నకిలీల గుప్పెట్లో కమలం
బీజేపీ నాయకత్వంపై జశ్వంత్ నిప్పులు
పార్టీని బయటివాళ్లు ఆక్రమించారు
సిద్ధాంతాన్ని గౌరవించని
వారి చేతుల్లో పార్టీ నాకు టికెట్ నిరాకరించడం ఇది రెండోసారి
బీజేపీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ
(రాజస్థాన్): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యవస్థాపకుల్లో ఒకరైన జశ్వంత్‌సింగ్ (76) పార్టీ నాయకత్వంపై శనివారం నిప్పులు చెరిగారు. పార్టీ నకిలీల గుప్పెట్లోకి వెళ్లిపోయిందని, పార్టీని బయటివాళ్లు ఆక్రమించుకున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో చివరిసారిగా తన స్వరాష్ట్రమైన రాజస్థాన్‌లోని బార్మర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్న తనకు పార్టీ అధిష్టానం టికెట్ నిరాకరించడంపై జశ్వంత్ ఒకింత ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు.
‘‘బీజేపీపై దురాక్రమణ జరిగింది. పార్టీ సిద్ధాంతాలపై ఎన్నడూ ఎలాంటి గౌరవమూ లేని బయటివాళ్లు పార్టీని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇది దురదృష్టకరం. పార్టీ స్వభావం, నైజం మారిపోయింది’’ అని జోధ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. అసలైన బీజేపీకి, నకిలీ బీజేపీకి మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించే వారు.. పార్టీని దురాక్రమించినది ఎవరో, వారికి లభించిన ప్రయోజనాలు ఏమిటనేది ఆలోచించాలన్నారు. పార్టీని నిర్మించటానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె.అద్వానీలు చేసిన కృషిని గుర్తుచేస్తూ.. ఇప్పుడు పార్టీ ఎక్కడికి పోతోందో ప్రశ్నించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం డార్జిలింగ్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జశ్వంత్ పార్టీ అగ్రనేతలు వాజపేయి, అద్వానీలకు సన్నిహితుడిగా పేరుగాంచారు.
తనను పక్కనపెట్టి.. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సోనారామ్‌చౌదరికి బార్మర్ లోక్‌సభ స్థానం నుంచి టికెట్ కేటాయించటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. బార్మర్ టికెట్ కేటాయింపు అంశంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజె వైఖరికి పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘‘పార్టీ నాకు ఇలా చేయటం ఇది రెండోసారి. ఇప్పుడు ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదననూ అంగీకరించే అవకాశమే లేదు’’ అని జశ్వంత్ స్పష్టం చేశారు. ఆయన బీజేపీకి రాజీనామా చేసి, బార్మర్ సీటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఈ విషయమై సోమవారం బార్మర్‌లో తన నిర్ణయాన్ని ప్రకటించే అవశకాశముంది. మరోవైపు అద్వానీ అనుచరుడు, తూర్పు అహ్మదాబాద్ సిట్టింగ్ ఎంపీ హరిన్ పాఠక్‌కు పార్టీ మొండిచేయి చూపింది. ఈ స్థానంలో ఆయనకు బదులు ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్‌ను బరిలోకి దింపింది.
సేవలను వినియోగించుకుంటాం: రాజ్‌నాథ్
జశ్వంత్‌సింగ్‌ను బుజ్జగించేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఆయన సీనియర్ నాయకుడని, పార్టీ కోసం ఆయన సేవలను తగినవిధంగా వినియోగించుకుంటామని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఢిల్లీలో మీడియాతో వ్యాఖ్యానించారు.
టికెట్ నిరాకరణ బాధించింది: సుష్మ
భోపాల్: జశ్వంత్‌సింగ్‌కు అధిష్టానం లోక్‌సభ టికెట్ నిరాకరించడం వ్యక్తిగతంగా తనను బాధించిందని బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. అయితే కారణం లేకుండానే పార్టీ అటువంటి అసాధారణ నిర్ణయం తీసుకోదని శనివారం భోపాల్‌లో వ్యాఖ్యానించారు.