అదొక చీకటి ఆధ్యాయం. జనజీవనాన్ని అధోగతి పాల్జేసిన బాబు శకం. ఉద్యోగాల్లేవు, కరెంటు లేదు, పింఛన్లు అందవు, రుణాలు ఇవ్వరు.. ఇలా ఒకటేమిటి ప్రతి రంగం.. ప్రతి వర్గమూ బాబుగారి చీకటి పాలన బాధితులే.. అప్పుడు ఏమీ ఇవ్వని చంద్రబాబు.. ఎన్నికల తరుణంలో అన్నీ ఇచ్చేస్తానంటూ మభ్యపెడుతున్నారు. అయితే విజ్ఞులైన ఓటర్లు ఆయన మాటలు నమ్ముతారా?.. చేదు జ్ఞాపకాలను మరిచిపోయారా??.. అంటే లేదు.. లేదనే సమాధానం వస్తోంది. ఆనాటి గాయాలను ఎలా మరచిపోతాం.. బాబుగారి డాబుసరి మాటలను ఎలా నమ్ముతామని ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆనాడు చితికిపోయిన జనం గళ మే.. ఈ ‘బాబు కాలం’..
బాబు పాలనలో రైతులకు అన్యాయం
చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా మాకు తీరని అన్యాయం చేశారు. ఆయన పాలనలో పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, వ్యవసాయానికి విద్యుత్ రాయితీ కూడా లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కనీసం స్పందించే వారు కాదు. విత్తనాలు కూడా దొరికేవి కావు. ఇప్పుడేమో రెతులకు రుణ మాఫీ చేస్తానంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు రుణ మాఫీ చేస్తానంటే ఎలా నమ్మగలం.. నమ్మశక్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
-కింతలి ఆదినారాయణ, రైతు, ఎస్‌ఎం పురం
రైతు ఆత్మహత్యలకు కారకుడు
హైటెక్ మోజులో పడిన చంద్రబాబు తన పాలనలో రైతులు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. రైతుల కష్టాలు, అవసరాలు ఏమాత్రం పట్టించుకోకుండా వారిని ఆత్మహత్యలకు పురిగొల్పిన ఘనుడు. వ్యవసాయానికి విద్యుత్ అడిగితే తీగలపై బట్టలు ఆరేసుకోమన్న రైతుద్రోహి. తీరా ఇప్పుడు రుణమాఫీ అంటూ లేనిపోని హామీలు ఇస్తే మళ్లీ మోసపోయేందుకు రైతులు సిద్ధంగా లేరు. ఆనాడు వ్యవసాయం దండుగ అన్న వ్యక్తి ఇప్పుడు వ్యవసాయాన్ని అదుకుంటానని ఎలా చెబుతున్నారు?
-వి.పోలారావు, రైతు, పెద్దపాలెం
అది రాక్షస పాలన
ఆ తొమ్మిదిన్నరేళ్లు రాక్షస పాలన సాగింది. బాబు హయాంలో పింఛను కావాలంటే తెలుగుదేశం కార్యకర్తవా అని అడిగేవాళ్లు. ఇచ్చిన పింఛను రూ.70 కూడా ఏ మూడు నాలుగు నెలలకో ఇచ్చేవారు. ఏది మంజూరు చేయాలన్నా ముడుపులు చెల్లించాల్సి వచ్చేది. ఇక మత్స్యకారులు సముద్ర వేటలో మరణిస్తే రూ.50 వేల నష్ట పరిహారం తప్ప ఇతరత్రా ఆదుకునే చర్యలు లేవు. సంక్షేమం పూర్తిగా నీరుగారింది. అటువంటి రాక్షస పాలనను మళ్లీ ఎవరు కోరుకుంటారు. జగన్‌మోహన్‌రెడ్డి మ్యానిఫెస్టో చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది.
-వంక రాజు, మంచినీళ్లపేట, వజ్రపుకొత్తూరు మండలం