ఇద్దరు సైనికుల యుద్ధభూమి బార్మేర్ | Two soliders battle it out in Barmer | Sakshi
Sakshi News home page

ఇద్దరు సైనికుల యుద్ధభూమి బార్మేర్

Published Tue, Mar 25 2014 5:22 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

Two soliders battle it out in Barmer

బార్మేర్ నియోజకవర్గం.... భారత-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇసుక మేటల ఏడారి జిల్లా ఇది. మామూలుగా వార్తలకు ఆమడల దూరంలో ఉండే బార్మేర్ ఇప్పుడు హఠాత్తుగా పతాకశీర్షికలకెక్కింది.

బిజెపి సీనియర్ నేత, మాజీ విదేశవ్యవహారాల మంత్రి జస్వంత్ సింగ్ కు బిజెపి టికెట్ నిరాకరించడం, ఆ 76 ఏళ్ల వృద్ధ నేత కన్నీరుమున్నీరవుతూ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడంతో ఇప్పుడు దేశమంతా బార్మేర్ గురించి చర్చిస్తోంది.

రాజస్థాన్ రాజకీయాల ఉక్కుమహిళ వసుంధరారాజే తోటి క్షత్రియుడన్నది సైతం పట్టించుకోకుండా గెలుపుగుర్రం కల్నల్ సోనారామ్ చౌధురికి టికెట్ ఇప్పించింది. దీంతో మాజీ సైనికులు ఇద్దరూ ఎదురెదురుగా నిలిచి ఎన్నికల యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. గెలిచే అవకాశాలు ఎక్కువగా సోనారామ్ కే ఉన్నాయన్నది బిజెపి ఎన్నికల సమితి అభిప్రాయం. బార్మేర్ లో జాట్ వోటర్లు చాలా ఎక్కువ. జాట్ ఉద్యమానికి సోనారామ్ నాయకుడు. కాబట్టి ఆయన గెలుపు సుసాధ్యమనేది బిజెపి అంచనా. మంగళవారం ఆయన నామినేషన్ కి ముఖ్యమంత్రి వసుంధరా రాజే తాను హాజరుకావడమే కాదు, సకల సామంత దండనాథులతో కలిసి మరీ వచ్చారు.


జాట్ ఓట్లే కీలకం
రాజస్థాన్ లోని 25 ఎంపీ సీట్లలో బార్మేర్ ఒకటి. అంతే కాదు. రాష్ట్రంలోని అతిపెద్ద ఎంపీ నియోజకవర్గం ఇది. ఇందులో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గంలో రాజపుత్రులు, జాట్లు, షెడ్యూల్డు కులాలు, మైనారిటీలు ఎక్కువగా ఉంటారు. షెడ్యూల్డు కులాలు, మైనారిటీలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారు. రాజపుత్రులు బిజెపితో ఉంటారు. కాబట్టి జాట్ ఓట్లే కీలకం.

కాంగ్రెస్ కంచుకోట
మొదటినుంచీ బార్మేర్ కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటి వరకూ జరిగిన 15 లోకసభ ఎన్నికల్లో 9 సార్లు కాంగ్రెస్ గెలిచింది. బిజెపి కేవలం 2004 లో మాత్రమే గెలిచింది. రెండు సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. 2009 లో కాంగ్రెస్ జాట్ వర్గీయుడైన హరీశ్ చౌదరికి టికెట్ ఇచ్చింది. బిజెపి వసుంధర సన్నిహితుడు, రాచకుటుంబానికి చెందిన మానవేంద్ర సింగ్ కి టికెట్ ఇచ్చింది. చివరికి హరీశ్ దే పై చేయి అయింది. అందుకే ఈ సారి బిజెపి క్షత్రియుడికి కాక జాట్ కి టికెట్ ఇచ్చింది.

బిజెపి వ్యూహం ఫలిస్తుందా?
పైగా జస్వంత్ సింగ్ కి ఈ నియోజకవర్గంలో పెద్దగా పట్టు లేదు. ఆయన గత లోకసభ ఎన్నికల్లో డార్జీలింగ్ నుంచి, గూర్ఖా జనముక్తిమోర్చా సాయంతో లోకసభకి ఎన్నికయ్యారు.  గత పదేళ్లుగా ఆయన బార్మేర్ ను పట్టించుకోలేదు. 10 జనపథ్ సన్నిహితుడు, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అయిన హరీశ్ చౌధరిని ఆయన తట్టుకోలేరన్న కారణంతోనే ఆయనను బిజెపి పక్కన బెట్టింది. పైగా బార్మేర్ లోకసభలోని ఎనిమిది అసెంబ్లీ సీట్లలో ఏడు బిజెపి చేతిలో ఉన్నాయి. స్థానిక కాంగ్రెస్ దిగ్గజాలు చాలా మంది రాజకీయాలనుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. కాబట్టి కులంబలం తోడైతే బార్మేర్ ని గెలుచుకోవడం సులభమని బిజెపి భావిస్తోంది.

పాపం జస్వంత్ సింగ్!
మొత్తం మీద జస్వంత్ సింగ్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఇండిపెండెంట్ గా మొదలై ఇండిపెండెంట్ గానే అంతమౌతుందా? ఆయన 47 ఏళ్ల క్రితం తొలిసారి రంగంలోకి దిగినప్పుడు ఇండిపెండెంట్ గా పోటీచేసి 17 వేల ఓట్లు సంపాదించుకున్నారు. ఓడిపోయారు. ఒక సారి జోధ్ పూర్, ఒక సారి చిత్తోడ్ గఢ్ ఇలా నియోజకవర్గాలు మారుస్తూ వచ్చారాయన. ఇప్పుడు ఈ సారి ఇండిపెండెంట్ గా మళ్లీ పోటీచేస్తున్నారు. ఒక వేళ గెలిచినా ఇదే ఆయనకు చివరి ఎన్నిక అవుతుంది. ఎందుకంటే 2019 నాటికి ఆయనకు 80 ఏళ్లు దాటిపోతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement