
విద్యార్ధుల వీపెక్కిన బిజెపి అభ్యర్థి
ఎంతో మందిని తొక్కితే కానీ రాజకీయాల్లో పైకెక్కలేరంటారు. ఈ మాటను అక్షరాలా నమ్మినట్టున్నారు బిజెపి రాజ్ కోట్ ఎంపీ నియోజకవర్గం అభ్యర్థి మోహన్ కుందరియా.
ఎంతో మందిని తొక్కితే కానీ రాజకీయాల్లో పైకెక్కలేరంటారు. ఈ మాటను అక్షరాలా నమ్మినట్టున్నారు బిజెపి రాజ్ కోట్ ఎంపీ నియోజకవర్గం అభ్యర్థి మోహన్ కుందరియా. అందుకే పసి పిల్లల వీపులపై ఎక్కి తొక్కేశారు.
రాజకోట్ లోని స్వామినారాయణ మందిరంలో పిల్లల కోసం ఒక యోగశిక్షణ శిబిరం ఏర్పాటైంది. బిజెపి అభ్యర్ధి కుందరియా అక్కడికీ వెళ్లారు. ఆయన తాను రాజకీయ యోధాగ్రేసరుడినే కాదు, వ్యాయామ యోగాగ్రేసరుడిని కూడా అని నిరూపించుకునేందుకు తానూ యోగా చేసి చూపించారు.
అంతటితో ఆగకుండా బాలలంతా కలిసి వంతెనగా ఏర్పడితే వారి వీపులు ఎక్కి తొక్కుకుంటూ నడిచేశారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో బాగా ప్రచారం పొందడంతో బిజెపి ఇరకాటంలో పడింది. ఎలా సర్ది చెప్పుకోవాలో తెలియక నీళ్లు నములుతోంది.