ఓసీలు 76, ఎస్సీలు 36, ఎస్టీలు 10 మంది
అన్ని వర్గాల నుంచి 112 మంది మహిళలు
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు ఎక్కువగా పోటీ చేస్తున్నారు. మహిళల సంఖ్య కూడా అధికంగా ఉంది. 63 జెడ్పీటీసీ స్థానాలుండగా అందులో 32 స్థానాలు మహిళలు, 31 స్థానాలు పురుషులకు కేటాయించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల పరంగా ఎస్సీలకు 10, ఎస్టీలకు 3, బీసీలకు 19, జనరల్‌కు 31 స్థానాలు కేటాయించారు. 63 స్థానాలకు ఎన్నికల బరిలో 239 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. రిజర్వ్ అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల్లో ఆ వర్గాలే పోటీ చేస్తుండగా కొన్ని చోట్ల జనరల్‌కు కేటాయించిన స్థానాల్లో ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తమ్మీద 239 మందిలో బీసీలు అత్యధికంగా 120 మంది ఉండగా.. ఓసీ అభ్యర్థులు 73 మంది బరిలో ఉన్నారు. ఎస్సీ అభ్యర్థులు 36 మంది, ఎస్టీకి చెందిన వారు 10 మంది పోటీ చేస్తున్నారు. సగం స్థానాలకు మహిళలకు కేటాయించడంతో వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
112 మంది మహిళలు పోటీ పడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ తరపున అభ్యర్థులు పోటాపోటీగా అభ్యర్థులను రంగంలోకి దింపారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీల నుంచి నామమాత్రంగా బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు 55 మంది పోటీలో ఉండటంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల విజయాలను తారుమారు చేసే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులకు స్వతంత్రుల బెడద పట్టుకుంది. మొత్తమ్మీద జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు మెజార్టీ స్థానాలపై వైఎస్సార్‌సీపీ కన్నేయగా, టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం అభ్యర్థులు కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.