పార్టీ ఏదైనా.. జెండా సిరిసిల్లదే | All party flags to be manufactured from Sircilla | Sakshi
Sakshi News home page

పార్టీ ఏదైనా.. జెండా సిరిసిల్లదే

Published Wed, Apr 2 2014 1:11 AM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM

పార్టీ ఏదైనా.. జెండా సిరిసిల్లదే - Sakshi

పార్టీ ఏదైనా.. జెండా సిరిసిల్లదే

పార్టీ జెండాల ప్రింటింగ్‌లో కార్మికులు బిజీబిజీ
ఎన్నికల వేళ కార్మికులకు చేతినిండా పని రూ.కోట్లలో వ్యాపారం

 
సాంచాల చప్పుళ్లు.. చేనేత కార్మికుల ఆకలి కేకలు వినిపించే సిరిసిల్లలో ఎన్నికలప్పుడు మాత్రం సందడి నెలకొంటుంది. జెండా, ఎజెండాతో ప్రమేయం లేకుండా సిరిసిల్ల లోగిళ్లన్నీ వివిధ పార్టీల జెండాలు, కండువాలు, బ్యానర్లతో నిండిపోతాయి. ఎన్నికల ప్రచార వస్త్రోత్పత్తికి కేంద్రంగా నిలుస్తున్న ఈ ప్రాంతంలో తయారయ్యే పార్టీ జెండాలు ఎన్నికల వేళ రెపరెపలాడుతుంటాయి.  
 
 మూడున్నర దశాబ్దాలుగా..
 రామ్ బలరామ్ స్క్రీన్ ప్రింటర్స్ వారు తొలిసారిగా 1978లో రంగురంగుల పార్టీ జెండాలను ముద్రించడం ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సిరిసిల్లలో సందడే సందడి. ప్రస్తుతం ఇక్కడ ఇటువంటి పరిశ్రములు పది వరకు ఉన్నాయి. బ్యానర్లపై పార్టీ గుర్తులే కాకుండా అభ్యర్థుల పేర్లు, నినాదాలు కూడా ముద్రిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీఎస్పీ.. ఇలా ఏ పార్టీ జెండా తయారీకైనా సిరిసిల్లే కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
 
రూ. కోట్లలో వ్యాపారం
 ఇక్కడ ఉత్పత్తయ్యే పాలియెస్టర్ వస్త్రాన్ని మొదట ఆయా పార్టీల రంగుల్లో ప్రాసెసింగ్ చేస్తారు. కాంగ్రెస్ మూడు రంగుల జెండాలను మాత్రం హైదరాబాద్‌లో ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఈ పరిశ్రమలపై ఆధారపడి 250 మంది కార్మికులు ఉపాధి పొందుతుండగా మిషన్లపై జెండాలు కుట్టే పనిలో మరో వెయ్యిమంది మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఒక్కో బ్యానర్‌కు సైజును బట్టి రూ.35 నుంచి రూ.100 వరకు ఉంటుంది. కండువా, జెండాలకు రూ.ఐదు చొప్పున, టోపీలకు రూ.ఏడు నుంచి రూ.పది వరకు వసూలు చేస్తున్నారు. పదివేల తోరణాల జెండాలకు రూ.2500 తీసుకుంటున్నారు. మొత్తంగా ఎన్నికల సీజన్‌లో రూ.నాలుగు కోట్ల మేర వ్యాపారం సాగుతున్నట్టు ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. బహిరంగ సభల్లో వినియోగించే భారీసైజు బ్యానర్లు సైతం ఇక్కడే ముద్రితమవుతున్నాయి.  
 
 ‘కోడ్’ కూసినా నష్టమే

 ప్రింటింగ్ పూర్తయిన జెండాలు, బ్యానర్లు తదితర వాటిని రవాణా చేసే సమయంలో ఎన్నికల కోడ్ అమలు వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల్లో వీటిని చూపకపోవడం వల్ల రవాణా సమయంలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభ్యర్థులకు ఉద్దెర(అరువు)గా సరఫరా చేస్తే ఒక్కోసారి మొదటికే మోసం వస్తోంది. జెండాలు ఇచ్చి ఎన్నికల తరువాత డబ్బుల కోసం వెళితే.. గెలిచిన వారు దొరకక, ఓడినవారు ముఖం చాటేస్తుండడంతో మునిగిపోతున్నారు.
 
 నిండా ముంచిన ‘పీఆర్పీ’

 చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ప్రజాచైతన్య యాత్రకు సిరిసిల్ల నుంచే శ్రీకారం చుట్టడంతో వ్యాపారం జోరుగా సాగుతుందని ఇక్కడి వ్యాపారులు ఆ పార్టీ జెండాలు, కండువాలను భారీగా తయారుచేశారు. అయితే ఆ తర్వాత పీఆర్పీ కాస్తా కాంగ్రెస్‌లో విలీనం కావడంతో వ్యాపారులు రూ.లక్షల్లో నష్టపోయారు. ఓ వ్యాపారి అయితే ఐపీ కూడా దాఖలు చేశారు.      - న్యూస్‌లైన్, సిరిసిల్ల
 
 బ్యానర్లకు గిరాకీ తగ్గింది
 ఎన్నికల సీజన్‌లో గతంతో పోలిస్తే వ్యాపారం తగ్గింది. ఫ్లెక్సీల ప్రింటింగ్‌తో గిరాకీ పూర్తిగా పడిపోయింది. కండువాలు, జెండాలు, టోపీల వ్యాపారమే జరుగుతోంది. మూడు దశాబ్దాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నాం కాబట్టి నాయకులు ముందే మమ్మల్ని సంప్రదిస్తారు. ఈసారైనా వ్యాపారం బాగుంటుందని ఆశిస్తున్నాం.
     - అన్నల్‌దాస్ రాజు, వ్యాపారి  
 
 ‘రికార్డు’ ఎమ్మెల్యే
 వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం ఏర్పడి 57 ఏళ్లు పూర్తికాగా అందులో 27ఏళ్ల పాటు కమ్యూనిస్టు నేత, దివంగత మద్దికాయల ఓంకార్ ఒక్కరే ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 1972, 1978, 1983, 1985, 1989 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించిన ఆయన 1994లో టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి చేతిలో 87ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ టైగర్‌గా గుర్తింపు పొందిన ఓంకార్ సీపీఎం నుంచి మూడుసార్లు గెలుపొందగా తర్వాత ఎంసీపీఐ పార్టీ స్థాపించి మరో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.     - న్యూస్‌లైన్, నర్సంపేట
 
 కొంపముంచిన ‘విమానం’

 ఒక్కోసారి గుర్తులు అభ్యర్థుల జాతకాలను తారుమారుచేస్తాయి. 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు టీడీపీలో ఉన్నారు. అయితే టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా మెట్‌పల్లి అసెంబ్లీ సీటును బీజేపీ అభ్యర్థికి కేటాయించారు. దీంతో మెట్‌పల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విద్యాసాగర్‌రావు బరిలోకి దిగారు. ఇదే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మామిడిపల్లి గంగారాజం పోటీకి దిగారు. వీరిద్దరికీ ఎన్నికల గుర్తుగా విమానం కేటాయించారు. రెండు ఎన్నికలు ఒకేసారి కావడం, గుర్తు కూడా ఒకటే కావడంతో చాలామంది ఓటర్లు విద్యాసాగర్‌రావుకు వేస్తున్నామనుకుని గంగారాజానికి ఓట్లేశారు. ఫలితంగా విద్యాసాగర్‌రావు ఐదువేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇలా విమానం గుర్తు విద్యాసాగర్‌రావును రాజకీయంగా ఐదేళ్లు వెనక్కి నెట్టింది.     
- న్యూస్‌లై న్, కోరుట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement