కైలాశ్ సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతి | Malala, Satyarthi win Nobel Peace Prize | Sakshi
Sakshi News home page

కైలాశ్ సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతి

Published Thu, Oct 16 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

కైలాశ్ సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతి

కైలాశ్ సత్యార్థి, మలాలాకు నోబెల్ శాంతి బహుమతి

 అంతర్జాతీయం
 యాంగ్ చాంగ్‌లో జీవ వైవిధ్య సదస్సు
 దక్షిణ కొరియాలోని యాంగ్ చాంగ్ నగరంలో జీవ వైవిధ్య సదస్సు (కాప్ 12)ను అక్టోబర్ 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించారు.
 
 అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణంలో భారత్

 హవాయ్ దీవిలో నిర్మిస్తున్న ప్రపంచ అతిపెద్ద థర్టీ మీటర్ టెలిస్కోప్ (టీఎంటీ) నిర్మాణంలో జపాన్, అమెరికా, చైనా, కెనడాలతోపాటు భారత్ కూడా భాగం పంచుకుంటోంది. దీని నిర్మాణ ప్రారంభ కార్యక్రమం అక్టోబర్ 7న జరిగింది. హవాయి దీవిలో 4,012 మీటర్ల ఎత్తై మౌనా కీ అగ్ని పర్వతంపై 1.4 బిలియన్ డాలర్ల (రూ. 8,618 కోట్లు) వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ టెలిస్కోపు ద్వారా 500 కి.మీ దూరంలో ఉన్న నాణెం పరిమాణాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఈ టీఎంటీ నిర్మాణం 2022 నాటికి పూర్తవుతుంది.
 
 బెల్జియం ప్రధానిగా చార్లెస్ మైఖేల్
 బెల్జియమ్‌లో కొత్త సెంటర్- రైట్ గవర్నమెంట్ అక్టోబరు 11న బాధ్యతలు చేపట్టింది. ప్రధానమంత్రిగా చార్లెస్ మైఖేల్ (38) ప్రమాణ స్వీకారం చేశారు. 1841 నుంచి ప్రధాని పదవి చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కుడు చార్లెస్.
 
 ఆకలి సూచీలో భారత్‌కు 55వ స్థానం
 ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్‌ఐ)లో భారత్‌కు ఈ ఏడాది 55వ స్థానం దక్కింది. ఈ జాబితాలో గతేడాది 63వ స్థానంలో నిలిచిన భారత్.. ఏడాది కాలంలో 17.8 పాయింట్లు తగ్గించుకుని 55వ స్థానంలో నిలిచింది.
 
 జాతీయం
 మెట్రో పొలిస్ ప్రపంచ కాంగ్రెస్-2014
 హైదరాబాద్‌లో 11వ మెట్రో పొలిస్ ప్రపంచ కాంగ్రెస్ అక్టోబర్ 6 నుంచి 10 వరకు జరిగింది. సదస్సును అక్టోబర్ 7న గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అధికారికంగా ప్రారంభించారు. ఆసియా ఖండంలో ఈ సదస్సు జరగడ ం ఇదే తొలిసారి. ‘అందరి కోసం నగరాలు’ అనే ఇతి వృత్తం తో యువత, అందరికీ నివాసం, నగరాల్లో జీవనం అనే అంశాలపై సదస్సు సాగింది. తర్వాత సదస్సు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వేదికగా 2017లో జరగనుంది.
 
  అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు
 మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అక్టోబర్ 9న అంతర్జాతీయ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. భారత నిర్మాణంలో రాష్ట్రాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు.
 
 జాతీయ మానసిక ఆరోగ్య విధానం
 మొట్టమొదటి జాతీయ మానసిక ఆరోగ్య విధానా(నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ ఆఫ్ ఇండియా)న్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అక్టోబర్ 10న ప్రారంభించారు. మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, మానసిక అనారోగ్యం నుంచి కోలుకొనేలా చేయడం, ప్రతి వ్యక్తి తన పూర్తి జీవిత కాలం అనుభవించడం ఈ పాలసీ ఉద్దేశం.
 
 ఎంపీ ఆదర్శ గ్రామ పథకం ప్రారంభం
 లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ జయంతిని పురస్కరించుకొని ఎంపీ ఆదర్శగ్రామ పథకం (సాంసద్ ఆదర్శ గ్రామ్ యోజన-ఎస్‌ఏజీవై)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 11న న్యూఢిల్లీలో ప్రారంభించారు. పథకం కింద ప్రతీ ఎంపీ 2019 నాటికి తన నియోజకవర్గంలోని ఏవైనా మూడు గ్రామాల్లో సదుపాయాలను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది.
 
 పని చేయడానికి ప్రాధాన్యతనిచ్చే దేశాల్లో
 భారత్‌కు 18వ స్థానం
 పని చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దేశాల్లో భారత్ 18వ స్థానంలో నిలిచింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు అక్టోబరు 6న విడుదల చేసిన నివేదికలో అమెరికా మొదటి స్థానంలో, రెండు మూడు స్థానాల్లో బ్రిటన్, కెనడా ఉన్నాయి.
 
 వార్తల్లో వ్యక్తులు
 భారత్‌లో పర్యటించిన ఫేస్‌బుక్ సీఈఓ
 ఫేస్‌బుక్ సీఈఓ, సహ వ్యవస్థా పకుడు మార్క్ జుకర్‌బెర్గ్ తొలిసారి భారత్‌లో పర్యటించారు. అక్టోబర్ 9న ఢిల్లీలో జరిగిన ఇంటర్నెట్ ఆర్గ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీని కలిసి డిజిటల్ ఇండియా కార్యక్రమానికి సాయం అందిస్తామని తెలిపారు.
 
 యునిసెఫ్ రాయబారిగా అమీర్‌ఖాన్
 బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ అక్టోబర్ 9న ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) దక్షిణ ఆసియా రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పిల్లల పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తారు.
 
 హెచ్‌యూఎల్ డెరైక్టర్‌గా కల్పనా
 హిందూస్థాన్ యునీ లీవర్ (హెచ్‌యూఎల్) డెరైక్టర్‌గా కల్పనా మోర్పారియా అక్టోబర్ 9న బాధ్యతలు స్వీకరించారు. హెచ్‌యూఎల్‌కు డెరైక్టర్‌గా పగ్గాలు చేపట్టిన తొలి మహిళ ఈమె. ప్రస్తుతం జేపీ మోర్గాన్ ఇండియాలో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంతేకాకుండా రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బెన్నెట్ కోల్ మేన్ అండ్ కో తదితర సంస్థలలో ఆమె కీలక బాధ్యతలు నిర్విహిస్తున్నారు.
 
 క్రీడలు
 ఫోర్బ్స్ విలువైన క్రీడాకారుల్లో ధోనీ
 ఫోర్బ్స్ అక్టోబరు 8న విడుదల చేసిన ప్రపంచ విలువైన క్రీడాకారుల జాబితాలో భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ఐదో స్థానంలో నిలిచాడు. ధోనీ బ్రాండ్ విలువ 20 మిలియన్ డాలర్లు (రూ. 122 కోట్లు). అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్ లీ బ్రాన్ జేమ్స్ 37 మిలియన్ డాలర్లతో ఒకటో స్థానంలో ఉన్నాడు. టైగర్ ఉడ్స్ (గోల్ఫ్), రోజర్ ఫెదరర్ (టెన్నిస్) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
 
 ఫెదరర్‌కు షాంఘై మాస్టర్స్ టోర్నీ
 చైనాలో జరిగిన షాంఘై మాస్టర్స్ టోర్నీ విజేతగా రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) నిలిచాడు. అక్టోబర్ 12న జరిగిన ఫైనల్లో గైల్స్ సైమన్‌పై గెలిచాడు.
 
 జయరామ్‌కు డచ్ ఓపెన్ టైటిల్
 భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అజయ్ జయరామ్ డ చ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇది అతనికి తొలి గ్రాండ్ ప్రి టైటిల్. గతంలో చేతన్ ఆనంద్ (2009), ప్రకాశ్ పదుకొనె(1982)లు ఈ టైటిల్‌ను గెలుచుకున్నారు.
 
 అవార్డులుకైలాశ్ సత్యార్థి, మలాలాకు
 నోబెల్ శాంతి బహుమతిభారత్‌కు చెందిన కైలాశ్ సత్యార్థి, పాకిస్థాన్ బాలికమలాలా యూసుఫ్ జాయ్‌లు నోబెల్ శాంతి బహుమతికి సంయుక్తంగా ఎంపికయ్యారు.
 
 కైలాశ్ సత్యార్థి:
 వెట్టి చాకిరి నుంచి బాలల విముక్తికి 1980లో బచ్‌పన్ బచావో ఆందోళన్ సంస్థను స్థాపించి మూడు దశాబ్దాలుగా పిల్లల హక్కుల కోసం కైలాశ్ సత్యార్థి పోరాడుతున్నారు. ఇప్పటి వరకూ 80 వేల మంది పిల్లల్ని వెట్టి చాకిరి, అక్రమ రవాణా నుంచి విముక్తి కల్పించారు. ఆయన చేపట్టిన ‘గ్లోబల్ మార్చ్ అగెనైస్ట్ చైల్డ్ లేబర్’ ఉద్యమం పలు దేశాల్లో కొనసాగుతోంది. కైలాశ్ సత్యార్థి నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ఐదో భారతీయుడిగా నిలిచారు. భారత్‌లో జన్మించి, నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు. నోబెల్ అవార్డు పొందిన మిగతా నలుగురు భారతీయులు, రవీంద్రనాథ్ ఠాగూర్(1913, సాహిత్యం), సీవీ రామన్(1930, భౌతికశాస్త్రం), మదర్ థెరిసా (1978, శాంతి), అమర్త్యసేన్ (1998, ఆర్థికశాస్త్రం). ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ గెల్చుకున్న తొలి భారతీయుడు.
 
 మలాలా యూసుఫ్ జాయ్:
 పాకిస్థాన్‌కు చెందిన పదిహేడేళ్ల మలాలా యూసుఫ్ జాయ్ బాలికల విద్యకోసం ప్రాణాలకు తెగించి పోరాడింది. బాలికలు చదువుకోరాదంటూ తాలిబన్లు పాఠశాలల్ని పేల్చేశారు. తాలిబన్‌ల చర్యలకు ఎదురు తిరగడంతో 2012లో పాఠశాలకు వెళ్తున్న ఆమెపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన మలాలా లండన్‌లో చికిత్సపొందింది. ప్రస్తుతం ఆమె బర్మింగ్‌హమ్ స్కూల్లో చదువుకుంటోంది. ఐక్యరాజ్యసమితితో కలిసి విద్యా హక్కుల కోసం కృషి చేస్తోంది. అతి చిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తిగా మలాలా రికార్డులకెక్కింది.
 
 రసాయన శాస్త్రం
 ఆప్టికల్ మైక్రోస్కోపును నానో స్కోపుగా మార్చే పరిజ్ఞానాన్ని ఆవిష్కరించిన అమెరికా, జర్మనీ శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ లభించింది. అమెరికా శాస్త్రవేత్తలు ఎరిక్ బెట్జిగ్(54), విలియం మోర్నర్ (61), జర్మన్‌కు చెందిన స్టీఫెన్ హెల్ (51)్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ వరించింది.
 
 అర్థశాస్త్రం
 ఫ్రాన్స్ ఆర్థిక వేత్త జీన్ టిరోల్ (61) కు నోబెల్ బహుమతి దక్కింది. మార్కెట్ శక్తి సామర్థ్యాలు, నియంత్రణ గురించి ఆయన చేసిన పరిశోధనను గుర్తిస్తూ అకాడ మీ ఎంపిక చేసింది.
 
 సాహిత్యం
 నాజీ మూకల దురాగతాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఫ్రెంచ్ సాహితీవేత్త పాట్రిక్ మోడియానో (69)కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం దక్కింది.  మానవ జీవితాలను, నాజీల చేతుల్లో మారణ కాండకు గురైన యూదుల మనో భావాలు, వారు ఎదుర్కొన్న అవమానాలు, అస్థిత్వాన్ని కోల్పోవడం వంటివి ఆయన నవలల్లో ప్రధాన అంశాలు. మోడియానో ఫ్రెంచిలో 40కు పైగా నవలలు రాశారు. వాటిలో మిస్సింగ్ పర్సన్ నవలకు 1978లో ప్రతిష్ఠాత్మక ప్రిక్స్‌గాన్ కోర్టు అవార్డు లభించింది. ఆయన నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీతల్లో 11వ ఫ్రెంచ్ రచయిత.
 
 మైఖేల్ బ్లూమ్ బర్గ్‌కు బ్రిటన్ గౌరవ నైట్‌హుడ్
 న్యూయార్క్ మాజీ మేయర్, సంఘ సేవకుడు మైఖేల్ బ్లూమ్‌బర్గ్‌కు అక్టోబర్ 6న బ్రిటన్ గౌరవ నైట్‌హుడ్‌ను అందించింది.
 
 శివథాను పిళ్లైకి లాల్ బహ దూర్ శాస్త్రి అవార్డు
 బ్రహ్మోస్ క్షిపణి పితామహుడు ఎ.శివథాను పిళ్లైకి 15వ లాల్‌బహదూర్ శాస్త్రి అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో అక్టోబర్ 7న అందజేశారు. అగ్ని, పృథ్వి, నాగ్, ఆకాశ్ క్షిపణుల రూపకల్పనలో పిళ్లై పాత్ర ఎంతో ఉంది.
 
 అనూప్ జైన్‌కు ‘వెయిస్‌లిట్జ్ గ్లోబల్ సిటిజన్’ అవార్డు
 ప్రతిష్టాత్మక ‘వెయిస్‌లిట్జ్ గ్లోబల్ సిటి జన్ అవార్డుకు అనూప్ జైన్ ఎంపిక య్యాడు. పారిశుధ్య వసతులు కల్పనలో కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. అవార్డుతోపాటు లక్ష డాలర్ల నగదును ఆయన అందుకున్నాడు. 2011 లో అనూప్ జైన్ బీహార్‌లో హుమనుర్ పవర్(హెచ్‌పీ) అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి పారిశుధ్య కార్యక్రమాలు  చేపడుతున్నాడు.
 
 రాష్ట్రీయం
 ఆర్థిక పరిస్థితిలో హైదరాబాద్‌కు ఏఏ రేటింగ్
 దేశంలో ఆరో పెద్ద నగరంగా పేరొందిన హైదరాబాద్ ఆర్థిక పరిస్థితిలోనూ బలమైందిగా రేటింగ్ సాధించింది. దేశ వ్యాప్తం గా పది నగరాలు ఏఏ (అఅ) రేటింగ్‌లో ఉండగా దక్షిణ భారతం నుంచి ఒక్క హైదరాబాద్ మాత్రమే ఉండటం విశేషం. జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆయా నగరాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఒక్కో నగరానికి ఏఏఏ (అఅఅ) నుంచి సీ(ఇ) వరకు రేటింగ్ ఇస్తుంది. ఏఏఏ రేటింగ్ ఏ నగరానికీ దక్కలేదు. ఏఏ రేటింగ్‌లో హైదరాబాద్‌తోపాటు గ్రేటర్ ముంబై, నవీ ముంబై, నాసిక్, సూరత్, పుణే, న్యూఢిల్లీ, ఢిల్లీ, పింప్రి-చించ్వాడ్, థానే ఉన్నాయి.
 
 హుదూద్ పెను తుపాను
 హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది. అక్టోబర్ 12న విశాఖపట్నం సమీపంలో తీరం దాటిన హుదూద్ పెను తుపాను.. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులతో ఈ సముద్ర తీర నగరంలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించింది. రవాణా, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. విశాఖపట్నంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి తుపాను తాకిడికి గురయ్యాయి. ఈ తుపాన్‌కు హుదూద్ అనే పేరును ఒమన్ సూచించింది. హుదూద్ అనేది ఇజ్రాయిల్ జాతీయ పక్షి. ఈ పేరును ఒమన్ దేశం సూచించింది. ఇది ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాల్లో కనిపిస్తుంది.
 
 సుద్దాలకు ‘కొమురం భీం’
 జాతీయ పురస్కారం
 2014 కొమురం భీం జాతీయ పురస్కారానికి ప్రముఖ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ ఎంపికయ్యారు. కొమురం భీం స్మారక ఉత్సవ పరిషత్, ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ సమితి, భారత్ కల్చరల్ అకాడమీ, ఓం సాయి తేజ ఆర్ట్స్ సంయుక్తంగా ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నాయి. దీనికింద రూ.50,116 నగదుతోపాటు, ప్రశంసాపత్రం అందజేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement