
ఉక్కిరి బిక్కిరి
దానం, వీహెచ్ ఎదురీత
ఖైరతాబాద్‌లో గడప దాటని.. దానం
సికింద్రాబాద్‌లో వెనకబడి పోయిన జయసుధ
గ్రేటర్‌లో వీఐపీలకు ముచ్చెమటలు పడుతున్నాయి. బుల్లెట్‌లా దూసుకుపోతున్న ప్రత్యర్థుల ప్రచార హోరుతో హేమాహేమీలనుకున్న అభ్యర్థులు హడలిపోతున్నారు.అంబర్‌పేటలో కాంగ్రెస్ అభ్యర్థి వి.హన్మంతరావు బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డితో గట్టిపోటీని ఎదుర్కొంటుండగా, ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి, పీజేఆర్ కూతురు విజయారెడ్డి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. సికింద్రాబాద్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ ప్రచారంలో పూర్తిగా వెనకబడి పోయారు.
- సాక్షి, సిటీబ్యూరో
నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాకు తోడు రాష్ర్ట కేబినెట్ మంత్రిగా అన్ని నియోజకవర్గాల్లో అన్నీ తానై వ్యవహరించే ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రస్తుతం నియోజకవర్గ గడపదాటని స్థితి నెలకొంది. గత ఐదేళ్లలో నియోకజవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటంతో పాటు ఆయన అనుచరల భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఉద్యమ కారులపై దాడులకు పూనుకుని సంపాదనే లక్ష్యంగా పని చేస్తున్నారనే ఆరోపణలతో సాధారణ జనమంతా దూరమైయ్యారు. దీనికి తోడు ఖైరతాబాద్ నియోకజవర్గంలో బలమైన అభిమానులు, అనుచరవర్గం ఉన్న పీజేఆర్ కూతురు విజయారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఆమె ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్వాగతం లభిస్తోంది.
ఈ నియోకజవర్గంలో వైఎస్సార్ - పీజేఆర్ అభిమానులు విజయారెడ్డి వెంట నడుస్తుండటంతో దానం నాగేందర్‌కు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. విజయారెడ్డి ప్రచారానికి వెళుతున్న కాలనీల్లో విద్యుత్ కోత విధించేలా చూడటం, క్రియాశీలక కార్యకర్తలకు డబ్బు ఎర వేయటం, ఆయా సంఘాలకు మూడు దఫాలుగా మొత్తాన్ని ముట్ట చెబుతానని హామీలతో కాలం గడిపే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు నియోకజవర్గంలో ఫలితాన్ని శాసించే స్థితిలో ఉన్న ముస్లిం, క్రిస్టియన్‌లు దానం తీరుకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయిం చటంతో ఆయన పరిస్థితి గందరగోళంగా మారింది. కేవలం డబ్బు పంపిణీతోనే గట్టెక్కే ఆలోచనతో పావులు కదుపుతున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో ఊపందుకుంది.
లష్కర్... మసకబారిన సినీ గ్లామర్
సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్‌ఏ, సినీ నటి జయసుధ ప్రచారంలో పూర్తిగా వెనకబడి పోయారు. తొలుత తనకు ఎంఎల్‌ఏ టికెట్ ఇస్తారా? లేదా? అన్న అయోమయంలో కాలం గడిపిన జయసుధ ప్రచారాన్ని ఆలస్యంగా ప్రారంభించారు.గత ఎన్నికల్లో ఆమెకు అండగా నిలిచిన ఆదం విజయ్‌కుమార్ ప్రస్తుతం ఇదే నియోకజవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి దూసుకుపోతున్నారు. ఆదం వెంట బలమైన కాంగ్రెస్ కేడర్, అభిమానులు వెంట నడుస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ గ్లామర్ ఒక్క సారిగా తగ్గిపోయింది. ఐదేళ్లు ఎంఎల్‌ఏగా పనిచేసినా కూడా బస్తీల వారీగా సమస్యలపై అవగాహన పెంచుకోకపోవటం, కార్యకర్తలు, ముఖ్య నాయకులను సైతం గుర్తు పట్టలేని పరిస్థితి ప్రస్తుతం జయసుధ ను పరేషాన్ చేస్తోంది. దీనికి తోడు తెలంగాణ తామే తెచ్చామంటూ టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావు సైతం కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను గండికొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.
అంబర్‌పేటలో ఢిల్లీకి..గల్లీకి పోటీ
ముఖ్యమంత్రి రేసులో తాను ఉన్నానంటూ ఎన్నికల గోదాలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వి.హన్మంతరావు పరిస్థితి ఆశాజనకంగా లేదు. బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డితో తీవ్ర పోటీని ఎదుర్కుంటున్నారు. అధ్యక్షునిగా ఉన్న కిషన్‌ర్‌రెడ్డి పని ఒత్తిడి ఎలా ఉన్నా.. వారంలో ఐదు రోజులు నియోజకవర్గంలో పర్యటించటం అలవాటుగా చేసుకోవటం కిషన్‌రెడ్డికి కలిసి వచ్చింది. అంబర్‌పేటకు చెందిన హన్మంతరావు అధిక సమయం ఢిల్లీలోనే గడిపేయటంతో ప్రస్తుతం నియోజక వర్గంలో గల్లీకి - ఢిల్లీకి పోటీలా మారింది.
కిషన్‌రెడ్డి గల్లీగల్లీలోనూ అక్కడి బస్తీ నాయకుల పేర్లతో పలకరిస్తుంటే.. అంబర్‌పేట వాసినని చెప్పుకునే హన్మంతరావు ఆయా బస్తీల రూట్లు కూడా మరిచిపోవటం ఆయనకు ఇబ్బందికర అంశంగా మారింది. దీంతో కిషన్‌రెడ్డి గల్లీకి - ఢిల్లీకి మధ్యే పోటీ అంటూ అంబర్‌పేటలో దూసుకువెళుతున్నారు.. హన్మంతరావు గత 15 ఏళ్లుగా అంబర్‌పేటలోనే తాను నివాసముంటున్నా ఇక్కడి బస్తీల అభివృద్ధికి కృషి చేయలేదనే అపవాదు ఉంది. తన రాజ్యసభ నిధుల నుండి కనీసం రెండు శాతం నిధులు కూడా అంబర్‌పేట నియోజకవర్గానికి కేటాయించలేదన్న అంశం కూడా అంబర్‌పేట ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశమైంది.