జశ్వంత్‌పై బీజేపీ వేటు
ఆరేళ్లపాటు బహిష్కారం
సొంత పార్టీ అభ్యర్థిపై పోటీకి దిగడంతో చర్య
మరో రెబల్ నేత మహారియాపైనా వేటు
న్యూఢిల్లీ: తిరుగుబాటు బావుటా ఎగరేసిన పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్(76)పై బీజేపీ శనివారం రాత్రి వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. రాజస్థాన్‌లోని బార్మర్ నుంచి లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్థిగా సొంత పార్టీ అభ్యర్థిపై పోటీ చేస్తున్న జశ్వంత్ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శనివారం నామినేషన్ ఉపసంహరణకు తిరస్కరించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
చీఫ్ రాజ్‌నాథ్ సింగ్.. జశ్వంత్‌ను ఆరేళ్లపాటు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారని బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. బార్మర్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో జశ్వంత్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం తెలిసిందే. కాగా, పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రాజస్థాన్ నుంచే సికార్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా స్వపక్ష అభ్యర్థిపై పోటీకి దిగిన మరో రెబల్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహారియాను కూడా బీజేపీ శనివారం బహిష్కరించింది. సింగ్, మహారియాల బహిష్కరణ గురించి బీజేపీ ప్రధాన కార్యదర్శి జేపీ నందా.. పార్టీ రాజస్థాన్ కమిటీ చీఫ్ అశోక్ పర్నామీకి తెలియజేశారు.
జశ్వంత్ విషయంలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఆయన పోటీ నుంచి తప్పుకోకపోవడంతో గత్యంతరం లేక వేటు వేశామని పార్టీ సీనియర్ నేత ఒకరన్నారు. రెబల్ అభ్యర్థులందర్నీ ఆరేళ్లపాటు బహిష్కరించనున్నట్లు అంతకుముందు పర్నానీ జైపూర్‌లో చెప్పారు. బీజేపీ నిబంధనావళి ప్రకారం.. పార్టీ అధికారిక అభ్యర్థిపై పోటీచేసే పార్టీ సభ్యుడిని బహిష్కరిస్తారు కనుక జశ్వంత్, మహారియాలపై వేటు వేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. బార్మర్ నుంచి మాజీ కాంగ్రెస్ నేత సోనారాం చౌధురికి బీజేపీ టికెట్ ఇవ్వడం తెలిసిందే.
తప్పుకునే ప్రసక్తే లేదు: జశ్వంత్
అంతకుముందు, ఎన్నికల బరి నుంచి తాను తప్పుకునేది లేదని జశ్వంత్ సింగ్ స్పష్టం చేశారు. కాగా జశ్వంత్‌ను పోటీ నుంచి విరమింపజేసేందుకు బీజేపీ నేతలు శనివారం శాయశక్తులా ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. పార్టీ నేతలు పలువురు ఆయన్ను సంప్రదించారని పోటీ నుంచి తప్పుకునేలా గట్టిగా కృషి చేశారని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జశ్వంత్‌సింగ్ శనివారం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఎన్నికల బరి నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.