
నగదు బదిలీ మేనిఫెస్టోలో లేదేం?
చంద్రబాబును ప్రశ్నించిన రఘువీరా
శ్రీకాకుళం/గరివిడి, నగదు బదిలీ పథకం అమలుచేస్తామని గత ఎన్నికల్లో చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుత ఎన్నికల పార్టీ మేనిఫెస్టో లో ఆ అంశాన్ని ఎందుకు పొందుపరచలేదని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రశ్నించారు. ప్రజలను మోసగించేందుకు బాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తారని విమర్శించారు. శ్రీకాకుళం లో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో, విజయనగరం జిల్లా గరివిడిలో విలేకరులతోను ఆయన మాట్లాడారు.
నగదు బదిలీ పథకాన్ని గతంలో ప్రజలు నమ్మలేదని, అందుకే ఈసారి దానిని వదిలేసి మరికొన్ని మోసపూరిత హామీలతో ముందుకు వస్తున్నారన్నారు. అధికారం కోసం ఏ గడ్డినైనా కరిచే మనస్తత్వం చంద్రబాబుదన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, పార్టీ మేనిఫెస్టోను వారివద్దకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.