ఇంజనీరింగ్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 27 నుంచి  | Verification Of Engineering Certificates From June 27 | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 27 నుంచి 

Published Fri, Jun 21 2019 1:45 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Verification Of Engineering Certificates From June 27 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించాలని ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫీజుల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో వీలైనంత త్వరగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎంసెట్, ఈసెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎంసెట్‌కు ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే అదే రోజునుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ చేపట్టేలా షెడ్యూల్‌ ఖరారు చేసింది.

అయితే ఫీజుల వ్యవహారంలో యాజమాన్య ప్రతిపాదిత ఫీజు అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులు రావడం, వాటిపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 27 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఉంటాయా లేదా అన్నది మరోసారి తెలియజేస్తామని మండలి చైర్మన్‌ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 27లోగా ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లి, కోర్టులో నిర్ణయం వెలువడితే యథావిధిగా వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పారు. లేకపోతే కొంత ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. ఈలోగా కాలేజీల అనుబం«ధ గుర్తింపు వస్తుందని, ఫీజులపై స్పష్టత వస్తుందని వివరించారు.

ఎంసెట్‌ ప్రవేశాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ (https://tseamcet.nic.in)  ఈనెల నుంచి ఈనెల 24 నుంచి అందుబాటులోకి వస్తుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. మరోవైపు పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే (లేటరల్‌ ఎంట్రీ) ఈసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈ నెల 22 నుంచి ప్రారంభించేలా షెడ్యూల్‌ జారీ చేసింది. 24 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది.

అనుకున్న చోట వెరిఫికేషన్‌..
వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ మరింత సులభం కానుంది. ఇప్పటివరకు విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం ర్యాంకు ప్రకారం కేటాయించిన హెల్ప్‌లైన్‌ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకు ఒక్కోసారి ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం అలాంటి ఇబ్బందున్నింటికీ చెక్‌ పెట్టనుంది. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్‌ కేంద్రానికి వెళ్లి, తమకు నచ్చిన తేదీల్లో, వీలైన సమయంలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయించుకునేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం స్లాట్‌ బుకింగ్‌ విధానం అమల్లోకి తేనుంది. విద్యార్థులు తాము స్లాట్‌ బుక్‌ చేసుకున్న నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. ఫీజు చెల్లించి ఈ స్లాట్‌ బుక్‌ చేసుకుని, ఆయా హెల్ప్‌లైన్‌ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయించుకునేలా చర్యలు చేపట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement