వైఎస్ షర్మిల
పులివెందుల: తమ ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తూ జనాలతో ఆడుకుంటారా? అని సబ్బం హరిని ఉద్దేశించి వైఎస్ఆర్ సిపి నాయకురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈ ఉదయం ఆమె తన వదిన భారతితో కలసి పులివెందులలో ఓటు వేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి రాష్ట్రం విడిపోదని చెబుతూ వచ్చారని విమర్శించారు. ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. ఆ తరువాత క్లీన్ బౌల్డ్ అయి చెప్పుల పార్టీ ఒకటి పెట్టారన్నారు.
వారికి విశ్వసనీయతలేదని, అందుకే సబ్బం హరి పోటీ నుంచి విరమించుకొని బిజెపికి మద్దతు అంటున్నరని విమర్శించారు. బిజెపి లేకపోతే టిడిపికి మద్దతు అంటారు. ఏమనుకుంటున్నారు వారు? జనంతో ఆడుకుంటారా? అని మండిపడ్డారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసని చెప్పారు.
జనం స్పందన బ్రహ్మాండంగా ఉందన్నారు. రాజశేఖర రెడ్డి గారిలో విశ్వసనీయతను చూశారు. అదే విశ్వసనీయతను జగన్మోహన రెడ్డిలో చూస్తున్నారని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వందమందిని వేసుకొచ్చినా ఆయనకు విశ్వసనీయత లేదన్నారు. జనం ఆయనను నమ్మరని చెప్పారు. ఓటర్లు చాలా కసిగా ఉన్నారని, వారు కసిగా ఓటువేస్తారని చెప్పారు.
తెలుగుదేశం వారి వద్ద గొట్టం పెడితే 175 స్థానాలు తమవే అంటారు.