జైట్లీ ఆస్తులు రూ. 113 కోట్లు
అమృత్‌సర్/న్యూఢిల్లీ: పంజాబ్‌లోని అమృత్‌సర్ లోక్‌సభ స్థానానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో తనకు రూ. 113.02 కోట్ల ఆస్తులున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటిలో రూ. 75 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా చరాస్తుల్లో రూ. 1.02 కోట్ల విలువైన పోర్ష్ కారు, రూ. 78.89 లక్షల విలువైన మెర్సిడిజ్ బెంజ్ కారు, రూ. 85.57 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారు, రూ. 20.44 లక్షల విలువైన హోండా అకార్డ్ కారు, రూ. 23.28 లక్షల విలువైన టొయోటా ఫార్ట్యూనర్ కారు ఉన్నాయి.
అలాగే ఆయనకు బ్యాంకులో నగదు రూ. 18.01 కోట్లు, చేతిలో నగదు రూ. 1.35 కోట్ల నగదు, రూ. 2 కోట్ల విలువైన బాండ్లు, రూ. 1.88 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. కాగా, కేంద్ర మంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ప్రణీత్‌కౌర్‌తోపాటు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అంబికా సోని తదితరులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో సోని తన ఆస్తులను రూ. 117.99 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.