గులాబీ దళాధిపతి కేసీఆర్ సుడిగాలి పర్యటనకు ఆయన అనారోగ్యం అడ్డంకిగా మారింది.దీంతో ఆయన ప్రసంగం విందామని గంపెడాశతో వచ్చిన అభిమానులు నిరాశపడ్డారు. పదకొండు చోట్ల పర్యటించాలనుకున్నా కొన్నింటిని రద్దుచేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ జరిగిన సభలే టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కాస్త జోష్‌ను నింపాయి. మిగతా ప్రాంతాల్లో కూడా మరోసభ ద్వారా ఓటర్లను ఆకర్షించుకోవాలని ఆ పార్టీ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లాలో జరిగిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడి కేసీఆర్ సుడిగాలి పర్యటనకు జనం భారీగానే తరలివచ్చారు. ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా జన సమీకరణ జరిగినా కేసీఆర్ అనారోగ్యం కారణంగా ఆయన ప్రసంగం వినేందుకు వచ్చిన వారు నిరాశ చెందారు.
నాగర్‌కర్నూలు, గద్వాల, కొత్తకోట, జడ్చర్ల మినహా ఎక్కడా కేసీఆర్ ప్రసంగం పావుగంటకు మించి కొనసాగలేదు. మధ్యాహ్నం 12 గంటలకే కేసీఆర్ కల్వకుర్తి సభలో పాల్గొనాల్సి ఉన్నా రెండు గంటలు ఆలస్యంగా హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్నారు. కాళ్ల నొప్పులు, జ్వరంతో బాధ పడుతున్నందున ఎక్కువ సేపు మాట్లాడలేక పోతున్నట్లు వివరణ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత నాగర్‌కర్నూలుకు రావాల్సి ఉన్నా నేరుగా అచ్చంపేటకు వెళ్లి ఎనిమిది నిముషాల్లో ప్రసంగాన్ని ముగించారు. నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, శాంతినగర్, గద్వాల సభలకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. అక్కడ నుంచి నారాయణపేట, మక్తల్, కోస్గి సభలకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉన్నా అప్పటికే చీకటి పడటంతో పర్యటన రద్దు చేసుకున్నారు. గద్వాల నుంచి రోడ్డు మార్గం ద్వారా కొత్తకోట, జడ్చర్ల సభలకు హాజరై హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తితో ఉన్న జనం నిముషాల వ్యవధిలో సభ ముగియడంతో నిరాశ చెందారు.
మేనిఫెస్టోపైనే దృష్టి: నాగర్‌కర్నూలు సభలో మాత్రమే సీబీఐ విచారణ అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్ మిగతా చోట్ల టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను వివరించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్, టీడీపీ- బీజేపీ కూటమిపై అక్కడక్కడా విమర్శలు సంధించారు. డబుల్ బెడ్‌రూంలతో కూడిన గృహాలు, వృద్దాప్య, వితంతు, వికలాంగులకు పించన్లు, రుణమాఫీ వంటి అంశాలను అన్ని చోట్లా ప్రస్తావించారు. జిల్లాలోని ప్రధాన సమస్యలు ప్రస్తావిస్తూ 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాననే అంశంపై ప్రధాన హామీ ఇచ్చారు.
జూపల్లి కృష్ణారావును రాష్ట్రమంత్రిగా, మంధా జగన్నాధ్‌ను కేంద్ర మంత్రిగా చేస్తానంటూ పరోక్షంగా హామీ ఇచ్చారు. గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డిల గాలి బలంగా ఉందంటూ ప్రోత్సహించే రీతిలో వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట, మక్తల్, కోస్గి సభలకు కేసీఆర్ గైర్హాజరు కావడంతో కార్యకర్తలు, నాయకులు నిరాశ వ్యక్తం చేశారు. ఈ నెల 28న ప్రచార పర్వం ముగిసే లోగా మూడు నియోజకవర్గాలకు అనువైన చోట మరో సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ సభకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు వెల్లడించారు. శుక్రవారం సభలు జరిగిన తీరుపై అభ్యర్థులు, నేతలు జన స్పందనపై అంచనాలు వేసుకుంటున్నారు.
‘కారుకు...కిక్
Published Sat, Apr 26 2014 3:27 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement