ఇదేం ‘దారిదోపిడీ’!
' ఎన్నికల వేళ పోలీసుల హడావుడి
' తనిఖీల్లో ఎడాపెడా నగదు స్వాధీనం
' సామాన్యుల హడల్
శ్రీరంగం కామేష్: మీరు అవసరార్థం డబ్బు తీసుకెళ్తున్నారా...? అధిక మొత్తంలో నగదు తీసుకెళ్తున్నారా...! అయితే తస్మాత్ జాగ్రత్త..! మీ డబ్బుకు కాళ్లొచ్చేసినట్టే...! పోలీసులకు లేదా ఐటీ అధికారులకు సరెండర్ అయిపోవాల్సిందే..! లేదా మీడియాలో నేరస్తుడిలా ముద్రపడాల్సిందే..! ఏంటీ డబ్బు తీసుకెళ్లడం అంతనేరమా...! అని ఆశ్చర్యపోవద్దు...ఇది ఎన్నికల వేళ కదా...!
‘ఏదైనా క్రిమినల్ కేసుకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న, అరెస్టు చేసిన నిందితుడిని దోషిగా తేలేవరకు మీడియా ముందుకు తీసుకురాకూడదు’ అని న్యాయ నిపుణులు, మానవహక్కుల సంఘాలు పదేపదే స్పష్టం చేశాయి. కానీ ఇదేమీ పోలీసులకు పట్టదు. వారు చెప్పిందే చట్టం.
దోషులుగా నిర్ధారణ కాకపోయినా కనీసం నేరం చేసినట్టు ప్రాథమిక ఆధారాలుంటేనే మీడియా ముందుకు తెస్తారు. అందుకు భిన్నంగా ఎన్నికల బందోబస్తులో భాగంగా పోలీసులు నిర్వహిస్తున్న సోదాల్లో డబ్బు, నగలు వంటివి ఏమైనా పట్టుబడితే చాలు... ఎందుకు...ఏమిటీ...! అనే వివరాలతో సంబంధం లేకుండా ఆధారాలు చూపలేదనే సాకుతో వెంటనే స్వాధీనం చేసుకోవడం, సదరు వ్యక్తిని మీడియా ముందు ప్రవేశపెట్టడం సాధారణం అయిపోయింది. నిబంధనల ప్రకారం రూ.50 వేల వరకు వెంట తీసుకువెళ్లే అవకాశం ఉన్నా... పోలీసుల నుంచి ‘శల్యపరీక్షలు’ ఎదుర్కొనకతప్పట్లేదు. దీంతో వ్యాపారులు, సామాన్యులు కూడా హడలిపోతున్నారు.
ఇదేం వైఖరి..?
అది లెక్కల్లేని సొమ్మని తేలకుండానే ఐటీ అధికారులకు అప్పగించేయడం కూడా పలువురిని బాధితులుగా మారుస్తోంది. అత్యవసర సందర్భాల్లో అప్పటికప్పుడు ఆధారాలు చూపలేకపోయినా, తర్వాత నిరూపించగలుగుతున్నపుడు ముందే తమను దోషులుగా ప్రచారం చేయడమేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి రోజూ తమ పని తీరును వివరిస్తూ పంపే రిపోర్టులు (డీఎస్‌ఆర్) నింపుకోవడం కోసమే పోలీసులు ఈ హంగామా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నారు.
పట్టుబడింది రూ. 90 కోట్ల పైనే...
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయకుండా అక్రమ మద్యం, నగదు తరలింపులకు అడ్డుకట్ట వేయడానికే ఈ సోదాలు. ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం రూ. 90 కోట్లకు పైగానే ఉంది. దీనికి అదనంగా భారీ స్థాయిలో బంగారం, వెండి సైతం స్వాధీనం చేసుకున్నారు. భారీగా నగదు తరలిస్తున్న వ్యక్తులు దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పకపోతే స్వాధీనం చేసుకునే అధికారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 102 సెక్షన్ ప్రకారం పోలీసులకు ఉంది. ఆదాయపుపన్ను శాఖ అధికారులైతే ఇన్‌కంట్యాక్స్ యాక్ట్‌లోని 132 సెక్షన్ కింద స్వాధీనం చేసుకుంటారు. సదరు అనుమానితులు ఆ సొమ్ముకు లెక్కచూపిస్తే పన్ను మొత్తం మినహాయించుకుని మిగిలింది వారికి తిరిగి అప్పగిస్తారు. ఇది చట్టం చెప్తున్న అంశమే అయినా అన్ని వేళల్లోనూ అమలు చేయరు.
రాజకీయ కోణమేదీ...
ఇలా పట్టుబడుతున్న పెద్ద మొత్తం నగదు కేసులు అత్యధిక సందర్భాల్లో అవి ఎన్నికలతోను, రాజకీయ పార్టీలతోనూ, అభ్యర్థులతోనూ ఏ రకంగా సంబంధం లేనివిగా తేలుతున్నాయి. స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి అది రాజకీయ పార్టీ, అభ్యర్థులకు సంబంధించిందని చెప్పడానికి ఇప్పటి వరకూ ఏ ఒక్క ఆధారాన్నీ చూపించలేకపోయారు. సోదాల్లో సామాన్యులే వేదనకు గురవుతున్నారు. తనిఖీల్లో చిక్కిన మొత్తాన్ని పోలీసులు ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తారు. ఆ తరవాత కేసు ఏమైందనే అంశం పోలీసులు అడగరు, ఐటీ వారు చెప్పరు. గత ఎన్నికల సందర్భంలో ఇదే జరిగింది.