మెజారిటీ భారతీయుల మనోగతం
78 శాతం మంది మద్దతు మోడీకే
ఓ అమెరికన్ సంస్థ సర్వే
న్యూఢిల్లీ: నానాటికీ దిగజారుతున్న దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సగటు భారతీయుడు అసంతృప్తిగా ఉన్నాడు. దేశ నాయకత్వంలో మార్పును కోరుకుంటన్నాడు. సార్వత్రిక ఎన్నికల వేళ ఓ అమెరికన్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో తేలిన విషయమిది. ప్రముఖ అధ్యయనసంస్థ ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ చేపట్టిన ఈ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 70 శాతం మంది.. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అసమానతలే భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలుగా అత్యధిక మంది అభిప్రాయపడ్డారు. అలాగే ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే రావాలని, ఆ పార్టీ నేత నరేంద్ర మోడీనే ప్రధాని కావాలని 78 శాతం మంది కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి 50శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. కాగా, బీజేపీ పట్ల 63 శాతం మంది సానుకూలంగా ఉండగా.. కాంగ్రెస్‌కు 19 శాతం మంది అండగా నిలిచారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక పోషిస్తాయని సర్వే సంస్థ వెల్లడించింది. ఇక భవిష్యత్తులో దేశ ఆర్థిక రంగం బలోపేతమవుతుందని అత్యధికులు విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. గత డిసెంబర్-జనవరిలో జరిపిన ఈ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 2,464 మందితో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించినట్లు ప్యూ రీసెర్చ్ సంస్థ మంగళవారం పేర్కొంది.
దేశ నాయకత్వం మారాలి
Published Wed, Apr 2 2014 2:25 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement