రాజ్యాంగంలో ప్రస్తావించని రిట్?
ప్రకరణ 32 – రిట్లు – పరిధి – పరిమితులు
ప్రాథమిక హక్కుల పరిరక్షణకు జారీ చేసే ప్రత్యేక ఆదేశాలను న్యాయశాస్త్ర పరిభాషలో రిట్లు(writs)అంటారు. వీటిని జారీచేసే పద్ధతిని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. నిబంధన–32 ప్రకారం వీటిని జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు, నిబంధన–226 ప్రకారం రాష్ట్ర హైకోర్టులకు కల్పించారు. పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ఈ అధికారాన్ని జిల్లా న్యాయస్థానాలకు కూడా కల్పించొచ్చు. కానీ, ఇప్పటివరకు పార్లమెంటు ఇలాంటి చట్టాలను రూపొందించలేదు. అందువల్ల సుప్రీంకోర్టు, హైకోర్టులకు మాత్రమే రిట్లు జారీచేసే అధికారం ఉంది. అయితే రిట్ల జారీలో సుప్రీం కోర్టు, హైకోర్టుల మధ్య వ్యత్యాసాలున్నాయి.
ప్రత్యేక వివరణ: ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీంకోర్టుకు ప్రత్యేక, ప్రధాన, ప్రాథమిక విచారణ పరిధి ఉంటుంది. అందుకే సుప్రీంకోర్టును ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త అంటారు.
ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఉమ్మడి పరిధి ఉంటుంది. అంటే పౌరులు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రకరణ–32 ప్రకారం నేరుగా సుప్రీంకోర్టును లేదా ప్రకరణ–226 ప్రకారం హైకోర్టును ఆశ్రయించొచ్చు.
పౌరులు హైకోర్టు ద్వారా తగిన రక్షణ, ఉపశమనం లభిస్తుందని భావిస్తే మొదట హైకోర్టును ఆశ్రయించాలని కనుభాయ్ బ్రహ్మభట్ V/టస్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.
వివిధ రిట్లు– అర్థం– పరిధి– ప్రాముఖ్యత
హెబియస్ కార్పస్ (బందీ ప్రత్యక్ష అధిలేఖ): ఈ పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. ఇది అతి పురాతన రిట్. హెబియస్ అంటే Have అని, కార్పస్ అంటేBody అని అర్థం. అంటే ఒక వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరుపర్చడం. నిబంధన 19 నుంచి 22 వరకు పొందుపర్చిన వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు ఈ రిట్‌ను జారీ చేస్తారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప న్యాయస్థానంలో హాజరుపర్చకపోతే, ఈ రిట్ దాఖలు చేస్తే వెంటనే ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపర్చాలని కోర్టు ఆదేశిస్తుంది.
ఈ రిట్ ప్రధాన ఉద్దేశం వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ, చట్ట వ్యతిరేకంగా ఏ వ్యక్తినీ నిర్బంధించకుండా, శిక్షించకుండా కాపాడటం. ఈ రిట్‌ను ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు కూడా జారీ చేయొచ్చు.
మూడో వ్యక్తి కూడా (Third person) ఇందులో జోక్యం చేసుకొనే హక్కు (Locus standi) ఉంటుంది. బాధితుల తరఫున సామాజిక స్పృహ ఉన్న సంస్థ లేదా వ్యక్తి ఈ రిట్ దాఖలు చేయొచ్చు. అందుకే దీన్ని ఉదారమైన రిట్ అంటారు. అలాగే వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం అని కూడా అంటారు.
మినహాయింపులు: పార్లమెంటు స్వాధికారాలకు భంగం కలిగించిన కారణంగా వ్యక్తిని నిర్బంధించినప్పుడు, కోర్టు ద్వారా నేరారోపణ రుజువై, ఖైదీగా శిక్షను అనుభవిస్తున్నప్పుడు ఇది వర్తించదు.
మాండమస్ (పరమాదేశ అధిలేఖ): భాషాపరంగా మాండమస్ అంటే ‘ఆదేశం’ అని అర్థం. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసే అత్యున్నత ఆదేశంగా దీన్ని చెప్పవచ్చు. ప్రభుత్వాధికారి లేదా సంస్థ తన చట్టబద్ధ విధులను నిర్వర్తించనప్పుడు ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఆ విధులను నిర్వర్తించాలని న్యాయస్థానం ఈ రిట్‌ను జారీ చేస్తుంది. దీన్ని పబ్లిక్, క్వాజి పబ్లిక్, జ్యుడీషియల్, క్వాజి జ్యుడీషియల్ సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయొచ్చు.
మినహాయింపులు:
రాష్ట్రపతి, గవర్నర్లకు ఈ రిట్ వర్తించదు.
ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలకు వ్యతిరేకంగా ఈ రిట్‌ను జారీ చేయడానికి వీల్లేదు.
దీన్ని అంతిమ ప్రత్యామ్నాయంగా మాత్రమే జారీచేస్తారు. అంటే పాలనపరంగా ఉన్న ప్రత్యామ్నాయాల ద్వారా పౌరులు న్యాయాన్ని పొందలేనప్పుడు ఈ రిట్ ద్వారా ఉపశమనం పొందొచ్చు. అందువల్ల ఈ రిట్ జారీ కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
అధికారుల తప్పనిసరి విధులకే ఈ రిట్ వర్తిస్తుంది. సంబంధిత అధికారి విచక్షణాపూర్వక విధులకు ఇది వర్తించదు.
ప్రొహిబిషన్ (నిషేధం): భాషాపరంగా ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అని అర్థం. ఏదైనా దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ తన పరిధిని అతిక్రమించి కేసును విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తదుపరి ఆదేశాల వరకు నిలిపివేయాలని కోర్టు ఆదేశిస్తుంది. దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే ఈ రిట్ ముఖ్య ఉద్దేశం. ఇది న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. పాలనా, చట్టపరమైన సంస్థలకు వర్తించదు.
సెర్షియోరరి (ఉన్నత న్యాయస్థాన పరిశీలనాధికారం): భాషాపరంగా సెర్షియోరరి అంటే ‘సుపీరియర్’ లేదా ‘టు బి సర్టిఫైడ్’ లేదా ‘బ్రింగ్ ద రికార్డ్స్’ అని అర్థం. ఏదైనా దిగువ కోర్టు తన పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు చెప్పినప్పుడు, ఆ తీర్పును రద్దుచేసి, కేసును పైస్థాయి కోర్టుకు బదిలీ చేయాలని ఇచ్చే ఆదేశమే సెర్షియోరరి. ఈ రిట్ ఉద్దేశం కూడా దిగువ న్యాయస్థానాలు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే.
ప్రైవేటు, శాసన సంస్థలకు వ్యతిరేకంగా దీన్ని జారీ చేసే వీల్లేదు. అయితే ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్న పాలనా సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్–లీగల్ యాక్షన్ V/టయూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ప్రొహిబిషన్, సెర్షియోరరి మధ్య తేడాలు: దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నియంత్రించడమే ఈ రెండు రిట్ల ముఖ్య ఉద్దేశం. అయితే ప్రక్రియలో తేడా ఉంది. కేసు ప్రారంభ దశలో ఉంటే ప్రొహిబిషన్ రిట్, తీర్పు వెలువడిన తర్వాత సెర్షియోరరి రిట్ జారీ చేస్తారు.
సెర్షియోరరి రిట్ దిగువ కోర్టులను నియంత్రించడమే కాకుండా అవి చేసిన తప్పిదాలను కూడా సవరిస్తుంది. ప్రొహిబిషన్ రిట్ కేవలం నిలుపుదల చేస్తుంది.
కోవారంటో (అధికార పృచ్ఛ): భాషాపరంగా దీన్ని ‘బై వాట్ వారంట్’ అంటారు. అంటే.. ఏ అధికారం ద్వారా? అని ప్రశ్నించడం. ప్రజా సంబంధ పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించినా లేదా ప్రజా పదవులను దుర్వినియోగపర్చినా, పదవిలో ఉన్న వ్యక్తి తాను ఆ పదవిలో కొనసాగడానికి చట్టబద్ధంగా ఉన్న అధికారాన్ని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి. చట్టబద్ధత లేకపోతే ఆ పదవి నుంచి వెంటనే తప్పుకోవాలని ఆదేశిస్తాయి. ప్రజా పదవుల దుర్వినియోగాన్ని అరికట్టడం ఈ రిట్ ప్రధాన ఉద్దేశం.
ప్రజా పదవి అంటే చట్టం ద్వారా ఏర్పాటైన స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థలో పదవి. ఉదా: ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు మొదలైనవారు.
ఈ రిట్‌కు సంబంధించి బాధితులు మాత్రమే న్యాయస్థానాలను ఆశ్రయించాలనే నియమం లేదు. ప్రజా పదవులను దుర్వినియోగం నుంచి కాపాడాలనే సామాజిక స్పృహ ఉన్న ఏ పౌరుడైనా కోర్టును ఆశ్రయించవచ్చు. మూడో వ్యక్తి కూడా ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది.
ఇన్‌జంక్షన్ (నిలుపుదల ఆదేశం): రాజ్యాంగంలో ఈ రిట్ గురించిన ప్రస్తావన లేదు. కేవలం సివిల్ వివాదాల్లో యథాతథా స్థితిని కొనసాగించడానికి దీన్ని జారీ చేస్తారు. భర్తీ చేయడానికి వీల్లేని నష్టాన్ని అరికట్టేందుకు ఇన్‌జంక్షన్‌ను జారీ చేస్తారు. కాబట్టి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు, ఈ రిట్‌కు సంబంధం లేదు.
ప్రాథమిక హక్కులు – ఇతర నిబంధనలు
ప్రకరణ–33ను అనుసరించి కింద పేర్కొన్న వర్గాలకు ప్రాథమిక హక్కులు వర్తించే విషయంలో పార్లమెంటు చట్టం ద్వారా కొన్ని పరిమితులను విధించవచ్చు.
ఎ) సైనిక, పారా మిలటరీ దళాలు
బి) పోలీసులు, ఇతర రక్షణపరమైన విధులను నిర్వర్తిస్తున్న సంస్థలు, అధికారుల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించవచ్చు.
సి) గూఢచార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు
డి) అత్యవసర సర్వీసులైన టెలీకమ్యూనికేషన్లు, ఇతర బ్యూరోల్లో పనిచేసే ఉద్యోగులు.
ప్రకరణ34–సైనిక చట్టం (Marshal Law) – ప్రాథమిక హక్కులపై పరిమితులు: దేశంలో ఏదైనా ప్రాంతంలో సైనిక చట్టం ప్రకటించినప్పుడు ఆ సమయంలో సైనిక బలగాలు తీసుకొన్న చర్యలకు, తద్వారా జరిగిన నష్టాలు, పరిణామాలకు వారిని బాధ్యులను చేయడానికి వీల్లేదు. పార్లమెంటు ఒక చట్టం ద్వారా వారి చర్యలకు రక్షణ కల్పిస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీల్లేదు.
ప్రకరణ–34, 35కు మధ్య తేడా: ప్రకరణ–34లో ప్రస్తావించిన అంశాలు కొన్ని వర్గాల ఉద్యోగులు, వారి హక్కులపై పరిమితులు అయితే ప్రకరణ–35లో ప్రస్తావించిన అంశాలు ప్రత్యేక ప్రాంతాల్లో ప్రాథమిక హక్కులకు సంబంధించినవి. అందువల్ల ఒకటి వర్గానికి, మరొకటి ప్రాంతానికి సంబంధించినవి. ఉదా: 1958లో రూపొందించిన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (అటఝ్ఛఛీ ఊౌటఛ్ఛిటSp్ఛఛిజ్చీ∙్కౌఠ్ఛీటటఅఛ్టి అఊ్కఅ). దీన్ని పలు పర్యాయాలు సవరించి అసోం, మణిపూర్ కల్లోలిత ప్రాంతాల్లో ప్రయోగించారు. అలాగే 1983లో పంజాబ్, ఛండీగఢ్‌లో కూడా ఉపయోగించారు. శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు వైఫల్యం చెందినప్పుడు ఈ చట్టం ద్వారా సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
ప్రకరణ–35 చట్టబద్ధత, శిక్షలు: మూడో భాగంలో పేర్కొన్న కొన్ని నిబంధనల అమలుకు చట్టబద్ధత కల్పించడం, శిక్షలు నిర్ణయించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర శాసనసభలకు ఉండదు. ప్రాథమిక హక్కుల అమలుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి లేదా ప్రక్రియ ఉండాలనే ఉద్దేశంతో ఈ అధికారాన్ని పార్లమెంటుకు మాత్రమే ఇచ్చారు. ఉదా: ప్రకరణ 16(3)– రిజర్వేషన్లు, అమలు, ప్రకరణ 32(3) ప్రకారం రిట్లు జారీ చేసే అధికారాన్ని న్యాయస్థానాలకు సంక్రమింపజేయడం, ప్రకరణ–33 ప్రకారం సాయుధ బలగాల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం, ప్రకరణ–34 ప్రకారం సైనిక పాలన మొదలైన అంశాలపై పార్లమెంటుకు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అలాగే, ఈ భాగంలో పేర్కొన్న నేరాలకు (ఉదా: ప్రకరణ–17 (అస్పృశ్యత), 23 (దోపిడీ), 24 (బాలకార్మిక వ్యవస్థ) తదితర శిక్షలు నిర్ణయించే అధికారం పార్లమెంటుకే ఉంటుంది.