భారత చరిత్రపై తాజాగా వచ్చిన ‘ఎ న్యూ హిస్టరీ ఆఫ్ ఇండియా’ ఆర్యన్ల మూలాల గురించి సరికొత్త వ్యాఖ్యానాన్ని అందజేసింది. ఆర్యన్లు భారత్ మూలాలను కలిగి ఉన్నారనే వాదనను ఖండిస్తూ, వీరు మధ్యాసియా నుంచి వచ్చినవారని చెబుతోంది. భారత ముస్లిం పాలకులందరూ మతమార్పిడి పట్ల ఉత్సుకత కలిగి ఉన్న ఉద్రేకపరులు అని విశ్వసించేందుకు ఎలాంటి ఆధారమూ లేదని తేల్చి చెబుతోంది. ఔరంగజేబును పవిత్ర ముస్లింగా పేర్కొంటూనే, అత్యధిక హిందువులను ఉన్నత పదవుల్లో నియమించడానికి అది అడ్డురాలేదని పేర్కొంటోంది. ప్రస్తుతం మెజారిటీ వర్గ ఆధిపత్యం దిశగా దేశం పయనిస్తోందని కూడా పుస్తకం అభిప్రాయపడింది.
ఎట్టకేలకు, 450 కోట్ల సంవత్సరాల క్రితం భౌగోళిక కాలం ప్రారంభమైన నాటి నుంచి నేటి నరేంద్ర మోదీ వరకు భారత చరిత్రను ఒకే సంపుటిలో వివరించిన పుస్తకం ఇప్పుడు వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీన్ని రాసిన ముగ్గురు రచయితలు– రుద్రాంక్షు ముఖర్జీ, శోభిత పంజా, టోబీ సిన్ క్లెయిర్– పుస్తకాన్ని ‘ఎ న్యూ హిస్టరీ ఆఫ్ ఇండియా’(భారతదేశ కొత్త చరిత్ర) అని చెబుతున్నారు. వారు ఈ విశేషణం ఎందుకు ఉపయోగించారో నాకైతే తెలీదు కానీ ఈ పుస్తకంలోని విషయాలు, చేసిన వ్యాఖ్యలు నన్ను కట్టిపడేశాయి. ఉదాహరణకు, ఇది మీకు తెలుసా? ‘‘హరప్పా నగరాల్లోని ఇళ్లు లేదా సమాధులు సంపద ఆడంబరానికి సంబంధించిన ఎలాంటి చిహ్నాలనూ ప్రదర్శించేవి కావు.... రాజమందిరం అని గుర్తించే ఎలాంటి భవనాలు లేవు... అలాగే ఈజిఫ్టు, చైనా, లేక మెసొపొటేమియాలో కనిపించినట్లు భారీ సమాధులు లేదా భవంతులు లేదా పాలకుల విగ్ర హాలు కనబడవు.’’ కాబట్టి ఇవి పాక్షిక సామ్యవాద గణతంత్రాలా?
ఆర్యుల గురించి రచయితలు ఇలా చెబుతారు. ‘‘మధ్య ఆసియా నుంచి ఉత్తర భారతానికి వలస వచ్చారు, స్థానిక ప్రజలతో కలిసి పోయారు, క్రమంగా వారిని తమలో కలుపుకున్నారు... మరోలా చెప్పాలంటే, ఆర్యన్లు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించలేదు, ద్రవిడి యన్లను దక్షిణాభిముఖంగా తరమలేదు.’’ ఇది కచ్చితంగా వివాదా స్పదమైంది. ఆర్యన్లు భారత్‌లోనే జన్మించినవాళ్లనే వాదనను ఇది ఖండిస్తుంది. అర్య సంస్కృతికి సంబంధించి, ఈ పుస్తక రచయితలకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. ‘‘ఇది తరచుగా భారతీయ సంప్ర దాయం, సమాజానికి సంబంధించినదిగా చూడబడుతోంది’’ అని నొక్కి చెబుతూనే, దాన్ని ‘‘కులీనమైనది, ఇంకా అనితరమైనది’’ అని వర్ణిస్తారు. ‘‘ఇది ఉత్తర భారత జనాభాలోని విస్తృతమైన వర్గాలను స్పష్టంగా విస్మరించింది. అలాగే భారత ద్వీపకల్పం (వింధ్యకు ఆవలి భూమి)లో నివసిస్తున్న మొత్తం జనాభాను దూరం పెట్టేసింది.’’ పైగా ‘‘కులవ్యవస్థ పునాదులు’’ రుగ్వేద కాలంలోనే ఉన్నాయని వీరు చెబుతున్నారు. ఇది మోహన్ భాగవత్ అభిప్రాయానికి కచ్చితంగా భిన్నమైనట్టిదే.
ఇప్పుడు నన్ను ఔరంగజేబు వైపు దృష్టి మళ్లించనివ్వండి. ఆయనపై ఈ పుస్తక రచయితల అభిప్రాయం ప్రస్తుత మన కేంద్ర ప్రభుత్వం కంటే ఆద్రే త్రూష్కే(అమెరికా చరిత్రకారిణి) అభిప్రాయాలకు దగ్గరగా ఉంటోంది. ‘‘ఔరంగజేబు పవిత్రమైన, పరి శుద్ధమైన ముస్లిం’’ అని వీరు పేర్కొంటున్నారు. ‘‘కానీ ఆయన మతో న్మాది కాదు’’ అంటున్నారు. దీనికి సాక్ష్యంగా, ఔరంగజేబు వ్యక్తిగత మత దృక్పథం అధిక సంఖ్యలో హిందూ మునసబుదార్లను నియమించకుండా ఆయనను అడ్డుకోలేదని వీరు పేర్కొంటున్నారు. ‘‘షాజహాన్ పాలనలో 1,000 జాత్(ర్యాంకు) లేదా అంతకు మించిన ర్యాంకు కలిగిన మునసబుదారుల్లో హిందువులు 22 శాతంగా ఉండేవారు. ఔరంగజేబు హయాంలో ఈ సంఖ్య 32 శాతానికి పెరిగింది.’’
విస్తృతమైన ముస్లిం పాలనలో అంటే 13వ శతాబ్ది నాటి సుల్తాన్‌ల నుంచి మొఘలుల అంతం వరకు చూస్తే ఈ కాలాన్ని 1,200 సంవత్సరాల బానిసత్వ సంవత్సరాలుగా పరిగణిస్తుంటారు. కానీ ఈ పుస్తకం మాత్రం దీనికి విరుద్ధమైన దృక్పథాన్ని కలిగి ఉంది. ‘‘ముస్లింలందరూ లేక ముస్లిం పాలకులందరూ మతమార్పిడి పట్ల ఉత్సుకత కలిగి ఉన్న ఇస్లామిక్ ఉద్రేకపరులు, ఉత్సాహవంతులు అని విశ్వసించేందుకు ఎలాంటి ఆధారమూ లేదు. ముస్లిం పాలకులు పెద్ద సంఖ్య లో ముస్లిమేతరులను ఉద్యోగాల్లో నియమించారు, వారికి అత్యున్నత పదవులను కూడా కట్టబెట్టారన్న వాస్తవాన్ని బట్టే ముస్లిం పాలకులందరూ మతమార్పిడి ఉన్మాదులు కారని తెలుస్తోంది’’ అని ఈ పుస్తకం తేల్చి చెబుతోంది.
ఇస్లాం పాలకుల హయాంలో కళలు, నిర్మాణ కళ, సంస్కృతి, మతం వంటి అంశాల్లో జరిగిన అభివృద్ధి గురించి పుస్తకం చర్చించింది. భక్తి సంప్రదాయం, సూఫీతత్వం మధ్య ఈ పుస్తకం గుర్తించిన లంకెలను చూసి నేను నిరుత్తరుడినయ్యాను. ‘‘ఇస్లాంతో సన్నిహిత సంబంధం, ఇస్లాం రాకముందు భారత్‌లో ఉనికిలో ఉన్న భక్తిరూపాల వల్ల భక్తి ఉద్యమం పురుడు పోసుకుందని చెబితే అది మరీ అతిశయోక్తి కాజాలదు... భక్తి మార్మిక సంప్రదాయాలు, సూఫిజం మధ్య గొప్ప అతివ్యాప్తి, కలయిక ఉంది.’’ ఈ పుస్తకంలోని అత్యంత ఆసక్తికరమైన విషయాలు కొన్ని దాని అపురూపమైన వివరాల్లో ఉన్నాయి. ‘‘వ్యభిచారులపై పన్ను విధించాలి’’ అని కౌటిల్యుడు విశ్వసించాడు. అది చాలా ప్రగతిశీలమైందని నేను చెబుతాను. ‘‘అశోకుడు తన సోదరులను చంపేశాడు. ఉన్న వారిలో మొత్తం 97 మందిని చంపేశాడు.’’ అంటే కళింగులకు చాలా కాలం క్రితమే ఆయన ఈ చంపడంలో మునిగివున్నాడు. అలాగే సిపా యిల తిరుగుబాటు ‘‘1857 మే 10న అపరాహ్న వేళ... దాదాపు 5 గంటల సమయంలో’’ మొదలైంది. అయితే అది మీరట్ కంటోన్మెంట్‌లో సాయంత్రం తేనీటికి కచ్చితంగా అంతరాయం కలిగించివుంటుంది.
మన ప్రస్తుత ప్రధానికి సంబంధించి ఈ పుస్తకం రెండు అభిప్రాయాలను కలిగివుంది.›‘‘నరేంద్ర మోదీ తాను చేసిన అన్ని వాగ్దానాలను ఇంకా నెరవేర్చలేదు’’ అని చెబుతూనే, ‘‘ఆయన ఒక కొత్త విశ్వాసాన్ని, ఉల్లాసాన్ని తీసుకొచ్చారు’’ అని పొడుపుగా జోడించింది. అయితే ఆ తర్వాత, ఈ పుస్తకం ‘‘మోదీ నాయకత్వంలో మెజారిటీ వర్గ ఆధిపత్యం, మైనారిటీల పట్ల తీవ్ర అసహనం, అసమ్మతి వైపుగా ఒక సహజ ప్రవృత్తి బలపడిపోయింది. ఈ మెజారిటీ వైపు మలుపు మన సమాజాన్ని వేర్పాటుతత్వంతో విభజించివేసింది’’ అని అభిప్రాయపడింది. చివరగా, ఈ పుస్తకం చివరి వాక్యాన్ని చాలా తెలివిగా, కాకపోతే జిత్తులమారితనంతో రూపొందించారు.‘‘మార్పు, మథనానికి సంబంధించిన లోతైన, ప్రాథమిక ప్రవాహాలు భారత్‌ను ఒక కొత్త విధి రాత (ట్రిస్ట్ విత్ డెస్టినీ) వైపు లాగుతున్నాయి.’’ ఒక విరుద్ధమైన ఫలితాన్ని ముందుచూపుతో సూచిస్తూ, నెహ్రూ సుప్రసిద్ధ వాక్యాన్ని ఇక్కడ చమత్కారంగా ఉపయోగించారు.
కరణ్ థాపర్ , వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment