సైన్స్‌లో ప్రావీణ్యానికి ప్రోత్సాహం.. కేవీపీవై | Students on Basic Sciences | Sakshi
Sakshi News home page

సైన్స్‌లో ప్రావీణ్యానికి ప్రోత్సాహం.. కేవీపీవై

Published Wed, May 20 2015 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

Students on Basic Sciences

 బేసిక్ సెన్సైస్ వైపు విద్యార్థులను ఆకర్షించి.. సైన్స్‌లో పరిశోధనలపై చిన్న వయసులోనే  ఆసక్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం.. కేవీపీవై. సైన్స్ రంగంలో కెరీర్ దిశగా ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం.. దేశంలో సైన్స్ పరిశోధకుల సంఖ్యను పెంచడం.. కేవీపీవై ముఖ్య ఉద్దేశం. బ్యాచిలర్ డిగ్రీ నుంచి పీజీ వరకు ఆయా సైన్స్ కోర్సుల విద్యార్థులకు అందించే కేవీపీవై స్కాలర్‌షిప్-2015 నోటిఫికేషన్ వె లువడింది. ఎంపికైన విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో నెలకు రూ. 5 వేలు, పీజీ స్థాయిలో నెలకు రూ. 7 వేల ఫెలోషిప్‌తోపాటు ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి.
 
 అర్హతలు
 ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ వంటి సుపరిచితమైన సైన్స్ సబ్జెక్టుల నుంచి.. హ్యూమన్ బయాలజీ, జెనెటెక్స్ వంటి స్పెషలైజ్డ్ కోర్సుల వరకు; బ్యాచిలర్ డిగ్రీ నుంచి, ఇంటిగ్రేటెడ్ పీజీ వరకు సైన్స్ కోర్సులను అభ్యసించే విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్‌షిప్ రూపంలో చేయూతనందించే పథకం.. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన(కేవీపీవై). ప్రస్తుతం సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ ప్రథమ,ద్వితీయ సంవత్సరంలో, డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులు కేవీపీవై-2015కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ పథకంలో ప్రస్తుతం ఎస్‌ఏ, ఎస్‌ఎక్స్, ఎస్‌బీ పేరిట మూడు విభాగాలుగా స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. ఇందుకోసం ప్రతి విభాగానికి ప్రత్యేక అర్హత నిబంధనలు నిర్దేశించారు.
 
 స్ట్రీమ్ ఎస్‌ఏ
 ప్రస్తుత విద్యా సంవత్సరం 2015-16లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం/పదకొండో తరగతిలో చేరిన విద్యార్థులు ఈ స్ట్రీమ్ పరిధిలోకి వస్తారు. అయితే పదో తరగతి బోర్డు పరీక్షల్లో మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌లలో సగటున 80 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కేవీపీవై నిర్వహించే రాత పరీక్షకు అర్హులు. స్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ విద్యార్థులకు 70శాతం మార్కులు రావాలి. ఈ స్ట్రీమ్ ద్వారా ఎంపికైన విద్యార్థులు 2017-18 లో బేసిక్ సైన్స్ కోర్సుల్లో(బీఎస్సీ/బీఎస్/బీ.స్టాట్/బి. మ్యాథ్/ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంఎస్) చేరితేనే ఫెలోషిప్ అందుతుంది. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం/10+2లో సైన్స్ సబ్జెక్టుల్లో సగటున 60 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ విద్యార్థులకు 50 శాతం మార్కులు రావాలి. ఎంపికైన విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో ఉన్న ఏడాది కాల వ్యవధిలో సమ్మర్ క్యాంపులకు ఆహ్వానిస్తారు. ఖర్చులు కేవీపీవై భరిస్తుంది.
 
 స్ట్రీమ్ ఎస్‌ఎక్స్
 2015-16 విద్యా సంవత్సరంలో సైన్స్ సబ్జెక్టుల్లో(ఫిజిక్స్/ కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/బయాలజీ) ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించిన విద్యార్థులు స్ట్రీమ్ ఎస్‌ఎక్స్ పరిధిలోకి వస్తారు. దాంతోపాటు 2016-17 విద్యా సంవత్సరంలో బేసిక్ సైన్స్ కోర్సుల (బీఎస్సీ/ బీఎస్/ బి.స్టాట్/బి.మ్యాథ్/ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంఎస్) ఔత్సాహికులై ఉండాలి. పదో తరగతి బోర్డు పరీక్షల్లో మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టుల్లో సగటున 80 శాతం మార్కులు(ఎస్సీ/ఎస్టీ/పీడబ్యూడీ 70శాతం)సాధిస్తేనే కేవీపీవై రాత పరీక్షకు అర్హులు. అంతేకాకుండా ఇంటర్మీడియెట్‌లో సైన్స్ సబ్జెక్ట్‌లలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ విద్యార్థులకు 50 శాతం మార్కులు రావాలి.
 
 స్ట్రీమ్ ఎస్‌బీ
 2015-16 విద్యా సంవత్సరంలో నిర్దేశిత సైన్స్ సబ్జెక్ట్(ఫిజిక్స్/కెమిస్ట్రీ / మ్యాథమెటిక్స్ / బయాలజీ)లలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో (బీఎస్సీ/బీఎస్/బీస్టాట్/ బి.మ్యాథ్/ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంఎస్) అడ్మిషన్ పొందే విద్యార్థులు స్ట్రీమ్ ఎస్‌బీ పరిధిలోకి వస్తారు. వీరు కూడా ఇంటర్మీడియెట్‌లో సైన్స్/ మ్యాథమెటిక్స్ గ్రూప్ సబ్జెక్ట్‌లలో 60 శాతం సగటు ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ విద్యార్థులకు 50 శాతం మార్కులు రావాలి. ఫెలోషిప్ పొందాలంటే.. డిగ్రీ ప్రథమ సంవత్సరం ఫైనల్ పరీక్షల్లో 60 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ విద్యార్థులకు 50 శాతం మార్కులు రావాలి.
 
 ఎంపిక విధానమిలా
 కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ పరిధిలోని మూడు విభాగాల్లో అర్హులకు జాతీయ స్థాయిలో ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్ 1న ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా షార్‌‌టలిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇది కేవీపీవై ఎంపిక ప్రక్రియలో తుది దశ.
 
 అయిదేళ్లపాటు ఆర్థిక తోడ్పాటు
 కేవీపీవై ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన విద్యార్థులకు సైన్స్ కోర్సులు అభ్యసించేందుకు అయిదేళ్లపాటు ఫెలోషిప్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు ఏడాదికోసారి కాంటింజెన్సీ గ్రాంట్ కూడా లభిస్తుంది. ఎస్‌ఏ, ఎస్‌ఎక్స్, ఎస్‌బీ ఈ మూడు స్ట్రీమ్‌లలోనూ బీఎస్సీ, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశించిన విద్యార్థులకు మొదటి మూడేళ్లు నెలకు రూ. 5 వేలు చొప్పున ఫెలోషిప్ అందుతుంది. దీంతోపాటు ప్రతి ఏటా రూ. 20 వేల కాంటింజెన్సీ గ్రాంట్ లభిస్తుంది. ఎంఎస్సీలో రెండేళ్లు, ఇంటిగ్రేటెడ్ పీజీలో 4, 5 సంవత్సరాల్లో నెలకు రూ.7 వేల ఫెలోషిప్‌తోపాటు రూ.28 వేల వార్షిక కాంటింజెన్సీ గ్రాంట్ మంజూరవుతుంది.
 
 అకడమిక్ రికార్డ్ బాగుంటేనే
 కేవీపీవై ఫెలోషిప్‌లను అందించే క్రమంలో విద్యార్థుల అకడమిక్ రికార్డ్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి సంవత్సరం 60 శాతం మార్కులు పొందితేనే ఫెలోషిప్‌ను కొనసాగిస్తారు.
 
 ఎంపికైన విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ కూడా
 కేవీపీవై ఫెలోషిప్‌లకు ఎంపికైన విద్యార్థులకు లభించే మరో అదనపు ప్రయోజనం ‘సమ్మర్ ప్రోగ్రాం’. సదరు అభ్యర్థులను వేసవి సెలవుల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లు; ఐఐఎస్‌సీ-బెంగళూరులో రెండు వారాల వ్యవధి గల ఈ సమ్మర్ వెకేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలోని నిపుణుల ద్వారా బోధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీంతోపాటు విద్యార్థులకు సదరు ఇన్‌స్టిట్యూట్‌లలో నిర్వహించే సైన్స్ రీసెర్చ్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం, ఆసక్తి ఉంటే వారు కూడా పాల్పంచుకునే అవకాశాలు సైతం లభిస్తాయి.
 
 కేవీపీవై ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇలా
 జాతీయ స్థాయిలో నిర్వహించే కేవీపీవై ఆప్టిట్యూడ్ టెస్ట్.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ (పెన్ పేపర్ బేస్డ్) విధానంలో ఉంటుంది. మొత్తం వంద మార్కులకు మూడు గంటల వ్యవధిలో జరిగే ఈ పరీక్ష రెండు విభాగాలు(పార్ట్-1; పార్ట్-2)గా నిర్వహిస్తారు. ప్రతి విభాగంలోనూ నాలుగు ఉప విభాగాలు (మ్యాథమెటిక్స్; ఫిజిక్స్; కెమిస్ట్రీ; బయాలజీ) ఉంటాయి. పార్ట్-1లోని నాలుగు ఉప విభాగాల్లో ప్రతి విభాగం నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఏదైనా మూడు ఉప విభాగాలకు సమాధానలిచ్చే వెసులుబాటు ఉంది. అదే విధంగా పార్ట్-2లోని నాలుగు ఉప విభాగాల్లో ప్రతి విభాగం నుంచి పది ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఏవైనా రెండు ఉప విభాగాలను ఎంపిక చేసుకుని సమాధానాలివ్వొచ్చు.
 
 అకడమిక్ నైపుణ్యాలు ‘పరీక్షిం’చేలా
 కేవీపీవై ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో పేర్కొన్న విభాగాల్లో అడిగే ప్రశ్నలు ఆయా సబ్జెక్ట్‌లలో అభ్యర్థుల అకడమిక్ నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రశ్నల క్లిష్టత దాదాపు జేఈఈ మాదిరిగా ఉంటుంది. విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి అన్ని కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచుకోవడంతోపాటు; కాన్సెప్ట్‌ల అప్లికేషన్ తీరుపైనా పరిపూర్ణత సాధించాలి. అకడమిక్ పుస్తకాలతోపాటు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివితే ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకునే అవకాశం లభిస్తుంది.
 
 ఇతర పోటీ పరీక్షలతో సమాంతరంగా
 ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులు సాధారణంగానే ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. ఇలాంటి వారు ఆ ప్రిపరేషన్‌ను కేవీపీవై ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు కూడా అన్వయించుకునే విధంగా వ్యవహరించాలి. కేవీపీవై ఆప్టిట్యూడ్ టెస్ట్ సిలబస్‌లో దాదాపు అన్ని అంశాలు అకడమిక్ సిలబస్‌తో సరితూగుతాయి. దీన్ని గమనించి తులనాత్మక అధ్యయనం చేయాలి.
 
 ప్రత్యేకంగా కొన్ని
 కేవీపీవై ఆప్టిట్యూడ్ టెస్ట్ ఔత్సాహికులు ఈ పరీక్షకు ప్రత్యేకంగా కొన్ని వ్యూహాలు అనుసరించాలి. అవి..
 గత ప్రశ్న పత్రాలను పరిశీలించి ప్రశ్నల శైలిపై అవగాహన ఏర్పరచుకోవాలి.ప్రాక్టీస్ టెస్ట్‌లకు జరు కావాలి.
 ఆయా కాన్సెప్ట్‌లను షార్ట్‌కట్ మెథడ్స్‌లో సొంత నోట్స్‌లో పొందుపర్చుకోవాలి.చివరి నెల రోజులు పూర్తిగా రివిజన్‌కు కేటాయించాలి.
 
 బయాలజీ సబ్జెక్ట్ అభ్యర్థులు డయాగ్రమ్స్‌లోని ముఖ్య భాగాలను గుర్తించడంపై అవగాహన పెంచుకోవాలి.
 ఈ ఏడాది ఆప్టిట్యూడ్ టెస్ట్ తేదీకి అయిదు నెలల సమయం అందుబాటులో ఉంది. జేఈఈ, ఎంసెట్ వంటి ఎంట్రన్స్‌లను లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ఈ సమయం సరిపోతుంది. కాబట్టి జాతీయ స్థాయి పోటీ గురించి ఆందోళన చెందకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్‌పై అవగాహన పొందడం ముఖ్యమని గుర్తించాలి.
 
 ఇతర పోటీ పరీక్షలతో సమానంగా
  కేవీపీవై ఔత్సాహిక అభ్యర్థులు ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూనే ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు ప్రిపరేషన్ సాగించొచ్చు. సిలబస్‌లో పేర్కొన్న అంశాలు కూడా అకడమిక్ పుస్తకాల్లోవే. అదనపు అంశాలు ఏవీ ఉండవు. జాతీయ స్థాయి పరీక్ష కాబట్టి సీబీఎస్‌ఈ విద్యార్థులకే అనుకూలం అనేది అపోహ మాత్రమే. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బోర్డ్‌ల సిలబస్ కూడా సీబీఎస్‌ఈను పోలి ఉంది కాబట్టి ఏ మాత్రం ఆందోళన చెందక్కర్లేదు. అయితే విద్యార్థులు గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ద్వారా మెరిట్ జాబితాలో చోటు సాధించేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
 - పి.మధు, కోఆర్డినేటర్,
 ఆకాశ్ ఐఐటీ క్లాసెస్
 
 విభాగాల ఎంపికపై స్పష్టంగా
 కేవీపీవై పరీక్షలోని రెండు విభాగాల్లో నిర్దేశించిన ఉప విభాగాల్లో చాయిస్ ఉంటుంది. కాబట్టి చాయిస్‌గా ఎంపిక చేసుకునే ఉప విభాగంపై ముందుగానే అవగాహన ఏర్పరచుకోవాలి. ముందుగా ప్రశ్న పత్రం పరిశీలనకు కనీసం పది నిమిషాలు కేటాయించి బాగా వచ్చిన విభాగంతో ప్రారంభించాలి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ప్రశ్నల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక ప్రిపరేషన్ పరంగా అకడమిక్ సిలబస్, ఇతర పోటీ పరీక్షల సిలబస్‌ను కేవీపీవై సిలబస్‌తో బేరీజు వేసుకుంటూ ముందుకు సాగితే సమయం ఆదా అవుతుంది.
 - టి. సాయితేజ,
 కేవీపీవై-2014 స్ట్రీమ్ ఎస్‌ఏ విజేత
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement