కమలం... కకావికలం
* పుట్టి ముంచిన టీడీపీ పొత్తు
* బాబు చాణక్యం... ప్రచారంలో కలిసిరాని టీడీపీ
* పోలింగ్ ముంచుకొస్తున్నా ప్రచారమే సాగని వైనం
* అభ్యర్థులతో పాటు కార్యకర్తల్లోనూ గందరగోళం
గౌరీభట్ల నరసింహమూర్తి: ‘‘తెలంగాణద్రోహులంటూ మీరే తిట్టిన చంద్రబాబుతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు?’’
- తెలంగాణ తెచ్చింది తామేనంటూ అంబర్‌పేటలో ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి అడుగడుగునా ఎదురవుతున్న ప్రశ్న.
వారం క్రితం మక్తల్‌లో స్థానిక బీజేపీ నేతలతో భేటీకి ప్రయుత్నించిన మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి నాగం జనార్దనరెడ్డి, సొంత పార్టీలోని అసంతృప్తులే తనపై దాడికి దిగడంతో వెనుదిరిగారు...
తెలంగాణలో కమలనాథుల తిప్పలకు ఇవి మచ్చుతునకలు మాత్రమే. ఓవైపు పోలింగ్ తేదీ ముంచుకొస్తున్నా... బీజేపీలో మాత్రం అయోమయం, గందరగోళమే రాజ్యమేలుతున్నాయి. టీడీపీతో పొత్తే పార్టీ పాలిట పెను శాపంగా పరిణమించింది. చంద్రబాబు పార్టీ తమ పాలిట గుదిబండేనన్న వాస్తవాన్ని బీజేపీ తెలంగాణ నేతలు అనుభవపూర్వకంగా గ్రహించి విచారిస్తున్నారు. కచ్చితంగా గెలిచే అవకాశముందనుకుంటున్న స్థానాలతో సహా ఎక్కడా బీజేపీ ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్న దాఖలాలే కన్పించడం లేదు.
ఎన్నికల మేనిఫెస్టో పక్షం క్రితమే సిద్ధమైనా దాన్ని ఇప్పటిదాకా ప్రకటించలేదు. విలువైన కాలం పొత్తు చర్చల్లో కరిగిపోవడమే అందుకు కారణమంటూ బీజేపీ నేతలే మొత్తుకుంటున్నారు. మరోవైపు టీడీపీ తమ్ముళ్లేమో కలిసొచ్చేది లేదంటూ మొండికేస్తున్నారు. తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డ బాబు పార్టీ నేతలతో కలిసి వెళ్తే ఓట్లు రాలవనే భయం బీజేపీ నేతల్లోనూ ఉంది. దాంతో చాలాచోట్ల వారు ఒంటరిగానే ప్రచారం చేసుకుంటున్నారు. విలువైన సమయమంతా పొత్తు చర్చల్లోనే వృథా అయిందంటూ వాపోతున్నారు. పైగా రెండు పార్టీల మధ్య భగభగలు, రుసరుసలు నానాటికీ పెరుగుతున్నాయి.
నిజానికి తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు స్థానిక బీజేపీ శాఖ మూడు నెలల క్రితమే పక్కాగా కసరత్తు పూర్తి చేసింది. అన్ని స్థానాలకూ అభ్యర్థులను గుర్తించడమే గాక గెలుపు గుర్రాలపై అంచనాకు కూడా వచ్చింది. గెలుస్తామనుకున్న సీట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అక్కడి అభ్యర్థులను ముందస్తుగానే ప్రచారానికీ పురమాయించింది. సరిగ్గా ఆ దశలో బాబు రంగంలోకి దిగి స్వలాభం కోసం పొత్తు పేరుతో ఢిల్లీ స్థాయిలో నరుక్కొచ్చి తెలంగాణ బీజేపీ నేతల పుట్టి ముంచారు. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ బాబుతో చేయి కలిపితే తీవ్ర నష్టమంటూ వాళ్లు ఎంత మొత్తుకున్నా బీజేపీ అధినాయకత్వం వినలేదు. బలవంతపు పొత్తు దెబ్బకు బీజేపీ చివరికి కేవలం 45 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.
వ్రతం చెడ్డా దక్కని ఫలం
పొత్తు దెబ్బ చాలదన్నట్టుగా, బీజేపీ తన బలమైన స్థానాలుగా భావించిన వాటిని చాలావరకు లాగేసుకోవడం ద్వారా టీడీపీ మరింతగా దెబ్బతీసింది. అలా కనీసం 15 కీలక స్థానాలను పోటీకి ముందే బీజేపీ కోల్పోయింది. అసంతృప్తుల సహాయ నిరాకరణ, రెబెల్స్ దెబ్బ వంటి కారణాలతో ప్రచారం దాదాపుగా పడకెక్కింది. వరంగల్ జిల్లా జనగామ, నల్లగొండ జిల్లా ఆలేరుల్లో మాత్రమే బీజేపీ నేతలు ఒంటరి ప్రచారంతో కాస్త ఫర్వాలేదనిపిస్తున్నారు. దాదాపుగా మిగతా అన్నిచోట్లా ప్రత్యర్థి పార్టీల ముందు తేలిపోతున్నారు.
- మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలోని నారాయణపేట్, కొడంగల్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్ వంటి టీడీపీ సిటింగ్ అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ నేతలు బీజేపీకి ఏమాత్రం సహకరించటం లేదు. షాద్‌నగర్ టికెట్ దక్కినా అక్కడ కేడర్ బలంగా లేదు.
- భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, భువనగిరిల్లోనూ టీడీపీ నేతలు సహకరించడం లేదు.
- నిజామాబాద్ అర్బన్ స్థానంలో గతంలో గెలిచిన బీజేపీ నేత లోక్‌సభకు పోటీ చేస్తుండటంతో... ఆర్నెల్ల క్రితమే పార్టీలో చేరిన వ్యక్తికి అసెంబ్లీ టికెటిచ్చారు. దాంతోపాటు సీనియర్ల అసంతృప్తి కూడా ప్రతికూలంగా మారింది.
- వరంగల్ జిల్లాలో బీజేపీకి అంతగా బలం లేని భూపాలపల్లిని అంటగట్టారు. టీడీపీ నుంచి గండ్ర సత్యనారాయణరెడ్డిని అప్పటికప్పుడు చేర్చుకుని బీఫారం ఇచ్చినా ఆయనకు టీడీపీ కార్యకర్తలు సహకరించడం లేదు.
బాబు మార్కు వెన్నుపోట్లు
బీజేపీతో పొత్తు కోసం తహతహలాడిన చంద్రబాబు, ఆ ముచ్చట తీరాక ఇప్పుడిక తన మార్కు వెన్నుపోటు రాజకీయాలను కమలనాథులకు రుచి చూపిస్తున్నారు! పొత్తును చివరిదాకా వ్యతిరేకించిన కిషన్‌రెడ్డిని టార్గెట్ చేసి వ్యతిరేకిస్తున్నారు! బీజేపీ సీనియర్లలో పలువురిని తనవైపు తిప్పుకుని... వారికి, కిషన్‌కు మధ్య తీవ్ర అగాథం సృష్టించారు. దాంతో ఓ దశలో వారు కిషన్‌పై ఏకంగా పార్టీ అధినాయకత్వానికే ఫిర్యాదు చేశారు కూడా! బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగరరావు, కె.లక్ష్మణ్ తదితరులైతే కిషన్‌ను పూర్తిగా దూరం పెట్టారు. ఇదంతా కూడా బీజేపీ ప్రచార వ్యూహంపై ప్రభావం చూపుతోంది. అంతేగాక, టీడీపీ నుంచి వెళ్లిపోయాడన్న కారణంగా మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి నాగానికి సహకరించొద్దంటూ తమ్ముళ్లకు టీడీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయట!!