
వైఎస్సార్‌సీపీని చూసి బాబు బెంబేలు
పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో కింగ్ అవుతుండగా, తెలంగాణ రాష్ట్రంలోనూ కీలక భూమిక పోషించనుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తెలిపారు. సీమాంధ్రలో అధికారంలోకి రాబోతున్న వైఎస్సార్‌సీపీని చూసి చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీ పరిస్థితి అంతంతేనని, ఈ పరిస్థితుల్లో చంద్రబాబు డిప్రెషన్‌లో పడ్డారని, దీంతో టీడీపీని పిచ్చోడి చేతిలో రాయిలా ఉపయోగిస్తున్నాడని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబుకి ఓటు వేసే చోట సీటు లేదని, సీటున్న చోట ఓటు లేదని.. ఆయన తనకు, తన పార్టీ గుర్తుకు ఓటేసుకోలేని దుస్థితిలో పడ్డారన్నారు.
రాజ్యాంగంపై బాబుకు గౌరవం లేదు..
చంద్రబాబునాయుడికి రాజ్యాంగం, చట్టాలపై గౌరవం లేదని గట్టు రామచంద్రరావు అన్నారు. ఎన్నికల్లో ఓటు ఎవరికి వేశామనే విషయాన్ని బహిర్గతం చేయకూడదన్న ఇంగిత జ్ఞానం సైతం ఆయనకు లేదన్నారు. ఓటు వేసి బయటకు వచ్చి రెండు ఓట్లు బీజేపీకే వేశానని చెప్పుకుంటున్నారంటే.. వారు అనుమానపడతారనా? లేక తమ లవ్వాటను నిరూపించుకునే ప్రయత్నం చేశారా? అని ప్రశ్నించారు.
జైరాంకు ఈ స్థాయి రావడం వైఎస్ చలువే..
సీమాంధ్రలో మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు వైఎస్సార్‌సీపీకి ఏకపక్షంగా వస్తాయన్నారు. ఈ పరిస్థితులతో బెంబేలెత్తిపోతున్న చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, జైరాంరమేష్ వైఎస్సార్‌సీపీపై దాడులకు సిద్ధపడుతోందన్నారు. జైరాం రమేష్‌కు జుట్టు పెరిగింది కాని, బుర్ర పెరగలేదన్నారు. జైరాం రమేష్‌కు ఎంపీ స్థాయి, మంత్రి పదవి అన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి, తెలుగు జాతి పెట్టిన బిక్ష అని పేర్కొన్నారు. ‘‘అలాంటి తెలుగుజాతిని ముక్కలు చేసిన నీవు.. జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయంటున్నావే.. మరి 13 ఏళ్లు రాజీవ్ గాంధీపై బోఫోర్స్ కేసు ఉంది కదా? మరి రాజీవ్‌గాంధీ రాజకీయాలకు పనికిరాడ ని మాట్లాడు..’’అని పేర్కొన్నారు. ‘‘జగన్ ఎందుకు జైలుకు వెళ్లారో నీకు తెలియదా? అది నీవు, టీడీపీ పన్నిన కుట్ర కాదా? జగన్‌పై ఆరోపణలు చేస్తూ లేఖ రాసిన శంకర్‌రావుకు, ఆరోపణలు చేసిన డీఎల్ రవీంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇచ్చింది మీరు కాదా?’’ అని ప్రశ్నించారు.
‘‘వైఎస్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి, వారి కుటుంబాన్ని వేధించినప్పుడు ఏం చేశావు? ఇప్పుడు ఆయన ఆత్మ క్షోభిస్తుందని అంటున్నావా? వైఎస్సార్‌సీపీ కుబేరుల పార్టీ అని విమర్శలు చేస్తున్నారే.. కాంగ్రెస్ పార్టీ గోచిగుడ్డ పార్టీనా? చొక్కా లాగు లేకుం డా కాంగ్రెస్ నాయకులు గుడ్డలు కట్టుకొని తిరుగుతున్నారా? కాంగ్రెస్ వారిపై ఆరోపణలు లేవా? కోట్ల ఆస్తులు లేవా? కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తులను ఒక్కసారి చూసుకో.. వైఎస్సార్‌సీపీలోకి వ్యాపారం కోసం పోతున్నారా? మరి టీడీపీలోకి ఎందుకు పోతున్నారు? కాంగ్రెస్‌ను పాడెపై పడుకొబెట్టి.. దానిని పట్టుకొని లెమ్మంటే లేవకుంటే.. పక్కవారిపై ఏడిస్తే ఏం వస్తది’ అన్నారు. వైఎస్సార్‌కు ప్రజాభిమానం ఉందని, ప్రజాదరణ నుంచి జగన్ వస్తున్నారని, 30 వేల కిలోమీటర్లు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. ఆయన అధికారంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.