విద్యార్థుల భావి జీవితానికి ‘నవోదయ'ం
గ్రామీణ విద్యార్థులకు కూడా మెరుగైన విద్యనందించి, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. మన దేశంలో మొత్తం 595 జవహర్ నవోదయ విద్యాలయాలున్నాయి. మన రాష్ర్టంలో ఉన్న 24 నవోదయా పాఠశాలల్లో 1920 సీట్లు ఉన్నాయి. వీటిల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రతి ఏటా ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో విజయం సాధించి ప్రవేశం పొందిన విద్యార్థులకు 12వ తరగతి వరకు విద్య, వసతి, భోజనం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (జేన్‌వీఎస్‌టీ)-2014 పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్లాన్‌పై ఫోకస్...
జాతీయ విద్యా విధానం(1986) ప్రకారం గ్రామీణ ప్రాంత విద్యార్థులను సైతం పట్టణ ప్రాంత విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. నేడు తల్లిదండ్రులకు విద్య పెను భారంగా మారింది. నర్సరీలు, ప్లేస్కూల్స్‌లో ఫీజులు వేలల్లోనే. ఇంటర్నేషనల్ స్కూల్స్‌ల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవోదయ విద్యాలయాలు విద్యార్థులకు వరమని చెప్పొచ్చు. వీటిల్లో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు గురుకుల విధానంలో బాలబాలికలకు విద్యనందిస్తారు. ఈ నవోదయ విద్యాలయాలను నిర్వహించడానికి ప్రత్యేకంగా స్వత ంత్ర ప్రతిపత్తి కలిగిన జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఉంది. జిల్లాకు ఒకటి చొప్పున, కొన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా మరికొన్ని నవోదయ విద్యాలయాలున్నాయి.
ప్రవేశం ఇలా:
నవోదయ విద్యాలయాల్లో మొదట ఆరో తరగతిలోకి మాత్రమే ప్రవేశం లభిస్తోంది. అది కూడా ఒక్కో విద్యాలయానికి 80 మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. ఒకసారి ప్రవేశం పొందిన విద్యార్థులు 12వ తరగతి వరకు విద్యనభ్యసించొచ్చు. ఎనిమిదో తరగతి వరకు విద్యార్థి మాతృభాషలో బోధన చేస్తారు. పదో తరగతి, 12వ తరగతి పరీక్షలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకే షన్ (సీబీఎస్‌ఈ) సిలబస్‌తో రాయాలి.
అర్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. ఏ జిల్లాలో నవోదయ స్కూల్ ఉందో.. ఆ జిల్లాకు మాత్రమే అర్హులవుతారు.
మే 1, 2001 కంటే ముందు, ఏప్రిల్ 30, 2005 తర్వాత జన్మించి ఉండకూడదు.
సీట్లు:
ప్రతి జిల్లాలో కనీసం 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు.
గ్రామీణ కోటాలో, అర్బన్ కోటాలో సీట్లు పొందాలంటే సంబంధిన ప్రాంతంలో ఉన్న పాఠశాలలో మూడు, నాలుగు, ఐదు తరగతులు చదివుండాలి.
రిజర్వేషన్స్: ప్రతి నవోదయ పాఠశాలలో మొత్తం సీట్లలో 15 శాతం సీట్లు ఎస్సీలకు, 7.5 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయిస్తారు. 1/3 వంతు సీట్లు బాలికలకు ఉంటాయి. మూడు శాతం సీట్లను శారీరక వికలాంగులతో భర్తీ చేస్తారు.
పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధి ఉండే పరీక్షలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. విద్యార్థి ఏ మీడియంలో ఐదో తరగతి చదువుతున్నాడో అదే మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది.
విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 50 60 ని.
అర్థమెటిక్ టెస్ట్ 25 25 30 ని.
లాంగ్వేజ్ టెస్ట్ 25 25 30 ని.
మొత్తం 100 100 2 గం.
దరఖాస్తు ఇలా: దరఖాస్తుతోపాటు ప్రాస్పెక్టస్‌ను బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్,జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ నుంచి పొందొచ్చు. లేదా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2013
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 8, 2014
వివరాలకు: www.navodaya.nic.in
అన్నీ ఉచితమే
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ ఉచిత విద్య, వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వైద్య సదుపాయాలు కూడా ఉచితంగా అందిస్తారు. కో ఎడ్యుకేషన్ విధానంలో, పూర్తిగా గురుకుల పద్ధతిలో బోధన ఉంటుంది. బాలబాలికలకు వేరు వేరుగా హాస్టల్ వసతి ఉంటుంది. ఇక్కడి నవోదయా లో మొత్తం 45 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. 12వ తరగతి వరకు ఉచితంగా విద్య అభ్యసించవచ్చు.
-కె.దామోదర్ రెడ్డి, ప్రిన్సిపాల్,
జవహర్ నవోదయా, గచ్చిబౌలి, హైదరాబాద్