భిన్నంగా ఆలోచించే వారికి భవ్యమైన కెరీర్లు | The careers of those who think differently | Sakshi
Sakshi News home page

భిన్నంగా ఆలోచించే వారికి భవ్యమైన కెరీర్లు

Published Sat, Sep 20 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

భిన్నంగా ఆలోచించే వారికి భవ్యమైన కెరీర్లు

భిన్నంగా ఆలోచించే వారికి భవ్యమైన కెరీర్లు

కొందరికి అందరిలాగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రొటీన్‌గా పనిచేయడం అస్సలు నచ్చదు. అందరికీ భిన్నంగా తమకు చేయాలనిపించినప్పుడే విధులు నిర్వహించడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. తమకు నచ్చినప్పుడు పనిచే యడానికి వీలు కల్పించే కెరీర్ కావాలని కోరుకుంటారు. అలాంటి రంగంలోనే ఉపాధిని వెతుక్కుంటారు. ఇలా వైవిధ్యమైన కెరీర్ కోరుకునేవారికి నేటి హైటెక్ జాబ్ మార్కెట్ ఆహ్వానం పలుకుతోంది. సిటీలో ఆయా రంగాల్లో మానవ వనరులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. భిన్నంగా ఆలోచించే వారికోసం పలు భవ్యమైన కెరీర్స్.
 
  ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్
 ప్రస్తుత ఈ-కామర్స్, టెక్నాలజీ యుగంలో అంతటా వెబ్‌సైట్స్ హవా నడుస్తోంది. చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి కంపెనీ కూడా తమకంటూ ప్రత్యేకంగా వెబ్‌సైట్ ఉండాలని భావిస్తోంది. దాంతో ఆయా కంపెనీల అవసరాలు, ప్రాధాన్యాల మేరకు వెబ్‌సైట్‌ను రూపొందించడానికి వెబ్ డిజైనర్ల అవసరం ఏర్పడింది. వీరి పని కేవలం వెబ్ డిజైనింగ్ వరకే పరిమితం. కాబట్టి వెబ్ డిజైనింగ్ కోసం ఉద్యోగిని నియమించుకోవడం లేదు. ఆ బాధ్యతలు పొరుగు సేవల కన్సల్టెంట్స్‌కు అప్పగిస్తున్నాయి. కాబట్టి పని వేళలతో నిమిత్తం లేకుండా వెబ్ డిజైనింగ్ చేయొచ్చు. కంపెనీ నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేస్తే సరిపోతుంది. వెబ్ డిజైనింగ్‌కు సంబంధించి పలు ప్రైవేట్ సంస్థలు స్వల్పకాలిక కోర్సులను అందజేస్తున్నాయి. వాటిని నేర్చుకోవడం ద్వారా వెబ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఇంట్లో కంప్యూటర్ ఉంటే చాలు ఈ రంగంలో ఫ్రీలాన్సర్‌గా స్థిరపడొచ్చు. డిజైన్ చేసిన వెబ్‌సైట్/సంస్థను బట్టి వేతనం ఉంటుంది. నెలకు రూ.10 వేల -20 వేల వరకు ఆదాయాన్ని పొందొచ్చు.
 
 రియల్ ఎస్టేట్ ఏజెంట్
 చాలా మంది డబ్బును స్థిరాస్తుల్లో పెట్టుబడిగా పెట్టాలని భావిస్తుంటారు. ఎక్కడ, ఎలా అనే విషయంలో సరైన అవగాహన ఉండదు. ఇటువంటి వారిని గైడ్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటారు. ఎక్కడ భూమి ఉంది? దాని ధర ఎంత? రాబోయే కాలంలో పరిస్థితులు ఏవిధంగా ఉంటాయి? వంటి విషయాలను వీరు సమగ్రంగా వివరిస్తుంటారు. దీనికి కూడా సమయంతో నిమిత్తం లేదు. కేవలం ఫోన్ ద్వారా ఇన్వెస్టర్, భూ యజమానితో మాట్లాడి అనుకున్న సమయానికి భూమిని చూపిస్తే సరిపోతుంది. ఇతర ఉద్యోగాలు చేస్తూ కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వ్యవహరించవచ్చు. భూమికి సంబంధించి చేసుకున్న ఒప్పందం మేరకు కమిషన్ రూపంలో ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం చాలా మంది భూమిపై పెట్టుబడి దిశగా ఆలోచిస్తున్న తరుణంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ భిన్నమైన కెరీర్‌గా చెప్పొచ్చు.
 
 సోషల్ మీడియా కన్సల్టెంట్
 ప్రస్తుతం అంతటా సోషల్ మీడియా హల్‌చల్ చేస్తోంది. తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవడానికి సోషల్ మీడియా చక్కని మాధ్యమంగా మారింది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయం, క్రీడలు.. ఇలా అన్ని రంగాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే క్లిక్‌తో ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్నారు. వీటిని లక్షలాది మంది వీక్షిస్తుంటారు. దీని ఆధారంగా సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. ఆయా సంస్థలు సోషల్ మీడియా వ్యవహారాలను కన్సల్టెంట్లకు అప్పగిస్తున్నాయి. వీరు తమకు వీలైన సమయంలో సంబంధిత వ్యవహారాలను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. కంప్యూటర్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మొబైల్ ఫోన్‌తోనే ఎప్పుడైనా ఇటువంటి పనులను పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తున్న తరుణంలో ఇది ఒక మంచి అవకాశం. వీరికి ఇంగ్లిష్ భాష, స్థానిక పరిస్థితులపై పట్టు ఉండాలి. చేస్తున్న పని ఆధారంగా డబ్బు అందుతుంది. నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ సంపాదించుకోవచ్చు.
 
 పర్సనల్ ట్రైనర్
 నేడు ప్రపంచమంతా నైపుణ్యాలాధారంగా పని చేస్తుంది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, టీచింగ్.. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కమ్యూనికేషన్, లీడర్‌షిప్ వంటి లక్షణాలు తప్పనిసరి. ఈ అంశాలు అకడమిక్స్‌లో పెద్దగా కనిపించవు. వీటికున్న ప్రాధాన్యత దృష్ట్యా స్వతహాగా పెంపొందించుకోవాలి. లేదా శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోవాలి. ఈ క్రమంలో వివిధ పరీక్షలకు ఇచ్చే కోచింగ్ మాదిరిగానే వ్యక్తిగత నైపుణ్యాల శిక్షణ తరగతులను నిర్వహించవచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో లేదా వారాంతాల్లో ఆయా అంశాలపై శిక్షణనివ్వచ్చు. ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగార్థులందరూ నైపుణ్య మంత్రం జపిస్తున్నందున ఇలాంటి తరగతులకు మంచి ఆదరణ లభిస్తోంది. వీటిని సొంతంగా చేపట్టవచ్చు లేదా ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పొచ్చు. తరగతులు/సమయం ఆధారంగా వేతనం ఉంటుంది. నెలకు రూ.15 వేల -20 వేల వరకు సంపాదించవచ్చు.
 
 గ్రాఫిక్ డిజైనర్
 ప్రస్తుత మార్కెటింగ్ యుగంలో వినియోగదారులను ఆకర్షించాలన్నా.. బోర్డు సమావేశ నిర్ణయాలను ప్రభావవంతంగా నివేదిక రూపంలో తెలపాలన్నా.. పుట్టిన రోజు నుంచి పెళ్లి వరకు ఏ శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు ముద్రించాలన్నా..  గ్రాఫిక్ డిజైనర్ల పాత్ర ఎంతో కీలకం.  ప్రింటింగ్ ప్రెస్‌లు, ఫొటోషాప్‌లు, డిజైనింగ్ స్టూడియోలు, కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్‌లు తదితర సంస్థలు ఇందుకు ఉపాధి వేదికలు. వీలైన సమయంలో లేదా ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేసుకోవచ్చు. ఇందుకోసం ఫొటోషాప్, కొరల్‌డ్రా వంటి సాంకేతిక అంశాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ విభాగంలో స్వల్పకాలిక కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఎంచుకున్న పనిని బట్టి వేతనం ఉంటుంది.  నెలకు రూ.10 వేల -20 వేల వరకు వేతనం పొందొచ్చు.
 
 ట్యాక్స్ కన్సల్టెంట్
 మనలో చాలా మందికి పన్నులకు సంబంధించిన అంశాలు అంతగా తెలియవు. ఇటువంటి నేపథ్యంలో ఎంత ఆదాయం వస్తే పన్ను చెల్లించాలి? అన్ని రంగాల వారు చెల్లించాలా? పన్నుల భారం పడకుండా ఉండాలంటే.. ఎటువంటి పద్ధతులను అనుసరించాలి? వంటి అంశాలపై అవగాహన కల్పించడం ట్యాక్స్ కన్సల్టెంట్ బాధ్యత. చాలా మంది/సంస్థలు తమకున్న పరిమితుల దృష్ట్యా ట్యాక్స్ సంబంధిత వ్యవహారాలను పొరుగు సేవల రూపంలో కన్సల్టెంట్లకు అప్పగిస్తుంటాయి. వీరు క్లైంట్‌ల సమయానుకూలతలను బట్టి వారిని కలిసి సంబంధిత వివరాలు సేకరిస్తారు. తర్వాత ఏం చేయాలి? ఏవిధంగా చేయాలి? అనే అంశంపై గెడైన్స్ ఇస్తారు. కామర్స్, మేనేజ్‌మెంట్ అభ్యర్థులు మెరుగైన అవకాశాలను దక్కించుకోవచ్చు. పనిని బట్టి నెలకు రూ.20 వేల నుంచి 30 వేల వరకు ఆదాయం అందుకోవచ్చు.
 
 డెంటల్ హైజీనిస్ట్
 డెంటిస్ట్ విధులకు సహాయకారిగా ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాల్సిందే. డెంటిస్ట్‌లు ఉదయం, సాయంత్రం వేళల్లో క్లినిక్‌లు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో వీరికి డెంటల్ హైజీనిస్ట్‌లు అవసరమవుతారు. దంతవైద్యంపై అందరికీ అవగాహన ఏర్పడడం, ప్రతి చోటా డెంటల్ క్లినిక్‌లు కనిపిస్తుండటంతో వీరి ప్రాధాన్యత పెరిగింది. వచ్చిన పేషంట్లను సమన్వయం చేయడం, చికిత్స సంబంధిత వ్యవహారాల్లో డాక్టర్‌కు సహాయం అందించడం,  పేషంట్లకు సలహాలు ఇవ్వడం వంటివి వీరి విధులు. పని గంటలను బట్టి వేతనాలను చెల్లిస్తారు. నెలకు రూ. 6 వేల నుంచి 10 వేల వరకు అందుకోవచ్చు.
 
 ట్రావెల్ గైడ్
 చారిత్రక కట్టడాల ప్రాధాన్యత, విశిష్టతలను వివరంగా తెలుసుకుంటేనే వాటి సందర్శన పరిపూర్ణమవుతుంది. ఇందుకు సహకరించే వారు ట్రావెల్ గైడ్లు. కట్టడానికి సంబంధించిన విశేషాలను వివరించడంతోపాటు ఇంకా సందర్శించాల్సిన ప్రదేశాలు, ఎక్కడ బస చేయొచ్చు? మనకు కావల్సిన ఆహారం ఎక్కడ లభిస్తుంది? తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ట్రావెల్ గైడ్‌గా రాణించాలంటే..  భాషలపై పట్టు ఉండాలి. ఎందుకంటే.. వచ్చిన పర్యాటకుల స్థానిక భాషను నేపథ్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణాల పట్ల ఆసక్తి ఉండాలి. చూపించిన ప్రదేశం, ప్రయాణించిన దూరం వంటి అంశాలాధారంగా ఆదాయం లభిస్తుంది. నెలకు రూ. 5 వేల నుంచి 10 వేల వరకు వేతనాన్ని పొందొచ్చు.
 
 నర్సింగ్
 సమయంతో పోటీపడి పరుగులు పెడుతున్న నగర జీవులు..అంతే వేగంగా వ్యాధుల బారిన పడుతున్నారు. వాటి నుంచి ఉపశమనం కల్పించే దిశలో న ర్సుల సేవలు ఎంతో అవసరం. ప్రతి చిన్న సమస్యకు ఆసుపత్రులకు వెళ్లడం ఎంతో వృథా వ్యవహారం. ఇంజక్షన్ చేయడం, ఫస్ట్ ఎయిడ్, డ్రెస్సింగ్, బీపీ చెకప్, సెలైన్ ఎక్కించడం, వంటి పనులను ఇంట్లో చేయడానికి పార్ట్‌టైమ్ నర్సులు అవసరం. అదేవిధంగా స్పెషలిస్ట్ డాక్టర్లు ఈవెనింగ్ క్లినిక్స్/మార్నింగ్ క్లినిక్స్‌లు నిర్వహిస్తుంటారు. అందులో వారికి తోడ్పడానికి నర్సుల సేవలు తప్పనిసరి. ఇలాంటి సందర్భాల్లో నర్సుల అవసరం కొన్ని రోజులకు లేదా కొన్ని గంటలకే పరిమితం. కాబట్టి అనువైన సమయంలో ఈ సేవలను అందించవచ్చు. వీరికి విధులు నిర్వహించిన సమయాన్ని బట్టి వేతనం అందుతుంది. ప్రారంభంలో నెలకు రూ.10 వేల-14 వేల ఆదాయం అందుకోవచ్చు.
 
 మేకప్ ఆర్టిస్ట్
సంప్రదాయ పని వేళలతో నిమిత్తం లేకుండా విధులు నిర్వహించే వెసులుబాటు కల్పిస్తున్న మరో విభాగం.. మేకప్ ఆర్టిస్ట్. నేటి తరం పుట్టిన రోజు నుంచి పెళ్లి వరకు అన్ని రకాల శుభకార్యాలకు అలంకరణ విషయంలో ప్రాధాన్యం ఇస్తోంది. ఆయా శుభ కార్యాల సమయాన్ని అనుసరించి మేకప్ చేస్తే సరిపోతుంది. మేకప్‌ను బట్టి వేతనాన్ని చెల్లిస్తారు. నెలకు రూ.10 వేల నుంచి 20 వేల వరకు ఆదాయం పొందొచ్చు.
 
 స్పోర్ట్స్/ఫిజికల్ కోచ్
 చాలామంది ఇప్పుడు ఫిజికల్ ఫిట్‌నెస్, స్పోర్ట్స్‌పై మక్కువ చూపిస్తున్నారు. స్పోర్ట్స్/ఫిజికల్ కోచ్ ..కార్యకలాపాలన్నీ ఉదయం, సాయంత్రం ఉంటాయి. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం అనే విధానానికి భిన్నంగా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో  కోచ్‌గా కొనసాగవచ్చు. దీనికి అకడమిక్ కోర్సులు అవసరం లేదు. స్వల్ప శిక్షణతో ఇందులో స్థిరపడొచ్చు. స్పోర్ట్స్ క్లబ్‌లు, జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు, స్కూల్స్, కాలేజీల్లో ఈ తరహా ఉద్యోగాలు లభిస్తాయి. నెలకు రూ.5 వేల-రూ.10 వేల వరకు ఆదాయం లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement