పంటలు పండవు. కరెంటు సరిగా ఉండదు. వానలు కురవవు. అప్పులు పుట్టవు. కరెంటోళ్ల వేధింపులు. ఒక్కటేమిటి.. అన్నదాత కష్టాలు చాంతాడు. తొమ్మిదేళ్ల వారి కడుపు మంట చల్లారేది కాదు. చంద్రబాబు పేరెత్తితేనే రైతులు ఒంటి కాలుపై లేస్తున్నారు. రెండు సార్లు అధికారానికి దూరమైన ఆయన.. ఇప్పుడు రైతులకు అది చేస్తా.. ఇది చేస్తానని నమ్మబలుకుతున్నా రైతులు ససేమిరా అంటున్నారు. ఒక్కసారి మొగ్గు చూపితే ఐదేళ్లు మళ్లీ నరకం చూడాల్సిందేనని జడుసుకుంటున్నారు. ఎవరెన్ని చెప్పినా రైతుల కష్టమెరిగిన నాయకునికే పట్టం కడతామని భీష్మిస్తున్నారు. ఉచిత విద్యుత్‌ను అమలు చేసిన వైఎస్సే మా దేవుడని మనసారా కీర్తిస్తున్నారు.
వర్షాలు అంతంతే..
నాకు మూడెకరాల పొలం ఉంది. బ్యాంకులో అప్పులు.. విద్యుత్ బకాయిలతో ఉక్కిరిబిక్కిరయ్యాను. చంద్రబాబు పాలనంతా కరువు కాటకాలే. వర్షాలు కూడా అంతంతే. కరెంటోళ్ల మాటలు భరించలేకపోతుంటిమి. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చినాక రూ.8,500 విద్యుత్ బకాయి మాఫీ అయ్యింది. బ్యాంకులో రుణం తీసుకుని బోరు వేయించి బంగారు పంటలు పండిస్తున్నా.
- జయరాము, కొల్మాన్‌పేట
రోజూ నరకమే
తొమ్మిదేళ్ల బాబు పాలనలో నరకం చూశాం. రైతులంటే ఆయనకు ఏమాత్రం గిట్టదు. అధికారంలో ఉండగా మా బాగోగులు పట్టించుకోని ఆయన ఎన్నికలప్పుడు ఏవేవో హామీలిస్తాడు. ఆ చీకటి రోజులను ఎలా మర్సిపోతాం. ఎన్ని సెప్పినా రాజన్న పాలన తిరుగులేనిది. ఉచిత విద్యుత్తు రైతులకు వరం. నాలాంటి ఎంతో మంది రైతులు ఇంతోఇంతో బాగుపడినారంటే అది వైఎస్ చలువే. - పామన్న, కామవరం
ముఖంల నవ్వు లేకుంటుండె
చంద్రబాబు ముఖంల ఎప్పుడూ నవ్వు లేకుంటుండె. అందుకేనేమో పంటలు కూడా సరిగా పండుత లేకుంటుండె. నాకు ఐదెకరాల పొలం ఉంది. ఒక మోటారుతో మెట్ట పంటలు సాగు చేస్తుంటి. నెలకు రూ.250 బిల్లు వచ్చేది. కరెంటోళ్లు బిల్లు కట్టమని ఎంటపడుతుండ్రి. సానా కస్టపడినాం. వైఎస్ ముఖ్యమంత్రి అయినాక రూ.30 వేల విద్యుత్ బకాయి రద్దయింది. ఆయన దేవుడు.
- కె.సి.వి.సుబ్బారెడ్డి, చెన్నూరు
ఆ చీకటి రోజులు వద్దు
కరెంటు బాగుంటేనే రైతుల బతుకుల్లో వెలుగు నిండుతాది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఎప్పుడొస్తుండెనో ఏమో తెలిసేది కాదు. కళ్లలో వొత్తులేసుకుని ఎదురుచూస్తుంటిమి. ఇంటిల్లిపాదీ పొలం కాడ వంతులేసుకుని కాపలా కాస్తుంటిమి. బిల్లులు కట్టకపోతే జైల్లో కూడా పెట్టించినారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చినాక రైతులు బాగుపడినారు.
- మోహన్‌రెడ్డి, చిన్నకొప్పెర్ల
ఉచిత విద్యుత్ వరం
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ అన్నదాతకు వరం. ఇప్పుడీ స్థాయిలో ఉన్నారంటే అది ఆయన పుణ్యమే. ఆ మేలు ఎలా మరిచిపోతాం. చంద్రబాబు హయాంలో కరెంటు కష్టాలు ఒకటా రెండా. ఎంతో మంది రైతులు ఆ బాధలకు సచ్చిపోయినారు. వారి ఉసురు తగలకపోదు. అందుకే అప్పటి నుంచి ఆయన అధికారంలోకి రాలేదు. ఇక ముందు కూడా రాడు.
- గోపాల్‌రెడ్డి, కొలుములపల్లె
రైతులంటే బాబుకు గిట్టదు
చంద్రబాబు ఎప్పుడూ హైదరాబాద్ గురించే మాట్లాడుతాడు. పొలాలకెళ్లి వచ్చి చూస్తే కదా మా కస్టాలు తెలిసేది. నెలకు రూ.400 కరెంటు బిల్లు వస్తే బక్క రైతులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాల. పంట పండటమే కస్టమయ్యేది. వాన సినుకులు కూడా కురుస్తలేకుండె. పంట సేతికొచ్చే వరకు నమ్మకంల్యా. మళ్లీ బాబు పాలనంటే భరించే ఓపిక మాకు లేదు. ఆయనను అధికారంలోకి రానివ్వం.
- జి.శ్రీనివాసులరెడ్డి, గోవిందపల్లె
అంతా నష్టమే
బాబు పాలన చేసిన తొమ్మిదేళ్లు నష్టాలే. యానాడు రెండు రాళ్లు మిగల్లేదు. కుటుంబమంతా సేన్ల కాడ పరిస్థితికి ఏడుస్తుంటిమి. వానలు పడక.. పంటలు పండక.. అప్పులోళ్ల ఒత్తిడితో పస్తులుంటుంటిమి. సర్కారు ఆదుకుంటాదనుకుని ఎదురుచూడటమే కానీ బాబు పలకరిచ్చింది లేదు. అన్నదాత కడుపెరిగిన నాయకుడు వైఎస్. అందుకే రైతు సంక్షేమ పాలన సాగించినాడు.
- చిన్నపుల్లయ్య, మెట్టుపల్లి
నీరు పారేది కాదు
కరెంటు కోతలతో పంటలకు నీరు పారిచ్చుకోవడం కస్టమైతుండె. నేను రూ.12 వేల బిల్లు బకాయి పడింటి. కరెంటోళ్లు రాత్రిళ్లు పొలం కాడికొచ్చి తిడుతుండ్రి. ఓసారి స్టార్టర్‌ను కూడా ఎత్తుకుపోయిరి. పంట బాగా పండితేనే మా మూతులు కొంత తెల్లగుంటయి. ఆయన ఉన్నప్పుడు అన్నీ కరువుకాటకాలే. వర్షాలు కూడా సరిగ పడకపోతుండె. వ్యవసాయం మానేద్దామనుకునింటి. - రామేశ్వరెడ్డి, అంబాపురం
బాబు కాలం కరువుకాటకం
Published Sun, May 4 2014 3:29 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement