అతివలకు అందుబాటులో కోర్సులెన్నో.. | housewifes will have to learn more courses | Sakshi
Sakshi News home page

అతివలకు అందుబాటులో కోర్సులెన్నో..

Published Sun, Sep 7 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

అతివలకు అందుబాటులో కోర్సులెన్నో..

అతివలకు అందుబాటులో కోర్సులెన్నో..

అనుస్మిత... నగరంలో సాధారణ గృహిణి. అత్తమామ, భర్త, ఇద్దరు పిల్లలతో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఇంటీరియర్ డిజైనింగ్‌లో రెండేళ్ల కోర్సు పూర్తిచేశారు. ప్రస్తుతం ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. కామర్స్‌లో పీజీ పూర్తిచేసిన ఆమె అమెరికాలో ఐదేళ్లపాటు ఓ బ్యాంక్‌లో అడ్వైజర్‌గా సేవలందించారు. తర్వాత మాతృదేశానికి తిరిగి వచ్చి, తన అభిరుచికి తగినట్లు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సును కెరీర్‌గా ఎంచుకున్నారు.
 భార్గవి... బీటెక్ పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్‌తో సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్‌లో చేరారు. అక్కడ కొంతకాలం పనిచేశాక తనకు ఇష్టమైన రంగాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలని భావించారు. ఉద్యోగం మానేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరారు. ప్రస్తుతం బోటిక్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.  
 - వీరిద్దరే కాదు.. నగరంలో చాలామంది మహిళలు, గృహిణులు, చదువు మధ్యలో ఆపేసిన యువతులు.. కొంతకాలం ఉద్యోగం చేసి ఆర్థికంగా నిలదొక్కుకున్నాక తమ ఆసక్తికి తగిన కోర్సులో చేరిపోతున్నారు. ఇష్టమైన వ్యాపకాన్నే కెరీర్‌గా ఎంచుకొని విజయాలు సాధిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సొంతంగా వ్యాపార నిర్వహణ వైపు మొగ్గుచూపుతుండడం విశేషం. తద్వారా భవిష్యత్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. మహిళల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రత్యేకంగా పలు షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్, డిస్టెన్స్ కోర్సులను అందిస్తున్నాయి. ఆ వివరాలు..
 
 క్రేజ్.. సోషల్ ఇమేజ్
 నగరంలో కార్పొరేట్ కల్చర్‌తోపాటు మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అందం, ఆహారం, ఆరోగ్యం, అలంకరణ, ఫ్యాషన్, జువెలరీ డిజైనింగ్ వంటి అంశాలకు ఆదరణ పెరిగింది. దానికి తగినట్లుగానే ఆయా రంగాల్లో నిపుణులకు డిమాండ్ అధికమైంది. దాంతో వీటిని కెరీర్‌గా ఎంచుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారని నిఫ్ట్-హైదరాబాద్ డిప్యూటీ డెరైక్టర్ గోపాలకృష్ణ చెప్పారు. ముఖ్యంగా ఫ్యాషన్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైన్, జెమ్, జువెలరీ అంశాల్లో అర్హత, నెపుణ్యాలను పెంచుకునేందుకు సిటీ మహిళలు,యువతులు మొగ్గు చూపుతున్నారని విశ్లేషించారు. వీటితో కెరీర్ ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవడంతోపాటు కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారని వెల్లడిం చారు.
 
 అంతేకాకుండా పలువురికి ఉపాధి కల్పించడం ద్వారా సమాజంలో మంచి పేరు కూడా సంపాదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్వతహాగా ఆర్ట్, డిజైనింగ్ వంటి కళాత్మక అంశాలకు వనితలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తార ని అన్నారు. నానాటికీ పెరుగుతున్న ఖర్చుల కారణంగా గృహిణులు సైతం కుటుంబానికి తమ వంతు తోడ్పాటునివ్వాలనే ఆలోచనలో ఉన్నారు. వీరితోపాటు గ్రాడ్యుయేషన్, పీజీలు చేసిన యువతులు కూడా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. తమకిష్టమైన కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లలో చేరి నైపుణ్యాల్ని పెంచుకుంటున్నారు. తద్వారా ఆర్థిక స్వాతంత్య్రంతోపాటు ఆత్మవిశ్వాసాన్నీ సొంతం చేసుకుంటున్నారు.
 
 అందం నుంచి అలంకరణ వరకు...
 నగర పరిస్థితులు, ఇక్కడి మార్కెటింగ్ అవకాశాలకు అనుగుణంగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు మహిళాలకు ఎన్నోకోర్సులను అందిస్తున్నాయి.  బ్యూటీషియన్ నుంచి ఎయిర్‌హోస్టెస్ వరకు ప్రత్యేకంగా మహిళల కోసం కొన్ని కోర్సులు
 
 అందుబాటులో ఉన్నాయి. నెలల వ్యవధి ఉన్న కోర్సుల నుంచి మూడేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సుల వరకు అభ్యసించే అవకాశం ఉంది. సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, పాలిటెక్నిక్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ స్థాయిల్లో ఈ కోర్సులను చదవొచ్చు. బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, అప్పెరల్ డిజైనింగ్, గార్మెంట్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైనింగ్, క్యాండిల్ మేకింగ్, యోగా, చాక్‌లెట్ మేకింగ్, సలాడ్ మేకింగ్, జెమాలజీ, జువెలరీ డిజైన్, జువెలరీ మేకింగ్, డైమండ్ గ్రేడింగ్, డైమండ్ సర్టిఫికేషన్, డైటీషియన్, హోమ్‌సైన్స్, లెదర్ టెక్నాలజీ, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్, స్కూల్ మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌టాయ్స్ మేకింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కటింగ్ అండ్ టైలరింగ్, బంజారా అండ్ మిర్రర్ వర్క్.. ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయి. నిఫ్ట్‌లో 3 నెలలు, 6 నెలలు, ఏడాది వ్యవధిలో ఫ్యాషన్ బ్రాండ్ మేనే జ్‌మెంట్, ఫ్యాషన్ క్లాతింగ్ టెక్నాలజీ, ఫ్యాషన్ యాక్సెసరీస్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్‌మెంట్, ఫ్యాషన్ ఇంటిగ్రేషన్, మార్కెటింగ్ అప్లికేషన్ ఫర్ టెక్స్‌టైల్స్, కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ, క్లాతింగ్ ప్రొడక్షన్ టెక్నాలజీ కోర్సులున్నాయి. వీటిలో చేరేందుకు ఆయా కోర్సులను బట్టి ఎనిమిదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు అర్హులు.
 
 కళలకు డిమాండ్
 భారతావని ప్రాచీన కాలం నుంచి కళలకు పెట్టింది పేరు. సంగీతం, నాట్యం వంటివాటిపె ఆసక్తి ఉన్నవారికి నగరంలో పలు విద్యా సంస్థలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కర్ణాటక సంగీతం, వయోలిన్, వీణ, మృదంగం, నాదస్వరం, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, సితార్, తబలా, వేణువు, డోలు, లలిత సంగీతం, పేరిణి నృత్యం, జానపద సంగీతం.. వంటివాటిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. భాగ్యనగరిలో ఆంధ్ర మహిళా సభ ఫైన్‌ఆర్ట్స్ కళాశాల, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభు త్వ సంగీత, నృత్య కళాశాలలు వంటివి ఆయా విభాగాల్లో సర్టిఫికెట్ కోర్సుల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వివిధ కోర్సులను అందిస్తున్నాయి.
 
 సంస్థలు, కోర్సులు..
 నగరంలో ఆయా కోర్సులను అందించే విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి.
     మాసాబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) ఇంటీరియర్ డిజైన్ కోర్సులను అందిస్తోంది.  
 వెబ్‌సైట్: www.jnafau.ac.in
     మాదాపూర్‌లోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ కేంద్రం.. సర్టిఫికెట్ ఇన్ న్యూట్రిషన్ అండ్ చైల్డ్‌కేర్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్; డిప్లొమా ఇన్ ఎర్లీచైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది.
     వెబ్‌సైట్: http://rchyderabad.ignou.ac.in/  
     రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం హోమ్‌సైన్స్‌లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీని అందిస్తోంది.
     వెబ్‌సైట్: www.angrau.ac.in  
     నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్).. ఫ్యాషన్ డిజైనింగ్, టెక్నాలజీలో అనేక కోర్సులను ఆఫర్ చేస్తోంది.
     వెబ్‌సైట్: www.nift.ac.in
     నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(ఎంఎస్‌ఎంఈ), అప్పెరల్ ట్రైనింగ్ అండ్ డిజైన్ సెంటర్- మాదాపూర్, గవర్నమెంట్ డొమెస్టిక్ సైన్స్ ట్రైనింగ్  కాలేజ్ - వెస్ట్ మారేడుపల్లి, సెట్విన్ వంటివి అనేక కోర్సులను అందిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో కూడా ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
 
 ఆత్మవిశ్వాసం.. ఆర్థిక ఆలంబన

 ‘‘గతంతో పోల్చితే ప్రస్తుతం కుటుంబ ఖర్చులు పెరిగాయి. పిల్లల చదువుకు అధిక భాగం వెచ్చించాల్సి వస్తోంది. దీంతో ఫురుషులతోపాటు మహిళలు కూడా పనిచేయాల్సి వస్తోంది. ఉద్యోగం చేసే మహిళలకు సొంతంగా ఉపాధి పొందాలనే ఆలోచన పెరుగుతోంది. దీంతో హోమ్‌సైన్స్, ప్లేస్కూల్ టీచర్ ట్రైనింగ్, అప్పెరల్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుడ్ మేకింగ్, యోగా, డ్యాన్స్, ఫిట్‌నెస్ వంటి అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. దీనివల్ల తమకిష్టమైన పని చేస్తున్నామనే ఆనందం, ఆత్మసంతప్తి లభిస్తాయి. హోమ్‌సైన్స్ కోర్సుల్లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్, హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్, అప్పెరల్ అండ్ టెక్స్‌టైల్స్, ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్, ఇంటీరియర్ డిజైన్ వంటి అంశాల్లో మూడేళ్లపాటు శిక్షణ ఉంటుంది. తమకు ఆసక్తి ఉన్న రంగా న్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు. లేదంటే.. తామే పదిమందికి ఉపాధి కల్పిం చేందుకు ప్లేస్కూల్స్, చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చు’’
 -ఎస్.నిర్మలాదేవి, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ డొమెస్టిక్ సైన్స్ ట్రైనింగ్ కాలేజీ, సికింద్రాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement