ప్లీజ్‌ డాడీ.. అమ్మను ఏం చేయొద్దు | House Wife Assassinated By Husband In Anantapur | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ డాడీ.. అమ్మను ఏం చేయొద్దు

Mar 26 2021 9:05 AM | Updated on Mar 27 2021 2:18 PM

House Wife Assassinated By Husband In Anantapur - Sakshi

అనంతపురం: జిల్లా కేంద్రంలో గురువారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వివాహితలు దారుణ హత్యకు గురయ్యారు. ఘటనలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అనంతపురం ఒకటి, రెండో పట్టణ సీఐలు ప్రతాప్‌రెడ్డి, జాకీర్‌ హుస్సేన్‌ తెలిపిన మేరకు...  

13 ఏళ్ల అనుబంధాన్ని మరచి..  
కనగానపల్లికి చెందిన చిక్కన్నయ్య, కర్నూలు జిల్లా నంచెర్లకు చెందిన కవితకు 2008లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి పదకొండేళ్ల సంతోష్, తొమ్మిదేళ్ల జాహ్నవి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ ప్రైవేట్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న చిక్కన్నయ్య... భార్యాపిల్లలతో కలిసి అనంతపురంలోని జీసస్‌ నగర్‌లో అద్దె ఇంటిలో నివాసముంటున్నాడు. పెళ్లైన పదకొండేళ్ల వరకూ వీరి దాంపత్యం ఎంతో అనోన్యంగా సాగింది. రెండేళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటూ వచ్చాయి. దంపతులు తరచూ ఘర్షణ పడుతూ వచ్చేవారు. 13 ఏళ్లుగా వారి మధ్య ఉన్న అనుబంధాలు బలహీనపడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఘర్షణ∙పడిన ప్రతిసారీ కవిత తన పుట్టింటికి వెళ్లేపోయేది. పెద్దలు జోక్యం చేసుకున్న తర్వాత తిరిగి కాపురానికి వచ్చేది.  

గొడవకు కారణమైన ఫోన్‌ కాల్స్‌ 
రెండేళ్లుగా కవితలో చోటు చేసుకున్న మార్పులు ఆమె పట్ల భర్త చిక్కన్నయ్యలో అనుమానాలను రేకెత్తించాయి. విధి నిర్వహణలో ఇంటి నుంచి బయటకు వచ్చిన అతను ఆమెకు ఫోన్‌ చేసిన ప్రతిసారీ బీజీబీజీ అంటూ సమాధానం రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాను ఇంటిలో లేని సమయంలో తన భార్య ఎవరితోనో గంటల తరబడి ఫోన్‌లో సంభాషిస్తోందని చిక్కన్నయ్య బలంగా నమ్మాడు. ఇదే విషయమై తరచూ భార్యతో ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 24న (బుధవారం) సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన చిక్కన్నయ్య మరోసారి తన భార్యతో ఘర్షణ పడ్డాడు.

భార్య నచ్చచెప్పినా అతను వినలేదు. రాత్రంతా అనుమానాలు అతన్ని స్థిరంగా ఉండనివ్వలేదు. గురువారం వేకువజామున 3 గంటలకు కవిత నిద్రలేచింది. ఆ సమయంలో మరోసారి దంపతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిద్రపోతున్న పిల్లలిద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. అప్పటికే సహనం కోల్పోయిన చిక్కన్నయ్య తన పంచను కవిత మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేస్తుండడం పిల్లలు గమనించారు.

‘డాడీ.. అమ్మను ఏం చేయొద్దు... ప్లీజ్‌ డాడీ అమ్మను వదిలేయ్‌ డాడీ’ అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడ్డారు. అయినా చిక్కన్నయ్యలో ఆవేశం తగ్గలేదు. కాసేపయ్యాక విగతజీవిగా పడున్న కవిత(30)ను చూసి, అమ్మ పడుకుందని పిల్లలను నమ్మబలికి, వారిని తీసుకుని వెళ్లిపోయాడు. ఉదయం 8 గంటల సమయంలో ఇంటి యజమానికి ఫోన్‌ చేసి దాన్ని చంపేశానని, తన బిడ్డలను తీసుకుని వెళ్తున్నట్లు చెప్పాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రెండో పట్టణ సీఐ జాకీర్‌ హుస్సేన్‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.   

తేలిపోయిన నమ్మకం  
తనకల్లుకు చెందిన రమేష్‌కు 13 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా మొలకలచెరువు సమీపంలోని దండువారిపల్లికి చెందిన రేణుకతో వివాహమైంది. వీరికి తొమ్మిదేళ్ల మనోజ్, ఎనిమిదేళ్ల లక్కీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో కొన్నేళ్ల క్రితం వీరు అనంతపురంలోని రాణి నగర్‌కు మకాం మార్చి పాతూరు మార్కెట్‌ ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రమేష్‌ తాగుడుకు బానిసయ్యాడు. భర్త తాగుడు మాన్పించేందుకు ఆమె చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా అతని మార్పు రాలేదు.


ఈ క్రమంలోనే నెలన్నరగా ఆమెకు రమేష్‌ దూరంగా ఉంటూ వచ్చాడు. దీనిని నగరంలోని ఖాజానగర్‌కు చెందిన కుమారస్వామి అనే యువకుడు అవకాశంగా మలుచుకున్నాడు. రేణుకతో చనువు పెంచుకుని ఆమెతో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఏం జరిగిందో ఏమో.. బుధవారం అర్ధరాత్రి రేణుక(28) తన ఇంటిలో అపస్మారక స్థితిలో పడి ఉండడంతో గుర్తించిన ఆమె అన్న రెడ్డప్ప వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో... కుమారస్వామి∙తన సోదరి గొంతు నులిమి హతమార్చాడంటూ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై సీఐ ప్రతాప్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చదవండి:
ఆస్తి ఇవ్వలేదని టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య

మనవడిపై ప్రేమ.. తాతకు జైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement