పిల్లలతో శిల్ప, పాతనాయక దంపతులు (ఫైల్) హత్యకు గురైన శిల్ప
గుడిబండ: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త ఉదంతమిది. గాఢ నిద్రలో ఉన్న భార్య తలపై బండరాయితో మోది అంతమొందించాడు. ఈ ఘటన గుడిబండ మండలం చిగతుర్పిలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకెళ్తే.. చిగతుర్పికి చెందిన పుట్టమ్మ, బడకలింగప్ప దంపతుల కుమార్తె శిల్ప (26)కు జంబులబండకు చెందిన చిన్నలింగప్ప కుమారుడు పాతనాయకతో ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమార్తె స్వాతి, నాలుగేళ్ల కుమారుడు ప్రవీణ్ ఉన్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే భార్య ప్రవర్తనపై భర్త అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఏదో ఒక సాకుతో భార్యతో గొడవపడేవాడు. రెండు రోజుల క్రితం అలాగే ఇద్దరూ వాదులాడుకున్నారు. అనంతరం పిల్లలతో కలిసి దంపతులు చిగతుర్పికి వచ్చారు.
అల్లుడు, కూతురు వచ్చారని పుట్టమ్మ శుక్రవారం విందు ఏర్పాటు చేసింది. అందరూ కలిసి భోజనం చేశారు. రాత్రి పదకొండు గంటల సమయంలో నిద్రపోతున్న భార్య శిల్ప తలపై పాతనాయక బండరాయితో మోది హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో భర్త అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో విలవిలలాడుతున్న శిల్పను కుటుంబ సభ్యులు బెంగళూరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే శిల్ప ప్రాణాలు కోల్పోయింది. హతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శరత్‌చంద్ర తెలిపారు. సంఘటన స్థలాన్ని సీఐ దేవేంద్రకుమార్ పరిశీలించారు.
స్టేషన్ నుంచి నిందితుడి పరార్
భార్యను చంపి పోలీసుల అదుపులో ఉన్న పాతనాయక శనివారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత భోజన సమయంలో పోలీసుల కళ్లుగప్పి స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. అర్ధరాత్రి వరకు గాలింపు చేపట్టినా ఎక్కడా అతడి జాడ దొరకలేదు.
Comments
Please login to add a commentAdd a comment