
ఐసెట్/ ఎడ్‌సెట్.. గెలుపు మార్గాలు
ఉన్నత విద్యాకోర్సులుగా విరాజిల్లుతున్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశించాలనుకునే వారు రాయాల్సిన పరీక్ష ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్)! గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించేందుకు అవసరమైన బీఈడీ కోర్సులో చేరేందుకు మార్గం ఎడ్‌సెట్! ఈ రెండు పరీక్షలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నోటిఫికేషన్లు జారీఅయ్యాయి. గతేడాది వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఈ పరీక్షలు ఇప్పుడు వేర్వేరుగా నిర్వహించనున్నారు. ఐసెట్, ఎడ్‌సెట్ పరీక్ష విధివిధానాలు.. విజయానికి మార్గాలు..
ఐసెట్
బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో మేనేజ్‌మెంట్ పీజీ పూర్తి చేసి కార్పొరేట్ కొలువు సొంతం చేసుకోవాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఐసెట్ రాసే వారి సంఖ్య దాదాపు లక్షన్నరకు పైగా ఉంటోంది. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షలో ఆంధ్రప్రదేశ్‌లోని 61,326, తెలంగాణ రాష్ట్రంలోని 58,453 సీట్లకు 1.42 లక్షల మంది పోటీ పడ్డారు. ఈ ఏడాది కొత్తగా రెండు రాష్ట్రాలు వేర్వేరుగా ఐసెట్ నిర్వహిస్తున్నాయి. అయితే, అదే నిష్పత్తిలో పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. పోటీ తీవ్రత దృష్ట్యా మంచి కాలేజీలో సీటు సాధించాలనుకునే విద్యార్థులు ఇప్పటినుంచే మంచి ర్యాంకు దిశగా కృషి చేయాలి. వాస్తవానికి అందుబాటులోని సీట్లు, ఉత్తీర్ణత శాతం పరిగణనలోకి తీసుకుంటే సీటు గ్యారెంటీ. కానీ మంచి కాలేజ్‌లో సీటు పొందాలంటే మెరుగైన ర్యాంకుతోనే సాధ్యం.
పరీక్ష స్వరూపంపై అవగాహన:
ఐసెట్ ఔత్సాహిక అభ్యర్థులు పరీక్ష స్వరూపంపై అవగాహన ఏర్పరచుకోవడంతో తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. ఐసెట్ మొత్తం మూడు విభాగాల్లో(అనలిటికల్ ఎబిలిటీ; మ్యాథమెటికల్ ఎబిలిటీ; కమ్యూనికేషన్ ఎబిలిటీ) 200 ప్రశ్నలకు ఉంటుంది. ఒక్కో విభాగంలో మళ్లీ ఉప-విభాగాలు ఉంటాయి.
అనలిటికల్ ఎబిలిటీ
ఈ విభాగంలో రెండు ఉప విభాగాలు.. డేటా సఫిషియెన్సీ; ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటిలో డేటా సఫిషియన్సీలో రాణించాలంటే అర్థమెటిక్ అంశాల్లో పట్టు సాధించడం చాలా అవసరం. ‘స్టేట్‌మెంట్ బేస్డ్’ ప్రశ్నలు ఎదురయ్యే ఈ విభాగంలో.. ఇచ్చిన స్టేట్‌మెంట్లలో సరైనదేదో గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం సునిశిత పరిశీలన, గణితంపై ప్రాథమిక అవగాహన అవసరం. రీజనింగ్ ఆధారిత ప్రశ్నలు ఎదురయ్యే ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగంలోని సిరీస్, బ్లడ్ రిలేషన్, ఎరేంజ్‌మెంట్, కోడింగ్, డీ-కోడింగ్ వంటి అంశాలపై పట్టు సాధించాలి.
మ్యాథమెటికల్ ఎబిలిటీ
మ్యాథమెటికల్ ఎబిలిటీలో మొత్తం మూడు ఉప విభాగాలు.. అర్థమెటికల్ ఎబిలిటీ; అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ; స్టాటిస్టికల్ ఎబిలిటీ ఉంటాయి. గణితం ప్రాథమిక అంశాలపై పట్టు సాధించడం ద్వారా ఈ మూడు ఉప విభాగాల్లో రాణించొచ్చు. ఇందుకోసం ఆరు నుంచి పదో తరగతి వరకూ మ్యాథమెటిక్స్ పుస్తకాలు సమగ్రంగా అధ్యయనం చేయాలి. స్టాటిస్టికల్ ఎబిలిటీలోని ప్రాబబిలిటీ, ఇనీక్వాలిటీస్ కోసం ఇంటర్మీడియెట్ స్థాయి గణిత పుస్తకంలోని అంశాల అధ్యయనం కలిసొస్తుంది. అర్థమెటిక్ విభాగంలో పర్సంటేజీ, లాభనష్టాలు, జామెట్రీ, మెన్సురేషన్, సింపుల్ ఈక్వేషన్స్‌పై పట్టు మేలు చేస్తుంది. అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ కోసం గ్రాఫ్స్, సూత్రాలను అధ్యయనం చేయడంతోపాటు ప్రాక్టీస్ చేయడం మంచిది.
కమ్యూనికేషన్ ఎబిలిటీ
విశ్లేషణ నైపుణ్యం, తులనాత్మక పరిశీలన సామర్థ్యం కలిగిన అభ్యర్థులు తేలిగ్గా సమాధానాలు ఇవ్వగల విభాగం.. కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఇందులో నాలుగు ఉప విభాగాలు.. వొకాబ్యులరీ; బిజినెస్ అండ్ కమ్యూనికేషన్ టెర్మినాలజీ; ఫంక్షనల్ గ్రామర్; రీడింగ్ కాంప్రహెన్షన్. బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టుతో వొకాబ్యులరీ ప్రశ్నలను సులభంగా సాధించొచ్చు. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉండే రీడింగ్ కాంప్రహెన్షన్‌లో ఏదైనా ఒక అంశానికి సంబంధించి వ్యాసాలు చదివి, సారాంశాన్ని గ్రహించే నేర్పు సొంతం చేసుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని వ్యాసాలు; ఇంగ్లిష్ స్టోరీ బుక్స్ చదవడం ఉపయుక్తం. ఫంక్షనల్ గ్రామర్‌లో అధిక శాతం ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సినానిమ్స్, యాంటానిమ్స్, కొశ్చన్ ట్యాగ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం ఆరు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ గ్రామర్ బుక్స్ చదవడం మేలు. కంప్యూటర్ అండ్ బిజినెస్ టెర్మినాలజీలో పది ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ సమకాలీనంగా వ్యాపార, వాణిజ్య రంగాల్లో వినియోగించే పదజాలానికి సంబంధించి ఉంటాయి. ఇందుకోసం బిజినెస్ పత్రికలు, కంప్యూటర్ మ్యాగజైన్లు చదవడం లాభిస్తుంది.
ప్రాక్టీస్ ఫర్ బెస్ట్ ర్యాంకు
ఐసెట్‌లో నిర్దేశించిన విభాగాలు, ప్రశ్నల తీరును విశ్లేషిస్తే ప్రాక్టీస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అర్థమవుతోంది. కాన్సెప్ట్స్‌ను అవగాహన చేసుకుంటూ ఒక అంశాన్ని భిన్న కోణాల్లో అధ్యయనం చేయడం ఎంతో అవసరం. ముఖ్యంగా మ్యాథమెటికల్, అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ విభాగాల్లో కాన్సెప్ట్స్ అవగాహనతోనే పట్టుసాధించొచ్చు. పదో తరగతి తర్వాత మ్యాథ్స్ సబ్జెక్ట్‌కు దూరంగా ఉన్న విద్యార్థులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతి రోజు కనీసం పది గంటలు ప్రిపరేషన్ సాగించేలా టైమ్‌ప్లాన్ రూపొందించుకోవాలి. అందులో ప్రాక్టీస్ ఆధారిత విభాగాలకు కొంత ఎక్కువ సమయం కేటాయించాలి.
ఇంజనీరింగ్ విద్యార్థులకు దీటుగా
ఇటీవల కాలంలో ఐసెట్, క్యాట్ వంటి మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్ టెస్ట్‌లలో ఇంజనీరింగ్ విద్యార్థుల హవా కనిపిస్తోంది. దీనికి కారణం ఆయా ఎంట్రన్స్‌లలో పేర్కొన్న సిలబస్‌లోని అంశాలు ఇంజనీరింగ్ విద్యార్థుల అకడమిక్స్‌తో అనుసంధానంగా ఉండటమే. దీన్ని చూసి చాలా మంది నాన్-ఇంజనీరింగ్, నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు ఆందోళన చెందుతుంటారు. వాస్తవానికి ప్రతిఒక్కరూ సులువుగా చేయగలిగే విభాగాలు.. రీజనింగ్, డేటా సిఫిషియన్సీ; వొకాబ్యులరీ; బిజినెస్ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ; రీడింగ్ కాంప్రహెన్షన్; ఫంక్షనల్ గ్రామర్..
రిఫరెన్స్ బుక్స్
అర్థమెటిక్: ఆర్.ఎస్.అగర్వాల్, త్రిష్ణ అర్థమెటిక్
ప్యూర్ మ్యాథ్స్: పదో తరగతి లెక్కల పుస్తకం
రీజనింగ్: ఆర్.ఎస్.అగర్వాల్, సిజ్వాలి
ఇంగ్లిష్: న్యూస్ పేపర్లు, స్టోరీ బుక్స్, వీటితోపాటు మార్కెట్లో లభించే మోడల్ ప్రశ్న పత్రాలు
ఐసెట్.. ఏపీ, టీఎస్ ఒకే తీరు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఐసెట్‌ను వేర్వేరుగా నిర్వహిస్తున్నప్పటికీ పరీక్ష స్వరూపం, అర్హతలకు సంబంధించి ఒకే తీరుగా ఉన్నాయి. వివరాలు..
అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంసీఏ ఔత్సాహికులు ఇంటర్మీడియెట్ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివుండాలి.
పరీక్ష స్వరూపం
సెక్షన్-ఎ అనలిటికల్ ఎబిలిటీ ప్రశ్నలు మార్కులు
ఉప విభాగం-1 డేటా సఫిషియన్సీ 20 20
ఉప విభాగం-2 ప్రాబ్లమ్ సాల్వింగ్ 55 55
సెక్షన్-బి మ్యాథమెటికల్ ఎబిలిటీ
ఉప విభాగం అర్థమెటికల్ ఎబిలిటీ 35 35
ఉప విభాగం అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ 30 30
ఉప విభాగం స్టాటిస్టికల్ ఎబిలిటీ 10 10
సెక్షన్-సి కమ్యూనికేషన్ ఎబిలిటీ
ఉప విభాగం వొకాబ్యులరీ 10 10
ఉప విభాగం బిజినెస్ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ 10 10
ఉప విభాగం ఫంక్షనల్ గ్రామర్ 15 15
ఉప విభాగం రీడింగ్ కాంప్రహెన్షన్ 15 15
ముఖ్య తేదీలు
ఏపీ ఐసెట్
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 13 ఏప్రిల్, 2015
రూ.500 అపరాధ రుసుముతో: 20 ఏప్రిల్, 2015
ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: 21 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: ఏప్రిల్ 30, 2015
పరీక్ష తేదీ: మే 16, 2015
వివరాలకు వెబ్‌సైట్: apicet15.org
టీఎస్ ఐసెట్
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 9 ఏప్రిల్, 2015
రూ.500 అపరాధ రుసుముతో: 16 ఏప్రిల్, 2015
ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: 17 ఏప్రిల్ నుంచి 25 ఏప్రిల్ వరకు
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: ఏప్రిల్ 30, 2015
పరీక్ష తేదీ: మే 22, 2015
వివరాలకు వెబ్‌సైట్: www.tsicet.org
16 రీజనల్ సెంటర్లు
ఏపీ ఐసెట్ నిర్వహణకు ప్రాథమికంగా 16 రీజనల్ సెంటర్లను నిర్ణయించాం. పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే ఆ ప్రక్రియ పూర్తి చేసుకుంటే పొరపాట్లు తలెత్తకుండా ఉంటాయి. దరఖాస్తుల సంఖ్య పరంగా గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పోటీ ఉంటుందని భావిస్తున్నాం. అయితే మంచి కళాశాలలో సీటు సాధించే దిశగా అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
- ప్రొఫెసర్ సి.హెచ్.వి. రామచంద్రమూర్తి, ఏపీఐసెట్ కన్వీనర్
ఉపాధ్యాయ విద్యకు ఎడ్‌సెట్
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనే ఔత్సాహికులకు సరైన కోర్సు బీఈడీ. టీచర్‌గా రాణించేందుకు అవసరమైన నెపుణ్యాలు అందించే ఈ బీఈడీలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష ఎడ్‌సెట్. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 6న; ఆంధ్రప్రదేశ్‌లో మే 28న ఎడ్‌సెట్ జరుగనుంది.
బీఈడీ రెండేళ్లు
బీఈడీకి సంబంధించి ముఖ్యమైన మార్పు.. ఈ కోర్సు వ్యవధి రెండేళ్లకు పెరగడం. గతేడాది వరకు సంవత్సరం వ్యవధిగా ఉన్న బీఈడీని కేంద్రప్రభుత్వ తాజా నిర్ణయంతో 2015-16 నుంచి రెండేళ్లకు పెరిగింది. దాంతో గతంతో పోల్చితే ఎడ్‌సెట్‌కు దరఖాస్తుల సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. అది పదిశాతం మేరకే ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన ఎడ్‌సెట్-2014కు 1,65 781 మంది హాజరయ్యారు. అందులో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఓయూ రీజియన్ నుంచే అత్యధికంగా 1,11,742 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో గత సంవత్సరం 13 జిల్లాల నుంచి 54,039 మంది హాజరయ్యారు. ఒకవేళ బీఈడీ రెండేళ్లుగా మారిన కారణంగా ఔత్సాహికుల సంఖ్య తగ్గినా.. పోటీ లక్షకుపైగానే ఉంటుందంటున్నారు. దాంతో ఎడ్‌సెట్ అభ్యర్థులు
మంచి ర్యాంకు కోసం ఇప్పటినుంచే కృషి చేయాలి.
ఎడ్‌సెట్ తీరు ఇలా
ఎడ్‌సెట్ మూడు పార్ట్‌లు.. పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సిగా ఉంటుంది. ఇందులో పార్ట్-ఎలో జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-25 మార్కులు; పార్ట్-బిలో జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు-15 మార్కులు; టీచింగ్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు-10 మార్కు లు.. ఎడ్‌సెట్ అభ్యర్థులందరూ రాయాల్సిన విభాగాలు. ఇక పార్ట్-సిలో అభ్యర్థులు తమ ఆప్షనల్ సబ్జెక్ట్‌కు అనుగుణంగా పేపర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్ట్-సిలో అయిదు సబ్జెక్ట్ పేపర్స్ ఉన్నాయి. అవి.. మ్యాథమెటిక్స్: 100 ప్రశ్నలు (100 మార్కులు); ఫిజికల్ సెన్సైస్: 100 ప్రశ్నలు. ఇందులో ఫిజిక్స్ నుంచి 50; కెమిస్ట్రీ నుంచి 50 ప్రశ్నలుంటాయి. మార్కులు- 100; బయలాజికల్ సెన్సైస్: 100 ప్రశ్నలు. ఇందులో బోటనీ నుంచి 50; జువాలజీ నుంచి 50 ప్రశ్నలు చొప్పున ఉంటాయి. మార్కులు- 100; అలాగే సోషల్ స్టడీస్- 100 ప్రశ్నలు. ఇందులో జాగ్రఫీ నుంచి 35; హిస్టరీ నుంచి 30; సివిక్స్ నుంచి 15; ఎకనామిక్స్ నుంచి 20 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు-100; ఇంగ్లిష్: 100 ప్రశ్నలు-100 మార్కులు.
కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్
ఎడ్‌సెట్‌లో మెరుగైన ర్యాంకు సొంతం చేసుకోవాలంటే కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉన్నప్పటికీ ఒక ప్రశ్నకు సంబంధించి నేపథ్యం నుంచి తాజా పరిణామాల వరకు అన్ని కోణాల్లో అవగాహన ఉంటేనే సరైన సమాధానం ఇచ్చే వీలుంటుంది. ముఖ్యంగా ఫార్ములాలు; థీరమ్స్ ఆధారంగా ఉండే మ్యాథమెటిక్స్; ఫిజిక్స్; కెమిస్ట్రీల్లో అప్లికేషన్ ఓరియెంటేషన్ ఎంతో అవసరం. అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉండే ఇంగ్లిష్ విభాగంలో మంచి మార్కుల కోసం బేసిక్ గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ కోసం స్టాండర్డ్ న్యూస్ పేపర్స్‌లోని వార్తలను, విశ్లేషణలను చదవాలి. జనరల్ నాలెడ్జ్ కోసం కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు, ద్వైపాక్షిక ఒప్పందాలు; అవార్డులు-రివార్డ్‌లు వంటి వాటిపై దృష్టి సారించాలి. ఎడ్‌సెట్ అభ్యర్థులు పరిశీలన నైపుణ్యం, విశ్లేషణ సామర్థ్యంతో దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగే విభాగం టీచింగ్ ఆప్టిట్యూడ్. ఇందులో అభ్యర్థిలోని టీచింగ్
దృక్పథాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. కాస్త సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఈ విభాగంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వొచ్చు.
సోషల్ స్పెషల్‌గా
సోషల్ స్టడీస్ విభాగంలో సాధారణంగా పోటీ ఎక్కువగా ఉంటుంది. గతేడాది మొత్తం 1,65,781 మంది అభ్యర్థుల్లో సోషల్ ఔత్సాహికుల సంఖ్య దాదాపు 73, 763. కాబట్టి పోటీ తీవ్రంగా ఉన్న దృష్ట్యా సోషల్ విభాగంలో అడిగే హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ అన్నిటికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా ఆయా విభాగాలకు సంబంధించి తాజా పరిణామాల సమాచార సేకరణ కూడా ఎంతో అవసరం. ఇటీవల కాలంలో పర్యావరణ కాలుష్యం, ప్రకృతి విపత్తులు వం టివి చర్చనీయాంశాలుగా మారాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రఫీలో వాటి నేపథ్యాల అధ్యయనం ముఖ్యం. అదేవిధంగా సివిక్స్, ఎకనామిక్స్‌కు సంబంధించి తాజాగా రాజకీయ, ఆర్థిక,వాణిజ్య పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.
రిఫరెన్స్ బుక్స్
మెథడాలజీ సబ్జెక్స్‌కు సంబంధించి ఆరు నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు అకడమిక్ పుస్తకాలు క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
ఇంగ్లిష్ కోసం ప్రామాణిక గ్రామర్ బుక్‌ను, ఇంగ్లిష్ దిన పత్రికలను చదవాలి.
ఇంగ్లిష్ మెథడాలజీ కోసం బ్యాచిలర్ డిగ్రీ స్థాయి ఇంగ్లిష్ అకడమిక్ పుస్తకాలతోపాటు ఇంగ్లిష్ సాహిత్యంలో పేరు గడించిన రచనలు చదవడం లాభిస్తుంది.
ఏపీ, టీఎస్ ఎడ్‌సెట్ సమాచారం
అర్హతలు
మ్యాథమెటిక్స్ మెథడాలజీ: మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా బీఏ/బీఎస్సీ/బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు, ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ చదివిన బీసీఏ ఉత్తీర్ణులు.
ఫిజికల్ సెన్సైస్: ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా అల్లైడ్ మెటీరియల్ సైన్స్ ఒక సబ్జెక్ట్‌గా బీఎస్సీ/బీటెక్/బీఈ ఉత్తీర్ణులు/ ఇంటర్మీడియెట్‌లో ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివిన బీసీఏ ఉత్తీర్ణులు.
బయలాజికల్ సెన్సైస్: బోటనీ, జువాలజీ లేదా అనుబంధ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్‌లు గ్రూప్ సబ్జెక్ట్‌లుగా బీఎస్సీ/బీఎస్సీ(హోం సైన్స్) ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్‌లో బయలాజికల్ సైన్స్ చదివిన బీసీఏ ఉత్తీర్ణులు.
సోషల్ స్టడీస్: బీఏ/ బీకాం/ బీబీఎం ఉత్తీర్ణులు.
ఇంగ్లిష్: బీఏ స్పెషల్ ఇంగ్లిష్ / బీఏ లిటరేచర్/ ఎంఏ ఇంగ్లిష్ ఉత్తీర్ణులు.
ఆయా కోర్సుల చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ ఎడ్‌సెట్ ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 23 ఏప్రిల్, 2015
రూ. 500 అపరాధ రుసుముతో: 30 ఏప్రిల్, 2015
హాల్‌టికెట్ డౌన్‌లోడ్: మే 15, 2015
పరీక్ష తేదీ: మే 28, 2015
వివరాలకు వెబ్‌సైట్: www.ape-dcet.org
టీఎస్ ఎడ్‌సెట్ ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 7 మే 2015
రూ. 500 అపరాధ రుసుముతో: 14 మే 2015
హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 31 మే, 2015
పరీక్ష తేదీ: 6 జూన్, 2015
వివరాలకు వెబ్‌సైట్: www.tsedcet.org
పోటీ తగ్గే అవకాశాలు లేవు
బీఈడీ కోర్సు వ్యవధిని రెండేళ్లకు పెంచడంతో ఆ కోర్సు ఔత్సాహికుల సంఖ్య తగ్గుతుందని, ఈ కారణంగా ఎడ్‌సెట్ పోటీ తగ్గుందని భావించొద్దు. ఔత్సాహిక అభ్యర్థులకు డిగ్రీ వార్షిక పరీక్షల తర్వాత కూడా ఆశించదగిన స్థాయిలో సమయం అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని ప్రిపరేషన్‌పరంగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా కొత్త కళాశాలలు, సీట్ల సంఖ్యకు సంబంధించి ఎంట్రన్స్ తేదీ నాటికి స్పష్టత లభిస్తుంది.
- ప్రొఫెసర్ పి. ప్రసాద్, టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్
అకడమిక్ పుస్తకాలు, కాంటెంపరరీ అవగాహనతో
ఎడ్‌సెట్ ఔత్సాహికులు అకడమిక్ పుస్తకాల్లోని అంశాల్లో పరిపూర్ణత సాధిస్తే ఎడ్‌సెట్ లక్ష్యం సులభంగా ఛేదించొచ్చు. అంతేకాకుండా సోషల్ స్టడీస్ మెథడాలజీ అభ్యర్థులు అకడమిక్ అంశాలను సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ ప్రణాళిక అనుసరిస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది.
- నందీశ్వర్ కుమార్, ఎడ్‌సెట్ -2014 (సోషల్) టాపర్
బీఈ, బీటెక్ విద్యార్థులు కూడా బీఈడీకి అర్హులే
ఉపాధ్యాయ విద్య కోర్సుల నియంత్రణ సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్
ఎడ్యుకేషన్ తీసుకున్న తాజా నిర్ణయంతో బీఈ, బీటెక్ విద్యార్థులు కూడా
బీఈడీ కోర్సు చేసేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అర్హత లభించనుంది.
బీఈడీలోని మ్యాథమెటిక్స్, ఫిజికల్ సెన్సైస్ మెథడాలజీ సబ్జెక్ట్‌లకు మాత్రమే అర్హులు. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ స్థాయిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివుండాలి. అదే విధంగా బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే
ఎడ్‌సెట్‌లో సంబంధిత సబ్జెక్ట్‌లనే ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవాలి.
ఎడ్యూన్యూస్
127 కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సు డిగ్రీ...
స్కిల్ డెవలప్‌మెంట్ పరంగా పలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వీటికి సంబంధించి యూజీసీ ప్రత్యేక కోర్సుల రూపకల్పనకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ డిగ్రీ పేరుతో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో వత్తి విద్య కోర్సులు అందించేందుకు దేశ వ్యాప్తంగా 127 కళాశాలలకు అనుమతులు జారీ చేసింది. బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ డిగ్రీ పథకం పరిధిలో 2014-15 విద్యా సంవత్సరం నుంచి 2018-19 విద్యా సంవత్సరం వ్యవధిలో అయిదు వందల ఇన్‌స్టిట్యూట్‌లో ఈ కోర్సు ను ప్రవేశపెట్టి దాదాపు 5 లక్షల మందికి నైపుణ్యాలు అందించడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకం పేరుతో ఏర్పాటు చేసిన ఓ్చఠటజ్చి కేంద్రాల ద్వారా వత్తి విద్య విభాగంలో సర్టిఫికెట్ నుంచి రీసెర్చ్ వరకు అందించనున్న కోర్సులకు; కమ్యూనిటీ కాలేజ్ స్కీం లకు అదనంగా బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ డిగ్రీ స్కీంను అమలు చేస్తోంది.