నేనొస్తానంటే...మీరొద్దంటారా..!
జలుమూరు, న్యూస్‌లైన్:ఓడలు బండ్లు .. బండ్లు ఓడలు అవుతాయన్న సామెత నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ నేతలకు అచ్చంగా సరిపోతుంది. ఇప్పటికే వైఎస్సార్ సీపీని తట్టుకోలేని టీడీపీ నేతలకు.. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు మరొక సమస్య వచ్చి పడింది. బీజేపీతో పొత్తుపెట్టుకోవడం టీడీపీకి కలిసిరాని అంశమని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన బగ్గు లక్ష్మణరావు ప్రచారానికి వస్తాడన్న సమాచారం టీడీపీ నేతలను కలవరపెడుతోంది. సామాన్య కార్యకర్తలు ప్రచారానికి వస్తే నాలుగు ఓట్లు వస్తాయని, వారికి సకల మర్యాదలు చేసి ప్రచారానికి స్వాగతిస్తున్న నాయకులు జిల్లా సీనియర్ నేత, ఎంతో చరిత్ర గల కుటుంబం, సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న లక్ష్మణరావును రావద్దని చెప్పడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నో ఎన్నికల్లో చిన్నచిన్న గొడవలకు అలక పాన్పుఎక్కిన లక్ష్మణరావును స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు వంటి నేతలు బతిమిలాడి ప్రచారానికి తీసుకెళ్లేవారు.
వ్యయప్రయాసలకోర్చేవారు. అలాంటిది ఆయనే స్వయంగా ప్రచారానికి వస్తానంటే... మీరు వస్తే ఓట్లు పడవంటూ నాయకులే ఖరాఖండిగా చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. 1980-81లో కోటబొమ్మాళి మండలం సమితి అధ్యక్షుడిగా సుశీలమ్మదొరను ఓడించడం, 1984 ఎన్నికల్లో అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావుపై గెలవడం, అలాగే జెడ్పీ చైర్మన్ పదవితోపాటు ఎన్నో సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని సైతం ఇరుకున పెట్టి కింజరాపు ఎర్రన్నాయుడుపై ధిక్కార స్వరాన్ని వినిపించిన సమర్ధత లక్ష్మణరావుది. అలాంటిది ఆయనను కింజరాపు అచ్చెన్నతో పాటు రామ్మోహన్‌నాయడు కూడా ప్రచారానికి ఆహ్వానించడం లేదు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన ప్రచారానికి వస్తానంటే వద్దంటున్నారంటే... ఆయన టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయిస్తారన్న అపనమ్మకం నాయకుల్లో ఉన్నట్టు బోగట్ట. ఎలాగా విజయం సాధించలేం... కనీసం గట్టి పోటీ అయినా ఇవ్వాలన్న ఉద్దేశంలో టీడీపీ నేతలు ఉన్నట్టు సమాచారం. ఆయనను దూరం పెట్టడానికి కళా వెంకట్రావు వర్గమే అసలు కారణమని. ఏది ఏమైనా ప్రస్తుత ఎన్నికల్లో ఎంతో బిజీగా ఉండాల్సిన లక్ష్మణరావు కింజరాపు వర్గం వేసిన పాచికలో ప్రస్తుతం బందీగా ఉన్నారని పలువురు గుసగుసలాడుతున్నారు.