ఇండియన్ హిస్టరీ : కాంపిటీటివ్ గైడెన్స్ | indian history : Competitive Guidance | Sakshi
Sakshi News home page

ఇండియన్ హిస్టరీ : కాంపిటీటివ్ గైడెన్స్

Published Sat, Oct 12 2013 10:59 PM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

ఇండియన్  హిస్టరీ : కాంపిటీటివ్ గైడెన్స్

ఇండియన్ హిస్టరీ : కాంపిటీటివ్ గైడెన్స్

 తొలి మధ్యయుగం
 పాలవంశం
 దేవపాల: ఇతడిని పాలరాజులందరిలోకి గొప్పవాడిగా పరిగణిస్తారు. ఇతడు ఒరిస్సా, అస్సాంలను జయించడమే కాకుండా ప్రతీహార మిహిరభోజుడి దాడులను విజయవంతంగా తిప్పికొట్టాడు. దేవపాలుడు నలందలో ఇండోనేషియా రాజు బలపుత్ర దేవుడు నిర్మించిన బౌద్ధ విహారానికి ఐదు గ్రామాలను దానంగా ఇచ్చాడు. ఇతడి ఆస్థాన బౌద్ధ పండితుడు వజ్రదత్తుడు లోకేశ్వర శతకం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ కాలంలో భారతదేశాన్ని సందర్శించిన అరబ్ యాత్రికుడు సులేమాన్ పాలరాజ్యాన్ని రూహ్‌మి అని పేర్కొన్నాడు.
 
 నారాయణపాల: దేవపాలుడి తర్వాత రాజ్యానికి వచ్చిన రాజుల్లో ఇతడు ముఖ్యమైనవాడు. ఇతడిని రాష్ర్టకూట రాజు అమోఘ వర్షుడు ఓడించాడు. నారాయణ పాలుడు  మాంఘీర్ ప్రాంతంలో ఒక గ్రామాన్ని శైవాలయానికి దానంగా ఇచ్చాడు.
 
 మహీపాల 1: నారాయణపాలుడి అనంతరం పాలించిన పాలరాజుల్లో ముఖ్యమైనవాడు మొదటి మహీపాలుడు. చోళరాజు మొదటి రాజేంద్రుడు ఇతడి కాలంలోనే ఉత్తర భారతదేశంపై దండెత్తి మహీపాలుడిని ఓడించి గంగై కొండ అనే బిరుదును పొందాడు.
 
 మదనపాల: ఇతడు పాలవంశంలో చివరిరాజు. ఇతడి తర్వాత పాల రాజ్యాన్ని సేన వంశ రాజులు ఆక్రమించి సేన వంశ రాజ్యాన్ని స్థాపించారు.
 
 సేన వంశం:
 తొలి మధ్యయుగంలో తూర్పు భారతదేశాన్ని పాలించిన రెండు రాజవంశాల్లో ముఖ్యమైనది సేన వంశం. పాలవంశం పతనమైన తర్వాత సేన వంశ రాజులు బెంగాల్, బీహార్ ప్రాంతాలను పాలించారు. లక్నౌతిని రాజధానిగా చేసుకొని వీరు దాదాపు 100 సంవత్సరాలపాటు పాలించారు. వీరు తాము కర్ణాటక బ్రాహ్మణులమని పేర్కొన్నారు.
 
 సామంత సేన: సేన వంశస్థాపకుడు. ఇతడు బ్రహ్మక్షత్రియుడిగా పేరుగాంచాడు.
 విజయ సేన: మొత్తం బెంగాల్‌ను జయించడం ద్వారా ఇతడు సేన రాజ్య వాస్తవ స్థాపకునిగా ఖ్యాతిగాంచాడు. ఇతడు అస్సాం, నేపాల్ మొదలైన ప్రాంతాలను జయించాడు. విజయసేనుడు తన విజయాలను గురించి తెలియజేస్తూ దేవపార ప్రశస్తిని జారీ చేశాడు. ఈ శాసనాన్ని రచించిన కవి ధోయి. విజయసేనుడు విజయపురి, విక్రమపుర అనే రెండు రాజధానులను నిర్మించి అక్కడి నుంచి పరిపాలించాడు. గహద్వాల జయచంద్రుడి ఆస్థానకవి శ్రీహర్షుడు విజయసేనుడి గొప్పతనాన్ని, విజయాలను గురించి తెలుపుతూ విజయ ప్రశస్తి అనే గ్రంథాన్ని రచించాడు.
 
 బల్లాల సేన: ఇతడు స్వయంగా నాలుగు గ్రంథాలను రచించాడు. ఇతడి గ్రంథాల్లో ముఖ్యమైనవి దాన సాగర, అద్భుత సాగర.
 
 లక్ష్మణ సేన: ఇతడు 60 ఏళ్ల వయస్సులో రాజ్యానికి వచ్చాడు. ఇతడి పాలనకు రాజకీయ ప్రాధాన్యత లేకపోయినప్పటికీ సాహిత్యపరంగా ఇతడి పాలనాకాలం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇతడి ఆస్థానంలో ప్రముఖ వైష్ణవ కవి జయదేవుడు గీతగోవిందం అనే గ్రంథాన్ని రచించాడు. మరో కవి ధోయి పవన దూతం అనే గ్రంథాన్ని రాశాడు. గోవర్థనుడు అనే కవి ఆర్య సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. లక్ష్మణ సేనుడు తన తండ్రి బల్లాల సేనుడు ప్రారంభించిన అద్భుతసాగర గ్రంథాన్ని తానే స్వయంగా పూర్తి చేశాడు.
 లక్ష్మణ సేనుడి కాలంలో ఘోరీ మహ్మద్ సేనాని భక్తియార్ ఖిల్జీ బెంగాల్‌పై దాడి చేయగా, ఇతడు యుద్ధం చేయకుండా పారిపోయాడు. దీంతో సేన రాజ్యం ముస్లింల వశమైంది. ఈ సంఘటన గురించి మినహాజుద్దీన్ సిరాజ్ తన తబాకత్-ఇ-నాసిరి అనే గ్రంథంలో వివరించాడు. భక్తియార్ ఖిల్జీ కేవలం 18 మంది అశ్వికుల ద్వారా ఈ విజయం సాధించాడని తెలిపాడు.
 
 రాష్ర్టకూటులు:
 ఉత్తరాన వింధ్య పర్వతాలు, నర్మద నది నుంచి దక్షిణాన కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని సాధారణంగా దక్కన్ ప్రాంతంగా వ్యవహరిస్తారు. తొలి మధ్య యుగంలో ఈ ప్రాంతాన్ని రెండు రాజవంశాలు ప్రముఖంగా పాలించాయి. అందులో ఒకరు రాష్ర్టకూటులు. మొదట వీరు బాదామి చాళుక్యులకు సామంతులుగా ఉంటూ (రాష్ర్ట పాలకులుగా) పరిస్థితులు అనుకూలించిన వెంటనే స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. వీరి రాజధానులు ఎల్లోరా, మాన్యఖేట్. రాష్ట్రకూటులు సమకాలీన దక్షిణ భారతదేశ రాజులతో, ఉత్తర భారతదేశ పాలకులతో తరచూ యుద్ధాల్లో పాల్గొంటూ తమ రాజ్యాన్ని ఒక బలమైన రాజ్యంగా రూపొందించారు. ఉత్తర భారతదేశంలో ప్రతీహారులు, పాలరాజులు, దక్షిణ భారతదేశంలో వేంగీ చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు వీరి సమకాలీన రాజులు.
 
 దంతి దుర్గుడు: చివరి బాదామి చాళుక్యరాజు రెండో కీర్తివర్మను క్రీ.శ.753లో తొలగించి ఇతడు స్వతంత్య్ర రాష్ర్టకూట రాజ్యాన్ని స్థాపించాడు. తన రాజ్యానికి ఇరువైపులా ఉన్న అనేక ప్రాంతాలను ఆక్రమించాడు. ఇందుకు  గుర్తుగా హిరణ్య గర్భదాన యజ్ఞాన్ని నిర్వహించాడు. తన రాజధాని ఎల్లోరాలో దశావతార ఆలయాన్ని నిర్మించాడు.
 
 మొదటి కృష్ణుడు: బాదామి చాళుక్యులను అంతం చేసి పశ్చిమ గాంగులను తన సామంతులుగా చేసుకున్నాడు. ఇతడి కాలంలో వేంగీ చాళుక్యులపై తొలి దాడి యువరాజు గోవిందుడి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఇతడు రాజధాని ఎల్లోరాలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కైలాసనాథ గుహాలయాన్ని నిర్మించాడు.
 
 ధ్రువుడు: తన సోదరుడు రెండో గోవిందుడిని తొలగించి ఇతడు సింహాసనాన్ని ఆక్రమించాడు. కనౌజ్ కోసం జరిగిన త్రిరాజ్య యుద్ధాల్లో తలదూర్చిన మొదటి రాష్ర్టకూట రాజు ఇతడే. ప్రతీహార వత్సరాజును, పాలరాజు ధర్మపాలుడిని ఓడించాడు. వేంగీ, మైసూర్, కంచి రాజ్యాలపై దాడులు చేసి విజయం సాధించాడు.
 
 మూడో గోవిందుడు: ఇతడు కూడా పాలరాజు ధర్మపాలుడిని, ప్రతీహార రెండో నాగభటుడిని ఓడించాడు. దక్షిణ రాజ్యాల కూటమిపై కూడా విజయం సాధించాడు.
 
 మొదటి అమోఘవర్ష: ఇతడు 64 సంవత్సరాల సుదీర్ఘకాలంపాటు... క్రీ.శ. 814-878 వరకు పరిపాలించాడు. ఇతడి కాలంలో రాష్ర్ట కూటులు వేంగీని ఆక్రమించి 12 సంవత్సరాలపాటు దీన్ని పరిపాలించారు. అమోఘవర్షుడు యుద్ధాల కంటే లలిత కళలకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. ఇతడు స్వయంగా కవి. కవిరాజ అనే బిరుదును పొందాడు. కన్నడ భాషలో తొలి గ్రంథమైన కవిరాజమార్గను రచించాడు. ఇతడి ఆస్థానంలో ఉన్న పలువురు కవులు పలు గ్రంథాలను రచించారు. ఇతడి ఆస్థానంలోని ప్రముఖ కవులు... జనసేనుడు, మహావీరాచార్యుడు, శాక్తాయణుడు. రాష్ర్టకూట రాజుల్లో ఎక్కువ మంది శైవ, వైష్ణవ మతాలను ఆదరిస్తే ఇతడు జైన మతాన్ని ఆదరించాడు.
 
 రెండో కృష్ణుడు: ఇతడు కూడా తనతండ్రిలాగే జైన మతాన్ని ఆదరించాడు.
 మూడో ఇంద్రుడు: ఇతడి కాలంలోనే అరబ్ యాత్రికుడు అల్ మసూదీ భారతదేశాన్ని సందర్శించాడు. మూడో ఇంద్రుడిని భారతదేశంలోనే గొప్పరాజుగా వర్ణించాడు. మూడో ఇంద్రుడు ప్రతీహార మహీపాలుడిని ఓడించి కనౌజ్‌ను ధ్వంసం చేశాడు.
 
 నాలుగో గోవిందుడు: ఇతడి దుష్పరిపాలనకు వ్యతిరేకంగా నాయకులు, ప్రజలు తిరుగుబాటు చేయడంతో అధికారాన్ని కోల్పోయాడు.
 
 మూడో కృష్ణుడు: ఇతడు ఉత్తర, దక్షిణ భారతదేశంపై విజయవంతంగా దాడులను నిర్వహించాడు. ఇతడు చోళరాజ్యంపై దాడిచేసి కంచి, తంజావూర్‌లను ఆక్రమించాడు. క్రీ.శ.949లో తక్కోలం యుద్ధంలో మొదటి పరాంతక చోళుడిని ఓడించి తంజావూర్ కొండ అనే బిరుదు పొందాడు. చేర, పాండ్య రాజులను ఓడించాడు. ఈ విజయాలన్నింటికీ గుర్తుగా రామేశ్వరంలో విజయ స్తంభాన్ని వేయించాడు. అక్కడ కృష్ణేశ్వర, గండమార్తాండతీయ అనే దేవాలయాలను నిర్మించాడు. మూడో కృష్ణుడి నిరంతర యుద్ధాల వల్ల సమకాలీన పొరుగు రాజ్యాలన్నింటితో శత్రుత్వం ఏర్పడింది. ఇతడి కాలంలోనే హలాయుధుడు కవి రహస్యం అనే గ్రంథాన్ని రచించాడు.
 
 ఖొట్టిగ: ఇతడి కాలంలో పరమార రాజులు మాన్యఖేట్‌పై దాడిచేసి విధ్వంసం సృష్టించారు.
 రెండో కర్క: ఇతని పాలనాకాలంలో రాష్ర్టకూట సామంతుడు రెండో తైలపుడు క్రీ.శ.974-75లో ఇతడిని తొలగించి స్వతంత్ర కల్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు.
 
 కల్యాణి చాళుక్యులు:
 తొలి మధ్యయుగ భారతదేశ చరిత్రలో రాష్ర్టకూటుల తర్వాత దక్కన్‌ను పాలించిన మరో రాజవంశం కల్యాణి చాళుక్యులు. కర్ణాటకలోని కల్యాణి రాజధానిగా వీరు పాలించారు. కాబట్టి వీరిని కల్యాణి చాళుక్యులని, చాళుక్యుల తర్వాత పాలించారు కాబట్టి కడపటి చాళుక్యులు అని పిలుస్తారు.
 
 రెండో తైలపుడు: ఇతడు కల్యాణి చాళుక్య వంశ స్థాపకుడు. రాష్ర్టకూట మూడో కృష్ణుడికి సామంతుడిగా ఉంటూ చివరి రాష్ర్ట కూటరాజు రెండో కర్కను తొలగించి తన రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడు మాన్యఖేట్‌ను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. చోళరాజు ఉత్తమ చోళుడిపై దాడి చేయడం ద్వారా చోళ-చాళుక్య శత్రుత్వానికి నాంది పలికాడు. ఇతడి వారసుల కాలంలో చాళుక్యులు చోళులతో అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది.
 
 సత్యాశ్రయ: ఇతడి మరొక పేరు సొల్లిగ. ఇతడి కాలంలో మాన్యఖేట్‌పై రాజేంద్రచోళుడు దాడి చేశాడు.
 రెండో జయసింహ: వేంగీ వారసత్వ యుద్ధాల్లో తలదూర్చి ఇతడు ఏడో విజయాదిత్యుడికి మద్దతుగా తన సైన్యాన్ని పంపాడు. కానీ రాజేంద్రచోళుడి సహాయంతో వేంగీలో రాజరాజనరేంద్రుడు రాజ్యానికి వచ్చాడు.
 మొదటి సోమేశ్వరుడు: ఇతడు తన రాజధానిని మాన్యఖేట్ నుంచి కల్యాణికి మార్చాడు. కొప్పం యుద్ధంలో చోళ రాజాధిరాజును వధించాడు. పరమార భోజుడిని ఓడించి తన సామంతుడిగా చేసుకున్నాడు.
 ఆరో విక్రమాదిత్యుడు: తన సోదరుడు రెండో సోమేశ్వరుడిని వధించి ఇతడు క్రీ.శ.1076లో రాజ్యానికి వచ్చాడు. తాను రాజ్యానికి వచ్చిన సంవత్సరాన్ని పురస్కరించుకుని  చాళుక్య విక్రమ శకాన్ని ప్రారంభించాడు. కల్యాణి చాళుక్య రాజులందరిలోకి ఇతడు అత్యంత గొప్పవాడు. ఇతడి రాజ్యం నర్మద నుంచి రాయలసీమ వరకు విస్తరించింది.
 
  ఆరో విక్రమాదిత్యుడు తన సామంతులైన హోయసలలు, కాకతీయులు, యాదవులు, కాదంబులతో నిరంతరం యుద్ధాలు చేసి వారిని అణచివేశాడు. ఇతడి ఆస్థానంలోని ఇద్దరు ప్రముఖ కవులు బిల్హణుడు విక్రమాంక దేవచరితం, విజ్ఞానేశ్వరుడు మితాక్షర అనే గ్రంథాలను రచించారు.
 
 మూడో సోమేశ్వరుడు: ఇతడి కాలంలో ద్వార సముద్ర సామంతుడు విష్ణువర్థనుడు స్వతంత్ర హోయసల రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. సోమేశ్వరుడు పరిపాలన కంటే సాహిత్యంపై ఎక్కువ మక్కువ చూపాడు. ఇతడికి సర్వజ్ఞ అనే బిరుదు ఉంది. ఈ బిరుదుకు కారణం ఇతడు రచించిన అభిలషితార్థ చింతామణి అనే గ్రంథం.
 
 నాలుగో సోమేశ్వరుడు: మూడో సోమేశ్వరుడి  తర్వాత జగదేక మల్ల, మూడో తైలప అనే రాజులు పాలించారు. ఈ వంశంలో చివరివాడు నాలుగో సోమేశ్వరుడు. ఇతడి కాలంలో దేవగిరిని పాలిస్తున్న సామంత రాజు యాదవ బిల్లముడు ఇతడిని ఓడించి కల్యాణి చాళుక్య రాజ్యాన్ని అంతం చేశాడు. స్వతంత్ర యాదవ రాజ్యాన్ని స్థాపించాడు.
 
        మాదిరి ప్రశ్నలు
 
 1.    {పయాగ వద్ద త్రివేణి సంగమంలో మునిగి ఆత్మత్యాగం చేసిన చందేల రాజు?
 1) హర్ష     2) విద్యాధర
 3) ధంగ     4) యశోవర్మన్
 
 2.    భారతదేశంలో బౌద్ధ మతాన్ని ఆదరించిన చివరి రాజవంశం?
 1) పుష్యభూతి వంశం 2) కుషాణులు
 3) పాల వంశం       4) సేన వంశం
 
 3.    {పజల ద్వారా ఎన్నికైన రాజు?
 1) ధర్మపాల     2) గోపాల
 3) హర్షవర్థన     4) నన్నుక
 
 4.    ఓదంతపురి బౌద్ధ విహారాన్ని నిర్మించింది?
 1) అశోకుడు     2) అమోఘవర్షుడు
 3) గోపాలుడు     4) కనిష్కుడు
 
 5.    బౌద్ధ పండితుడు హరిభద్రుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
 1) ధర్మపాలుడు
 2) మొదటి నాగభటుడు
 3) గోపాలుడు    4) దేవపాలుడు
 
 6.    పాలరాజుల కాలంలో టిబెట్‌లో బౌద్ధమత ప్రచారం చేసిన బౌద్ధ భిక్షువులు?
 1) అతిష దీపాంకర, సంతరక్షిత
 2) ఆచార్య నాగార్జున 3) శ్రీవర, శ్రీజ్ఞాన     
 4) పద్మసాంభవ, పూజ్యపాద
 
 7. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కైలాసనాథ గుహాలయ నిర్మాత?
 1) నందివర్మ2) నరసింహవర్మ
 3)మొదటి కృష్ణుడు 4) మూడోగోవిందుడు
 
 8.    రాజ్య వ్యవహారాల్లో స్త్రీలు ప్రముఖ పాత్ర పోషించిన ఉత్తరభారతదేశ రాజవంశం?
 1) గహద్వాలులు 2) కాశ్మీర్ ఉత్పల వంశం
 3) చౌహాన్‌లు     4) చందేలులు
 
 9.    నలంద బౌద్ధ విహారాన్ని నిర్మించిన విదేశీ రాజు?
 1) సంగ్రామ విజయోత్తుంగ వర్మన్
 2) విజయబాహు      3) బలపుత్రదేవ
 4) మహేంద్రవర్మన్
 
 10.    శివుడికి 1000 ఆలయాలను నిర్మించిన రాజు?
 1) నారాయణ పాలుడు
 2) విగ్రహ పాలుడు
 3) గౌడ శశాంకుడు        4) హర్షుడు
 
 11.    చోళరాజు మొదటి రాజేంద్రుడి చేతిలో ఓడిపోయిన పాలరాజు?
 1) మహేంద్రపాలుడు
 2) మదనపాలుడు
 3) మొదటి మహీపాలుడు
 4) ధర్మపాలుడు
 
 12.    గీతగోవిందం గ్రంథకర్త జయదేవుడు ఎవరి ఆస్థాన కవి?
 1) బల్లాల సేన     2) లక్ష్మణ సేన
 3) విజయ సేన     4) సంగ్రామ సేన
 
 13.    సేన రాజ్యాన్ని అంతం చేసినవారు?
 1) కుతుబుద్దీన్ ఐబక్
 2) ఇల్‌టుల్‌మిష్
 3) భక్తియార్ ఖిల్జీ     4) అల్లావుద్దీన్ ఖిల్జీ
 
 14.    రాష్ర్టకూటుల రాజధాని?
 1) ఎల్లోరా     2) మాన్యఖేట్
 3) 1,2         4) వాతాపి
 
 15.    దంతిదుర్గుడు నిర్మించిన ఆలయం?
 1) ఎల్లోరా-దశావతారాలయం
 2) ఎల్లోరా- కైలాసనాథాలయం
 3) కంచి- కైలాసనాథాలయం
 4) మహాబలిపురం-తీర దేవాలయం
 
 సమాధానాలు
   1) 3      2) 3     3) 2     4) 3      5) 1
   6) 1     7) 3     8) 2     9) 3    10) 1
 11) 3    12) 2    13) 3    14) 3    15) 1
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement