కోటలో కోట్లాట | big fight to Assembly Constituency Gadwal | Sakshi
Sakshi News home page

కోటలో కోట్లాట

Published Sat, Apr 12 2014 2:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కోటలో  కోట్లాట - Sakshi

కోటలో కోట్లాట

అసెంబ్లీ నియోజకవర్గం గద్వాల

 ఎవరెన్నిసార్లు గెలిచారు:

 కాంగ్రెస్ - 6, టీడీపీ-2, జనతాపార్టీ-1, స్వతంత్రులు-3, సమాజ్‌వాదీపార్టీ-1,
 ప్రస్తుత ఎమ్మెల్యే: డీకే అరుణ (కాంగ్రెస్)
 రిజర్వేషన్: జనరల్
 
నియోజకవర్గ ప్రత్యేకతలు
: వర్గ రాజకీయం, నమ్మినవారికి అండగా నిలవడం,  రాజకీయ చైతన్యం, బీసీ ఓటర్లు అధికం ప్రస్తుతం బరిలో నిలిచింది: 19  ప్రధాన అభ్యర్థులు వీరే..  డీకే అరుణ (కాంగ్రెస్) బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (టీఆర్‌ఎస్)
 వీఎల్ కేశవరెడ్డి (బీజేపీ)
 
 మాజీ మంత్రి డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో మరోమారు కీలక పోరు జరగబోతోంది. ఇక్కడ ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా పదిసార్లు డీకే  కుటుంబ సభ్యులే ఎన్నికయ్యారు. ఆ కుటుంబం గద్వాల నుంచి మొత్తం 36 సంవత్సరాలు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించింది. డీకే సత్యారెడ్డి ఏడేళ్లు, ఆయన కుమారులు సమర సింహారెడ్డి 14 ఏళ్లు, భరత సింహారెడ్డి ఐదేళ్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. భరతసింహారెడ్డి భార్య డీకే అరుణ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో అరుణ కాంగ్రెస్ నుంచి, ఆమె మేనల్లుడు కృష్ణమోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్ నుంటి పోటీ పడుతున్నారు. గద్వాల సంస్థానానికి చెందిన వీఎల్ కేశవరెడ్డి తొలిసారిగా బీజేపీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.
 
 
1.  గద్వాలను జిల్లా చేస్తా
2.    నెట్టెంపాడులో మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తా.
3.  గద్వాల ప్రాంతంలో వెయ్యి మెగావాట్ల సోలార్, వెయ్యి మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తా.
4.   విద్యాభివృద్ధితో ఉపాధి అవకాశాల పెంచుతా
5.  జేఎన్‌టీయూ కళాశాల ఏర్పాటుకు కృషిచేస్తా
 - డీకే అరుణ
 
1.     అవినీతి లేని పాలన అందిస్తా
2.  గద్వాలను జిల్లా కేంద్రంగా చేయడానికి కృషి చేస్తా
3.  అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తా
4.    సాగునీటి వనరులను పెంచండం ద్వారా గద్వాలను ప్రగతిపథంలోకి నడిపిస్తా
5.    వైద్య సదుపాయాలు కల్పిస్తా. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చేస్తా  సేవలు అందిస్తా
 - బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
 
1.   అభివృద్ధిలో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తా
2.    పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తా. వలసలు నివారిస్తా
3.  {పతీ పల్లెకు తాగునీటిని అందిస్తా
4.    గద్వాల ప్రజలకు స్వేచ్ఛాయుత పాలన అందిస్తా
 - వీఎల్ కేశవరెడ్డి
 
మహబూబ్‌నగర్
 
జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా మారిన అరుణ 1999లో గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో కాంగ్రెస్ టికెట్ ఆశించినా దక్కక పోవడంతో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 2009లో  తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన అరుణ మంత్రిగా వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. అదే సమయంలో జిల్లా రాజకీయాల్లోనూ కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం ఎన్నికలు అరుణకు కీలకంగా మారాయి. ఆమె ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆరాట పడుతున్నారు.  వరుసగా పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండడంతో ప్రజల్లో సహజంగా ఉండే వ్యతిరేకతను చెరిపేసేందుకు అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు డీకే అరుణ బావ, మాజీమంత్రి డీకే సమరసింహారెడ్డి టీడీపీ టికెట్ ఆశించినా బీజేపీతో పొత్తు మూలంగా నిరాశ ఎదురైంది. ఇక్కడ ఈయన అనుసరించే వైఖరి కూడా కీలకం కానుంది.

 సానుభూతిపైనే టీ ఆర్‌ఎస్ ఆశ

 గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి మేనత్త చేతిలో ఘోరంగా ఓడిపోయిన కృష్ణమోహన్‌రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో సానుభూతిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుని టికెట్ దక్కించుకున్న ఆయన తెలంగాణవాదం, గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి, కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. నియోజకవర్గంలో డీకే కుటుంబాన్ని తట్టుకుని నిలబడగలిగే సత్తా తనకు మాత్రమే ఉందని ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు.

 తొలిసారిగా సంస్థాన వారసుడు

 గద్వాల సంస్థానాధీశుల కుటుంబానికి చెందిన వీఎల్ కేశవరెడ్డి తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గద్వాల సంస్థానాధీశుల కుటుంబానికి చెందిన కె.రాంభూపాల్ 1962లో ఏకగ్రీవంగా ఎన్నికైనా ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. టీడీపీ హయాంలో ఇదే కుటుంబానికి చెందిన విజయమోహన్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. సంస్థానాధీశుల వారసురాలు డాక్టర్ సుహాసినీరెడ్డి దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి సమీప బంధువు. ఆమె కుమారుడైన కేశవరెడ్డి అమెరికాలో ఉన్నత విద్య పూర్తిచేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ వ్యాపారంలో ఉన్నారు. చాలాకాలం తర్వాత రాజకీయాల్లోకి సంస్థానాధీశుల వారసుడు రావడంతో ఇక్కడి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని  విశ్లేషకులు భావిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement