంటున్నారు? ఆ దేశంలోని మంచి యూనివర్సిటీలు?వాటికి అవసరమైన అర్హతలు? ఆర్థికపరమైన అంశాలు? ఆయా యూనివర్సిటీల్లో లభించే స్కాలర్షిప్లు? వంటి అంశాల్లో స్పష్టమైన అవగాహనతో ఉండాలి. ఈ సందర్భంలో విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. జీఆర్ఈ స్కోర్ ఆధారంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలు మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నాయి. ఇటీవల వెలుగు చూస్తున్న ఫేక్ యూనివర్సిటీల నేపథ్యంలో.. వర్సిటీ, కోర్సు ఎంపికలో జాగ్రత్తగా ఉండడం మంచిది. గుర్తింపు సంస్థలు నిర్దేశించిన వర్సిటీలనే ఎంచుకోవడం ప్రయోజనకరం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాములను కూడా నిర్వహిస్తున్నాయి. ఉదాహరణకు: ఎంఎస్ + పీహెచ్డీ. ఇటువంటి కోర్సులను ఎంచుకోవడం ద్వారా కెరీర్లో త్వరగా స్థిరపడొచ్చు. -
లెర్నింగ్ బై డూయింగ్: ట్రిపుల్ ఐటీ
ముందుగానే నిర్దేశించిన సిలబస్.. దాని ప్రకారం.. మూడున్నరేళ్లపాటు తరగతి గదిలో బోధన, అధ్యయనం.. చివరి సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్.. ప్రస్తుతం మన బీటెక్ కోర్సుల తీరు తెన్నులివి. కానీ ఇందుకు భిన్నంగా నిరంతరం లేబొరేటరీలు, రీసెర్చ్ విభాగాల్లో భాగస్వాములను చేస్తూ బ్యాచిలర్ డిగ్రీ తొలినాళ్ల నుంచే పుస్తకాల్లో చదువుకున్న అంశాలపై ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ కల్పిస్తూ... లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో విద్యార్థులకు నైపుణ్యాలను అందిస్తున్న ఇన్స్టిట్యూట్.. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-హైదరాబాద్ (ట్రిపుల్ ఐటీ -హైదరాబాద్). మనసిటీలో ఏర్పాటై.. అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్న ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్‌పై ఇన్స్టిట్యూట్ వాచ్.. దేశంలో తొలిసారిగా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో నాన్-ప్రాఫిట్ విధానంలో ప్రారంభమైన ట్రిపుల్ ఐటీ - హైదరాబాద్.. మొదటి నుంచీ ‘రీసెర్చ్ యూనివర్సిటీ’ లక్ష్యంతో బోధన సాగిస్తోంది. నిరంతరం ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతూ పదహారేళ్ల ఇన్స్టిట్యూట్ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. అకడెమిక్స్‌లో వినూత్న విధానం ట్రిపుల్ ఐటీ.. అకడెమిక్ బోధనలోనూ వినూత్న విధానాలకు రూపకల్పన చేసింది. స్ట్రక్చరల్ లెర్నింగ్‌కు బదులు ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ విధానాన్ని విద్యార్థులకు అందిస్తోంది. విద్యార్థులు గ్రాడ్యుయేట్ స్థాయిలో తమకు నచ్చిన కోర్సులను, ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసుకునే విధంగా కరిక్యులం అందుబాటులో ఉంది. దీంతో విద్యార్థులు తమకు నిజంగా ఆసక్తి ఉన్న విభాగాలను గుర్తించి అందులో నిష్ణాతులుగా రాణిస్తున్నారు. అందుకే ఈ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్కాలర్‌షిప్స్‌కు ఎంపికయ్యారు. బీటెక్ నుంచే పరిశోధనలో పాల్పంచుకునేలా ప్రస్తుతం ఈ ఇన్స్టిట్యూట్.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లను ఆఫర్ చేస్తోంది. ఈ బ్రాంచ్‌ల్లో కేవలం కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లే కాకుండా హ్యుమానిటీస్ అంశాలను కూడా బోధిస్తూ విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించేలా చేస్తోంది. వీటితోపాటు ఇన్స్టిట్యూట్ చేపడుతున్న రీసెర్చ్ ప్రోగ్రామ్స్‌లో బీటెక్ స్థాయిలోనే ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఎందరో విద్యార్థులు అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలోనే పలు ప్రముఖ జర్నల్స్‌లో, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పేపర్స్ ప్రచురించారు. బీటెక్ కోర్సులే కాకుండా ఎంటెక్, ఎంఎస్ బై రీసెర్చ్, పీహెచ్డీ, ఎంఫిల్ (కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్) కోర్సులను అందిస్తోంది. బీటెక్ అండ్ ఎంఎస్ బై రీసెర్చ్ పేరుతో అయిదేళ్ల వ్యవధిలో డ్యూయల్ డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఈ డ్యూయల్ డిగ్రీ ప్రస్తుతం కోర్ ఏరియాకు సంబంధించి మూడు విభాగాల్లో (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్; బిల్డింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) అందుబాటులో ఉంది. అంతేకాకుండా విద్యార్థులు బీటెక్‌లో ఒక కోర్సు; ఎంఎస్బై రీసెర్చ్‌లో తమ ఆసక్తి మేరకు మరో కోర్సును ఎంచుకునే విధంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్‌కు అనుసంధానంగా ఎంఎస్ బై రీసెర్చ్‌లో కంప్యూటేషనల్ నేచురల్ సైన్స్; కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్; ఎక్సాట్ హ్యుమానిటీస్ కోర్సులను ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌తో అందిస్తోంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డ్లు ఇన్స్టిట్యూట్ బోధన, రీసెర్చ్ పరంగా అంతర్జాతీయ గుర్తింపు పొందడంతోపాటు ఎన్నో అవార్డ్లు ఈ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు లభించాయి. నాసా నేతృత్వంలోని అమెరికన్ ఆస్ట్రోనాటికల్ సొసైటీ నిర్వహించే అంతర్జాతీయ పోటీలు.. కాన్‌శాట్ అవార్డులు, గూగుల్ ఇండియా ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ అవార్డులు; గూగుల్ - ఇండియా స్కాలర్షిప్ అవార్డ్లు వంటివి ఇందుకు కొన్ని నిదర్శనాలు. ప్లేస్‌మెంట్స్‌లోనూ రికార్డ్ ప్లేస్‌మెంట్స్ పరంగానూ ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్ రికార్డులు నమోదు చేస్తోంది. ఆయా సర్వే సంస్థలు నిర్వహించే ర్యాంకింగ్స్‌లో ప్లేస్‌మెంట్స్ పరంగా గత పదేళ్లుగా టాప్-10లోనే ఉంటోంది. వంద శాతం ప్లేస్మెంట్ రికార్డ్‌తో సగటున రూ.9 లక్షల వార్షిక వేతనం ఖాయంగా లభిస్తోంది. ఇన్స్టిట్యూట్ ప్రాధాన్యాన్ని గుర్తించి పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఒక సంస్థ 2013లో రూ.17 లక్షల వార్షిక వేతనం అందించింది. మౌలిక సదుపాయాలు మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాల పరంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు తప్పనిసరిగా అవసరమైన కంప్యూటర్స్, లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఇద్దరు విద్యార్థులకు ఒక కంప్యూటర్ (పీసీ టు స్టూడెంట్ రేషియో- 1:2) అందుబాటులో ఉంది. అదే విధంగా రీసెర్చ్ జర్నల్స్, సీడీరామ్స్, ఆన్లైన్ రిసోర్సెస్‌తో వేల సంఖ్యలో రిఫరెన్స్ పుస్తకాలు లైబ్రరీలో లభిస్తాయి. డిజిటల్ లైబ్రరీలోనూ అనేక పుస్తకాలు, మరెన్నో పూర్వ లెక్చర్స్‌ను పరిశీలించే అవకాశం అందుబాటులో ఉంది. ప్రవేశాలు ఇలా.. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ మార్కుల ఆధా రంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తారు. పీజీ కోర్సులకు ఇన్స్టిట్యూట్ సొంతంగా నిర్వహించే పీజీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నిరంతరం లేబొరేటరీలు, రీసెర్చ్ సెంటర్స్‌లో తలమునకలైన విద్యార్థులకు మానసికోల్లాసం కల్పించే దిశగా ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌ను కూడా ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తోంది. ప్లే గ్రౌండ్, జిమ్నాజియం వంటి సదుపాయాలు కల్పించడంతోపాటు, పలు సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వెబ్సైట్: www.iiit.ac.in ముఖ్య ఉద్దేశం.. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ముఖ్య ఉద్దేశం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కీలకంగా వ్యవహరించడం. అందుకే మొదటి నుంచీ రీసెర్చ్ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో టెక్నాలజీ విభాగంలో ఎనిమిది; డొమైన్ ఏరియాలో పదకొండు; డెవలప్మెంట్ విభాగంలో మూడు రీసెర్చ్ సెంటర్లను నిర్వహిస్తోంది. వీటిలో నిరంతరం ఇండస్ట్రీ స్పాన్సర్డ్, ఇన్స్టిట్యూట్ సొంత రీసెర్చ్ కార్యకలాపాలు సాగుతూనే ఉంటాయి. ఈ సెంటర్లల్లో రీసెర్చ్ కార్యకలాపాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఇన్స్టిట్యూట్ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యుల నేతృత్వంలో దాదాపు పదిహేను వందల రీసెర్చ్ పబ్లికేషన్స్; పదుల సంఖ్యలో పుస్తకాలు ప్రచురితమవడమే ఇందుకు నిదర్శనం. రీసెర్చ్‌తోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఔత్సాహికుల కోసం ఇంక్యుబేషన్ సెంటర్‌ను నిర్వహించడం ఇన్స్టిట్యూట్ మరో ప్రత్యేకత. ఏ టు జెడ్ ఇన్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ విభాగాల్లో విద్యార్థులకు ఏ టు జెడ్ నాలెడ్జ్ అందించడమే లక్ష్యంగా ట్రిపుల్ ఐటీ చర్యలు చేపడుతోంది. ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు పొందేలా ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, ఆర్ అండ్ డీ అప్రోచ్‌తో బోధన సాగిస్తున్నాం. అందుకే ఇక్కడి విద్యార్థులు కేవలం డొమైన్ ఏరియాకే పరిమితం కాకుండా పరిశ్రమలో అడుగు పెట్టాక అన్ని కోణాల్లోనూ ప్రతిభ చూపుతున్నారు. ఇన్స్టిట్యూట్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ నిర్వహించే పలు సంస్థల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ కూడా ఇదే. పూర్తి రెసిడెన్షియల్ విధానంలో ఉండే ప్రోగ్రామ్‌ల విద్యార్థులు హాస్టల్ నివసించడం తప్పనిసరి. ఇది కూడా ఒక విధంగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే అంశమే. సహచరులతో గ్రూప్-డిస్కషన్స్‌కు, తద్వారా కొత్త అంశాల అన్వేషణకు మార్గం లభిస్తుంది. - ప్రొఫెసర్ పి.జె. నారాయణన్, డెరైక్టర్, ట్రిపుల్ ఐటీ - హైదరాబాద్