
పీఠం కోసం దేశం విచ్ఛిన్నం
మోడీపై రాహుల్ ఆరోపణలు
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ పాలనలో 20 వేల మంది మహిళలు అదృశ్యం
రాయ్‌పూర్, ఉదర్‌బాండ్: ప్రధాని పీఠం కోసం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ దేశాన్ని సైతం ముక్కలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని, కర్హిబాదర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఫులోదేవినేతమ్ తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. అంతకుముందు అసోంలోని ఉదర్‌బాండ్‌లో జరిగిన సభలోనూ ఆయన పాల్గొని మాట్లాడారు. యథావిధిగా బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
మోడీప్రధాని కావాలనుకుంటున్నారని, అందుకోసం ఆయన ఏదైనా చేస్తారని, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీ మతం పేరుతో దేశాన్ని విభజిస్తోందని మండిపడ్డారు. ‘‘బీజేపీలో ఒక్క వ్యక్తికే(మోడీ) ప్రపంచంలో అన్నింటి గురించి తెలుసు. దేశంలో ఏం జరిగినా ఆయనకే తెలుస్తుంది. ఆయనే ఈ దేశాన్ని మార్చేయగలరని బీజేపీ భావిస్తోంది’’ అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. బీజేపీలా కాంగ్రెస్ ఒక వ్యక్తి గురించి మాట్లాడదని, ప్రజల పార్టీ అని చెప్పారు. రాజకీయాలంటే ప్రజలేనని, అధికారం వారి చేతుల్లోనే ఉండాలని పేర్కొన్నారు.
1. బీజేపీ మహిళా సాధికారత గురించి మాట్లాడుతోందని, అదేంటో అందరికీ తెలిసిందేనన్నారు. వారి పాలనలో గిరిజన, మైనారిటీ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, గుజరాత్ సీఎం మహిళలపై నిఘాకు పోలీసులను పంపిస్తున్నారని దుయ్యబట్టారు.
2.ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా సామాన్యుడికి శక్తి, హక్కులు కల్పించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని చెప్పారు. అదే గుజరాత్‌లో అయితే ప్రజలు ప్రశ్నించలేరని, అక్కడ సమాచారహక్కు చట్టం లేదన్నారు. వారు అవినీతిని నిర్మూలిస్తామంటారని, కానీ గుజరాత్‌లో లోకాయుక్త లేదని రాహుల్ చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ పాలనపై కూడా రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రాష్ట్రంలో బీజేపీ పాలనలో 20 వేల మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారని పేర్కొన్నారు.