ఎవరినీ పక్కన పెట్టలేదు:బాలకృష్ణ
ఆయనే వచ్చి పనిచేయాలి జూనియర్ ఎన్టీఆర్‌పై బాలకృష్ణ
విజయనగరం, న్యూస్‌లైన్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం పార్టీ నేత, సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయనగరంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీసీలను ముఖ్యమంత్రిగా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు కదా? మరి సీమాంధ్రలో అలాంటి ప్రకటన ఎందుకు చేయలేదని విలేకరులు ప్రశ్నించగా, దీనికి కొద్దిగా తడబడిన బాలయ్య.. ‘రాష్ట్రానికి చంద్రబాబునాయుడు అవసరం ఉంది’ అని సమాధానమిచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను ఎందుకు పక్కకు పెడుతున్నారని అడగ్గా.. ‘ఎవరినీ పార్టీ పక్కన పెట్టలేదని, ఆయనే వచ్చి పార్టీ కోసం పనిచేయాల’న్నారు. గత ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ కష్టపడ్డారు కదా అని ప్రశ్నించగా, ‘ఆయనను ఎవరు కష్టపడమని చెప్పారు? ఇప్పుడూ కష్టపడమని చెప్పండి’ అన్నారు. పార్టీలో కష్టపడిన వారికి కాకుండా డబ్బులున్న వారికి టికెట్లు ఇచ్చారన్న ఆరోపణలపై మీరేమంటారని ప్రశ్నించగా ‘పార్టీకి కొన్ని అవసరాలుంటాయ’న్నారు. కాగా, విశాఖ జిల్లాలో బాలకృష్ణ రోడ్‌షోకు కనీస జనస్పందన లేకపోవడంతో పర్యటన చప్పగా సాగింది. దీనికితోడు బాలకృష్ణ ప్రచార రథం మరమ్మతులకు గురవడం.. మైకులు పనిచేయకపోవడంతో బాలకృష్ణ అసహనంతో ఎక్కడా పదినిమిషాలకు మించి మాట్లాడలేదు.\