మానస సరోవరం ఎక్కడ ఉంది? | Where is Manasarovar? | Sakshi
Sakshi News home page

మానస సరోవరం ఎక్కడ ఉంది?

Published Sun, Sep 14 2014 9:56 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

మానస సరోవరం ఎక్కడ ఉంది? - Sakshi

మానస సరోవరం ఎక్కడ ఉంది?

ఇండియన్ జాగ్రఫీ
భూ విజ్ఞాన శాస్త్రానికి చెందిన పలకల విరూపకారక సిద్ధాంతం ప్రకారం హిమాలయాలు, గంగా - సింధు మైదానం ఆక్రమించి ఉన్న ప్రస్తుత భూభాగంలో మధ్య మహాయుగ కాలంలో ‘టెథిస్’ సముద్రం అనే ఒక పెద్ద భూ అభినతి ఉండేది. ఈ సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని ‘అంగారా’ లేదా లారెన్షియా భూమి అని, దీనికి దక్షిణంగా ఉన్న భూభాగాన్ని (నేటి ద్వీపకల్ప భాగం) ‘గోండ్వానా’ అని పిలిచేవారు. కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత సంపీడన బలాల వల్ల ‘టెథిస్’ సముద్రంలో నిక్షేపితమైన అవక్షేపాలు ముడుతలు పడి ప్రస్తుతమున్న హిమాలయ పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి.
 
భారతదేశం - భౌతిక స్వరూపాలు
భారతదేశంలో ఉన్న భౌతిక సహజ స్వరూపాలను ప్రధానంగా నాలుగు విభాగాలుగా విభజించవచ్చు. అవి
...
     1. ఉత్తర పర్వతాలు (హిమాలయాలు)
     2. గంగా - సింధు మైదానం
     3. ద్వీపకల్ప పీఠభూమి
     4. తీర మైదానాలు
 
ఉత్తర పర్వతాలు (హిమాలయాలు):
ప్రపంచంలోని ముడుత పర్వతాల్లో హిమాలయాలు అన్నింటికంటే చివరగా ఏర్పడ్డాయి. కాబట్టి వీటిని ‘అతి తరుణ(నవీన) ముడుత పర్వతాలు’ అంటారు. ఈ పర్వతాలు అవక్షేప శిలలు ముడుతలు పడటం వల్ల టెర్షియరీ మహాయుగంలో(6 కోట్ల సంవత్సరాల క్రితం) ఏర్పడ్డాయి. ఇవి అవిచ్ఛిన్న సమాంతర శ్రేణులుగా వ్యాపించి ఉన్నాయి. హిమాలయాలు జమ్మూ - కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భారతదేశ ఉత్తర సరిహద్దులుగా ఉన్నాయి.సుమారు 2400 కి.మీ. పొడవున ఒక చాపం లా సింధునది, సాంగ్‌పో - బ్రహ్మపుత్ర నదుల గార్జిల మధ్య ‘వాయవ్య - ఆగ్నేయ’ దిశగా వ్యాపించాయి.వీటి విస్తీర్ణం సుమారు 5 లక్షల చ.కి.మీ., వెడల్పు కాశ్మీర్‌లో 500 కి.మీ., అరుణాచల్‌ప్రదేశ్‌లో 200 కి.మీ.
 
ఈ పర్వతాలను ఉత్తర, దక్షిణాలుగా మూడు సమాంతర శ్రేణులుగా విభజించవచ్చు. అవి..
 1.    ఉన్నత హిమాలయాలు (హిమాద్రి)
 2.    మధ్య హిమాలయాలు (హిమాచల్)
 3.    పర్వత పాద హిమాలయాలు (శివాలిక్ కొండలు)
 
ఉన్నత హిమాలయాలు:
వీటికి హిమాద్రి, అత్యున్నత, లోపలి హిమాలయాలనే పేర్లున్నాయి. ఇవి శ్రేణులన్నింటిలో అత్యున్నత, అతి ఉత్కృష్ట, అవిచ్ఛిన్నమైనవి. వీటి సరాసరి ఎత్తు సుమారు 6100మీ. ఇవి గ్రానైట్, షిస్ట్, నీస్‌ల వంటి స్ఫటికాకార రూపాంతర శిలలతో ఏర్పడ్డాయి. ఇక్కడ ప్రపంచంలో అతి ఎత్తయిన శిఖరాలున్నాయి.
ఈ పర్వత శ్రేణిలో ఉన్న ‘మౌంట్ ఎవరెస్ట్’ (8848మీ.)  ప్రపంచంలోనే అతి ఎత్తయింది. ఇది నేపాల్ దేశంలో ఉంది. దీన్నే ‘సాగర్ మాతా’ అని కూడా అంటారు.
•  ప్రపంచంలో మూడో ఎత్తయిన శిఖరం కాంచనగంగా (8598మీ.) ఈ శ్రేణిలోనే ఉంది. ఇది సిక్కిం రాష్ర్టంలో ఉంది.
వీటితోపాటు మరికొన్ని ఎత్తై శిఖరాలు... మకాలు (8481మీ.), ధవళగిరి (8177మీ.), మనస్లూ (8156మీ.), చోఓయు (8153మీ.). హిమాద్రికి ఉత్తరంగా ‘ట్రాన్‌‌స - హిమాలయ మండలం’ ఉంది. ఈ మండలంలో జస్కార్, కారకోరం, లడక్, కైలాస్, కున్‌లున్, హిందూకుష్, పామీర్ పర్వత శ్రేణులున్నాయి.
కాశ్మీర్‌కు వాయవ్యంగా ప్రముఖ ‘కారకోరం’పర్వతశ్రేణి ఉంది.
ఈ శ్రేణిలో ప్రపంచంలో రెండో ఎత్తయిన శిఖరం ఓ2 (గాడ్విన్ ఆస్టిన్) ఉంది. దీని ఎత్తు  8611మీ. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉంది. దీంతోపాటు ప్రపంచంలో అతి పొడవైన హిమనీ నదం ‘సియాచిన్’ ఉంది.
ప్రపంచంలో అతి ఎత్తయిన ‘పామీర్ పీఠభూమి’ (ప్రపంచ పైకప్పు), ప్రముఖ నదులకు జన్మస్థానమైన ‘మానస సరోవరం’ కూడా ట్రాన్‌‌స హిమాలయ మండలంలోనే ఉన్నాయి.
 
మధ్య హిమాలయాలు:
వీటికి హిమాచల్, నిమ్న హిమాలయాలు అని కూడా పేర్లు ఉన్నాయి. ఇవి హిమాద్రికి దక్షిణంగా ఉండి అతి దట్టమైన, కఠిన పర్వత వ్యవస్థను కలిగి ఉన్నాయి. వీటి ఎత్తు 1,000 నుంచి 4,500మీ., వెడల్పు 60 నుంచి 80 కి.మీ.
వీటిలో కాశ్మీర్‌లోని ‘పిర్ పంజాల్ పర్వత శ్రేణి’ అతి పొడవైంది(400 కి.మీ.). దీని సగటు ఎత్తు సుమారు 4000 మీ.
హిమాద్రి, పిర్ పంజాల్ శ్రేణుల మధ్య ప్రఖ్యాతి చెందిన ‘కాశ్మీర్ లోయ’ ఉంది. ఈ లోయలో ఊలర్, ధాల్ సరస్సులు ఉన్నాయి.
కృష్ణగంగ, జీలం, చీనాబ్ నదులు పిర్ పంజాల్ పర్వత శ్రేణిని ఖండించుకుంటూ కాశ్మీర్‌లో ప్రవేశిస్తున్నాయి.
పిర్‌పంజాల్ పర్వత శ్రేణిలోని నైరుతి భాగాన్ని ‘ధౌల్‌ధార్ శ్రేణి’ అంటారు.
వేసవి విశ్రాంతి స్థావరాలైన సిమ్లా, కులు, కాంగ్రా లోయలు ఇక్కడే ఉన్నాయి. ఇవి పండ్లతోటలకు ప్రసిద్ధి చెందాయి.
హిమాచల్ పర్వత శ్రేణుల్లో 1500 నుంచి
2000మీ. ఎత్తులో సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, ఛక్రాటి, రాణిఖేట్ వంటి అనేక వేసవి విశ్రాంతి స్థావరాలు ఉన్నాయి.
ఈ పర్వత శ్రేణిలో సతతహరిత అరణ్యాలకు చెందిన ఓక్, శృంగాకార అడవులు ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, నేపాల్ ఈ పర్వత శ్రేణుల్లోనే ఉన్నాయి.
 
పర్వత పాద హిమాలయాలు:
వీటిని శివాలిక్ శ్రేణులు, బాహ్య హిమాలయాలు, హిమాలయ పాదగిరులు అని కూడా అంటారు. ఇవి తక్కువ ఉన్నతి ఉండి హిమాచల్ శ్రేణికి దక్షిణంగా ఉన్నాయి. వీటి ఎత్తు 600 - 1500 మీ.
ఈ శ్రేణులు జమ్మూ - కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉన్నాయి.
వీటిని జమ్మూ ప్రాంతంలో జమ్మూ కొండలని, అరుణాచల్‌ప్రదేశ్‌లో మిస్మి కొండలని అంటారు.
ఈ కొండలు హిమాలయ నదుల క్రమక్షయం వల్ల ఏర్పడిన ఇసుక, గ్రావెల్, కంగ్లామరేట్ వంటి తృతీయ మహాయుగపు అవక్షేప శిలతో కూడి ఉన్నాయి.
హిమాచల్ పర్వతాలను, శివాలిక్ కొండలను వేరు చేస్తూ ఉన్న దైర్ఘ్య లోయలను ‘డూన్’లు అంటారు.
డూన్ లోయల్లో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, పాట్లిడూన్, జమ్మూలోని కోట్లీడూన్ ప్రముఖమైనవి.
ఈ కొండలపై ఆయన రేఖా మండల తేమతో కూడిన ఆకురాల్చే అడవులున్నాయి.
 
హిమాలయాలను తూర్పు, పడమరలుగా నాలుగు విభాగాలుగా విభజించవచ్చు. అవి..
     1. పంజాబ్ హిమాలయాలు
     2. కుమాన్ హిమాలయాలు
     3. నేపాల్ హిమాలయాలు
     4. అస్సాం హిమాలయాలు
 
పంజాబ్ హిమాలయాలు:
ఈ పర్వత భాగం 560 కి.మీ. పొడవు కలిగి, సింధూ, సట్లెజ్ నదుల మధ్య విస్తరించి ఉంది.
ఇందులో కారకోరం, లడక్, జస్కార్, పిర్ పంజాల్ హిమాలయ శ్రేణులు ఉన్నాయి.
ఈ పర్వత ప్రాంతాలు పెద్ద హిమనీ నదాలైన సియాచిన్, బెలుస్తాన్‌లకు ప్రసిద్ధి.
 
కుమాన్ హిమాలయాలు:
ఈ పర్వత భాగం 320 కి.మీ. పొడవుతో సట్లెజ్, కాళి నదుల మధ్య విస్తరించి ఉంది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కుమాన్ హిమాలయ పర్వత ప్రాంతాల్లోనే విస్తరించి ఉన్నాయి.
గంగోత్రి, యమునోత్రి హిమనీ నదాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
నందాదేవి(7817మీ.) అనే శిఖరం ఈ శ్రేణుల్లో ఉంది.
     
నేపాల్ హిమాలయాలు:
ఈ పర్వత భాగం 800 కి.మీ. పొడవు కలిగి ఉంది. ఇది కాళి, టీస్తా నదుల మధ్య విస్తరించింది.
ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ, నేపాల్‌లోనూ విస్తరించింది.
•  హిమాలయాల్లో ఎత్తయిన శిఖరాలు ‘మౌంట్ ఎవరెస్ట్, కాంచన గంగా, అన్నపూర్ణ మొదలైనవి ఈ శ్రేణిలోనే ఉన్నాయి.

అస్సాం హిమాలయాలు:
ఈ పర్వత భాగం 720 కి.మీ. పొడవు కలిగి, టీస్తా, బ్రహ్మపుత్ర నదుల మధ్య వ్యాపించి ఉంది. ఇది తక్కువ ఎత్తు కలిగి ఉంది.
ఈ పర్వత శ్రేణులను పూర్వాంచల్ పర్వతాలు అని కూడా అంటారు.
హిమాలయాలు సంవత్సరంలో ఎక్కువ రోజులు మంచుతో కప్పి ఉన్నప్పటికీ జొజిలా (కాశ్మీర్), షిప్పికిలా (హిమాచల్ ప్రదేశ్), నాథూలా (సిక్కిం), బొమ్మిడిలా (అరుణాచల్ ప్రదేశ్) కనుమలు ఎత్తు ప్రాంతంలో ఉన్న ప్రధాన రహదారులుగా విరసిల్లాయి.
 
మాదిరి ప్రశ్నలు
 1.    ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ ఏ ప్రాంతంలో ఉంది?
     1) హిమాద్రి - హిమాచల్‌ల మధ్య
     2) హిమాచల్ - శివాలిక్‌ల మధ్య
     3) శివాలిక్ - హిమాచల్‌ల మధ్య
     4) హిమాద్రి - పిర్ పంజాల్‌ల మధ్య
 
2.    హిమాలయాల్లోని ఏ భాగంలో శృంగాకార అరణ్యాలు పెరుగుతున్నాయి?
     1) హిమాచల్ హిమాలయాల్లో
     2) హిమాద్రి హిమాలయాల్లో
     3) శివాలిక్ హిమాలయాల్లో
     4) హిందూకుష్ పర్వతాల్లో
 
3.    ‘నాథూలా, జీలప్‌లా’ కనుమలు ఏ రాష్ర్టంలో విస్తరించి ఉన్నాయి?
     1) జమ్మూ-కాశ్మీర్  2) ఉత్తరాంచల్
     3) సిక్కిం       4) అరుణాచల్ ప్రదేశ్
 
4.    ‘హిమాలయ పర్వత పాదాలు’ అని ఏ భాగాన్ని పిలుస్తారు?
     1) శివాలిక్ కొండలు
     2) హిమాచల్ హిమాలయాలు
     3) ఆరావళి పర్వతాలు
     4) జస్కర్ పర్వతాలు
 
5.    ఓ2 శిఖరం ఏ పర్వతాల్లో విస్తరించి ఉంది?
     1) హిమాలయాలు    
     2) పూర్వాంచల్ పర్వతాలు
     3) కారకోరమ్ పర్వతాలు
     4) హిందూకుష్ పర్వతాలు
 
6.    ప్రపంచంలో అతి ఎత్తయిన పీఠభూమి?
     1) దక్కన్ పీఠభూమి
     2) మాల్వా పీఠభూమి
     3) పామీర్ పీఠభూమి
     4) లావా పీఠభూమి
 
7.    ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానాన్ని ఏమంటారు?
     1) టెరాయి    2) భంగర్
     3) భాబర్    4) ఖాదర్
 
8.    సుందర వనాలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?
     1) పంజాబ్    2) ఉత్తరప్రదేశ్
     3) పశ్చిమ బెంగాల్    4) రాజస్థాన్
 
9.    హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏ హిమాలయాల్లో విస్తరించి ఉన్నాయి?
     1) పంజాబ్ హిమాలయాలు
     2) కుమాన్ హిమాలయాలు
     3) నేపాల్ హిమాలయాలు
     4) అస్సాం హిమాలయాలు
 
సమాధానాలు
 1) 4;    2) 1;    3) 3;    4) 1;    5) 3;
 6) 3;    7) 2;     8) 3;    9) 2;    
 
 
గతంలో అడిగిన ప్రశ్నలు
1.    కింది వాటిలో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.    (ఎస్సై-2012)
     1) కుమాన్ హిమాలయాలు - ఇండస్, సట్లెజ్‌ల మధ్య
     2) నేపాల్ హిమాలయాలు - కాళి, టీస్తాల మధ్య
     3) పంజాబ్ హిమాలయాలు - టీస్తా, బ్రహ్మపుత్రల మధ్య
     4) అస్సాం హిమాలయాలు - సట్లెజ్, కాళి మధ్య
 
2.    ఉత్తర హిమాలయ పర్వత గోడ పొడవు సుమారుగా?    (డిప్యూటీ జైలర్‌‌స - 2012)    
     1) 1400 కి.మీ.    2) 3400 కి.మీ.
     3) 2400 కి.మీ.    4) 4400 కి.మీ.
 
3.    కింది వాటిలో అత్యంత చిన్న వయసు ఉన్న పర్వతం?    (డిప్యూటీ జైలర్‌‌స - 2012)    
     1) ఆరావళి    2) నీలగిరి
     3) హిమాలయాలు    4) వింధ్య
 
4.    ప్రపంచంలో అతి ఎత్తయిన శిఖరం ఏది?
     (కానిస్టేబుల్- 2009)
     1) ఓ2        2) ఎవరెస్ట్ శిఖరం    
     3) కంచన్‌జంగ్    4) నందాదేవి
 
సమాధానాలు
 1) 2;    2) 3;    3) 3;    4) 2.
 

కాంపిటీటివ్ కౌన్సెలింగ్
కానిస్టేబుల్ పరీక్షలో ‘భారతదేశ నైసర్గిక స్వరూపం’ పాఠ్యాంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
 - ఉమేశ్ యాదవ్, హైదరాబాద్
భారతదేశ భూగోళ శాస్త్రంలో ‘నైసర్గిక స్వరూపాలు’ విభాగానికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. దీనిలోని హిమాలయాలు, గంగా - సింధు మైదానాలకు సంబంధించి ప్రతి పరీక్షలో కనీసం 1, 2 ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. కాబట్టి దీనిలోని ప్రధాన అంశాలైన హిమాలయాల పొడవు, వాటిలోని సమాంతర శ్రేణులు, ఆ శ్రేణుల్లో ఎత్తయిన శిఖరాలు, కనుమలు, లోయలు, మైదానాలు, దానిలోని భూ స్వరూపాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. అలాగే గతంలో వచ్చిన ప్రశ్నల సరళిని పరిశీలిస్తూ మాదిరి ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా ఈ విభాగం నుంచి మంచి మార్కులు సాధించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement