టార్గెట్ గ్రూప్-2 | Target Group -2 | Sakshi
Sakshi News home page

టార్గెట్ గ్రూప్-2

Published Sat, Sep 3 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

టార్గెట్ గ్రూప్-2

టార్గెట్ గ్రూప్-2

 లక్షల మంది గ్రూప్స్ అభ్యర్థులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న గ్రూప్- 2 అనుబంధ నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ గురువారం విడుదల చేసింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో 439 పోస్టులుండగా.. అదనంగా 593 పోస్టులను చేర్చి మొత్తంగా 1032 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ -2 పరీక్ష నవంబర్ 12, 13 తేదీల్లో జరగనుంది. సిలబస్‌ను దృష్టిలో పెట్టుకుంటే.. సమయం తక్కువ,చదవాల్సింది ఎక్కువగా ఉంది. పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తే... గ్రూప్ 2 లక్ష్యం సాధించడం కష్టమేమీ కాదు. ఈ నేపథ్యంలో గ్రూప్2లోవిజయానికి నిపుణుల సలహాలు..
 
 పరీక్ష విధానం..
 ఈ పరీక్ష 675 మార్కులకు ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ పద్ధతిలో 600 మార్కులకు, ఇంటర్వ్యూ 75 మార్కులకు ఉంటాయి. రాత పరీక్షలో నాలుగు పేపర్లుంటాయి. అవి..
 
 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ పద్ధతి)
 పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
 సమయం: 2.30 గంటలు. 150 ప్రశ్నలు, 150 మార్కులు
 పేపర్-2: హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ.
 (1. భారతదేశ, తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర;
 2. భారత రాజ్యాంగం, రాజకీయాలు- అవలోకనం;
 3. సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు)
 సమయం: 2.30 గంటలు. 150 ప్రశ్నలు
 (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.    
 పేపర్-3: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్.
 (1. భారత ఆర్థిక వ్యవస్థ: అంశాలు, సవాళ్లు;
 2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి;
 3. అభివృద్ధి, మార్పు అంశాలు)
 సమయం: 2.30 గంటలు. 150 ప్రశ్నలు
 (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.
 పేపర్-4: తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్
 (1. తెలంగాణ తొలి దశ - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-1970);
 2. ఉద్యమ దశ (1971-1990);
 3. తెలంగాణ ఏర్పాటు దశ - ఆవిర్భావం (1991-2014)
 సమయం: 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.
 
 ప్రిపరేషన్ ఇలా..
 పేపర్ -1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్: ఇందులో కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకేలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణ సంబంధిత జీకే, కరెంట్ అఫైర్స్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పలు పరీక్షల్లో జనరల్ స్టడీస్ పేపర్‌కు సంబంధించి 40 నుంచి 45 శాతం ప్రశ్నలు తెలంగాణ ప్రాంత జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు-లక్ష్యాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి. సామాజిక వివక్ష, హక్కులు, అంశాలు, సమ్మిళిత విధానాలకు సంబంధించి రాజ్యాంగంలోని సంబంధిత అధికరణలపై అవగాహన పెంచుకోవాలి. రాష్ట్ర, దేశ, ప్రపంచ జాగ్రఫీకి సంబంధించి స్టాండర్ట్ బుక్స్ చదవాలి. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి ప్రశ్నలుంటాయి. వీటితో పాటు పదో తరగతి స్థాయిలో బేసిక్ ఇంగ్లిష్ ప్రశ్నలు వస్తాయి. దీనికోసం హైస్కూల్ స్థాయి పుస్తకాలు చదవాలి. మ్యాథ్స్ విభాగానికి సంబంధించి ఆర్.ఎస్.అగర్వాల్ రీజనింగ్, అర్థమెటిక్ బుక్స్ ఉపయుక్తంగా ఉంటాయి.
 
 పేపర్-2: హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ
 ఇందులో మూడు విభాగాలు (చరిత్ర, భారత రాజ్యాంగం, సామాజిక స్వరూపం, పబ్లిక్ పాలసీలు) ఉన్నాయి. సెక్షన్-1కి సంబంధించి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ రెండింటినీ మూడు భాగాలుగా (ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక) విభజించుకొని అధ్యయనం చేయాలి. ఇండియన్ హిస్టరీలో ఆధునిక భారతదేశ చరిత్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో వలసవాదం దశలు, 1857 తిరుగుబాటు, భారతదేశంలో జాతీయవాదం పెరుగుదల, గాంధీ యుగం, దేశ స్వాతంత్య్రానంతరం ముఖ్య ఘట్టాలను చదవాలి.
 
 సింధు, వేద కాల నాగరికతలు, మతపరమైన ఉద్యమాలు (బౌద్ధం, జైనం తదితరాలు), ఇస్లాం మతం-ప్రభావం, భక్తి ఉద్యమాలు-స్వభావం, లలిత కళలు, మొగల్ సామ్రాజ్యం తదితర అంశాలను బాగా చదవాలి.
 
 తెలంగాణ ప్రాచీన, మధ్యయుగ చరిత్రలో ఆయా రాజ వంశాలు, వాటి హయాంలో జరిగిన సామాజిక ఆర్థిక అభివృద్ధి తదితరాలపై అవగాహన (ఉదా: కాకతీయుల కాలంలో ప్రత్యేకత ఉన్న నీటి పారుదల వ్యవస్థ) పెంచుకోవాలి.
 
 ఆధునిక తెలంగాణ చరిత్రలో నిజాం సంస్కరణలు, శిస్తు విధానాలు, ఆయా రంగాల అభివృద్ధి (ఉదాహరణకు విద్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధి), అసఫ్‌జాహీల కాలంలో ఆర్య సమాజ్, ఆది హిందూ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 
 సెక్షన్-2కి సంబంధించి రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, భారత సమాఖ్య, విశిష్ట లక్షణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన, శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు, పంచాయతీరాజ్ వ్యవస్థ; 73,74 రాజ్యాంగ సవరణలు వాటి ప్రాముఖ్యత తదితర అంశాలను చదవాలి.
 
 సెక్షన్-3కి సంబంధించి దేశంలో మత వ్యవస్థ ఆయా మతాలు - లక్షణాలు, కుల వ్యవస్థ - లక్షణాలు, నిరుద్యోగం, పేదరికం, బాల కార్మిక, వెట్టి చాకిరీ వ్యవస్థలు, జోగిని, దేవదాసీ వ్యవస్థలు, వాటి నేపథ్యం, సమకాలీన సమస్యల్లో భాగంగా ఫ్లోరోసిస్ సమస్య, వలసలు - కారణాలు, తెలంగాణలో రైతు ఉద్యమాలు, దళిత, వెనుకబడిన వర్గాల ఉద్యమాల గురించి తెలుసుకోవాలి.
 
 పేపర్ - 3: ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
 సెక్షన్-1కి సంబంధించి ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయ భావనలు - కొలిచే ప్రమాణాలు, నిరుద్యోగం, పేదరికం భావనలు - వాటి నిర్వచనాలు, నిరుద్యోగ నిర్మూలనకు చేపడుతున్న పథకాలు, పంచవర్ష ప్రణాళికలు-వాటి లక్ష్యాలు తదితరాలను చదవాలి.

 సెక్షన్-2కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం- భౌతిక వనరులు, పట్టణీకరణ భావనలు, గ్రామీణ ప్రాంత పరిస్థితులు, అక్షరాస్యత రేటు (స్త్రీ-పురుష అక్షరాస్యత రేటు, పట్టణ-గ్రామీణ ప్రాంత అక్షరాస్యత రేటు), వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు, పశు పోషణ, మత్స్య సంపదల గురించి తెలుసుకోవాలి. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మైనింగ్, తయారీ, సహజ ఇంధన వనరుల లభ్యత, నీటిపారుదల వ్యవస్థలను అధ్యయనం చేయాలి. సేవా రంగం అంశాలపైనా దృష్టిపెట్టాలి.
 
 సెక్షన్ -3కి సంబంధించి సామాజిక అసమానతలు, కుల, వర్ణ, మత పరమైన వివక్షలు, కారణాల విశ్లేషణతో పాటు ప్రధానంగా ఈ విభాగంలో ఆర్థిక సంస్కరణల గురించి అధ్యయనం చేయాలి.
 
 పేపర్-4: ‘తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం’
 సెక్షన్-1లో పేర్కొన్న ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70) కోసం ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు కారణాలు, దారితీసిన పరిస్థితులు, ఈ కాలంలో ముఖ్యమైన ఉద్యమాలను అధ్యయనం చేయాలి. హైదరాబాద్‌పై పోలీస్ చర్య, పరిణామాలు, భూదానోద్యమం, పెద్ద మనుషుల ఒప్పందం-అందులో ముఖ్యాంశాలు-తీర్మానాలు, 1969లో జై తెలంగాణ ఉద్యమానికి దారి తీసిన పరిస్థితుల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.
 
 సెక్షన్-2కు సంబంధించి జై ఆంధ్ర ఉద్యమం, రాష్ర్టపతి పాలన, ఆరు సూత్రాల పథకం, జోనల్ వ్యవస్థ ఏర్పాటు, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష దిశగా ఏర్పడిన సంస్థలు/పార్టీలు, ముల్కీ నిబంధనలు వంటి వాటిని అధ్యయనం చేయాలి. సెక్షన్-3 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014)కు సంబంధించి ఆయా రాజకీయ పార్టీల ఏర్పాటు-అందుకు దారి తీసిన పరిస్థితులు, ఈ దశలో జరిగిన నిరసన కార్యక్రమాలు (మిలియన్ మార్చ్, సడక్ బంద్, సకల జనుల సమ్మె వంటివి), వాటి పర్యవసానాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ముఖ్యమైన కమిటీల రిపోర్ట్‌లను అధ్యయనం చేయాలి. ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పొందుపర్చిన, తెలంగాణ సంబంధ అంశాలను తెలుసుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement